National

బాధ్యతలు చేపట్టగానే ట్విట్టర్ కు వార్నింగ్

కేంద్ర ఐటీ శాఖ నూతన మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే..! బాధ్యతలు స్వీకరించిన వెంటనే ట్విట్టర్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు అశ్విని వైష్ణవ్. భారతదేశంలో నివసించే, పనిచేసే వారందరూ భారతప్రభుత్వ చట్టాలు, నియమాలకు కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చెప్పుకొచ్చారు. ఐటీ నిబంధనల అమలుపై భారత ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య వివాదం కొనసాగుతూ ఉండగా.. భారతదేశంలో ఎవరైనా దేశ నియమాలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు. అశ్విని వైష్ణవ్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కు హెచ్చరికలను జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్‌ మధ్య గత కొంతకాలంగా నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు భారత ధోరణి ఏమిటో ట్విట్టర్ కు తెలిసొచ్చేలా చేస్తున్నాయి. దేశంలో నూతన ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి తీసుకుని రాగా ట్విట్టర్‌ మాత్రం సోషల్‌ మీడియా మార్గదర్శకాలకు కట్టుబడలేదు. అశ్విని వైష్ణవ్‌ బుధవారం కేబినెట్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు రైల్వేశాఖ బాధ్యతలను ఆయన స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్‌) బీఎల్‌ సంతోష్‌ను కలిసిన తరువాత వైష్ణవ్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ నేలపై రూపుదిద్దుకున్న చట్టాలే అత్యున్నతమని, వాటిని పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. నూతన ఐటీ చట్టాలను ట్విట్టర్ ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. దేశంలో నివసించే, పనిచేసేవారు ఇక్కడి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు.

ఢిల్లీ హైకోర్టు భారత నూతన ఐటీ చట్టాలను పాటించకుండా ఉండేందుకు ట్విటర్‌కు రక్షణ కల్పించలేమని ఈరోజు విచారణలో తేల్చి చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. ఈ సాగతీత ధోరణికి స్వస్తి చెప్పాలనే రీతిలో సమాధానం ఇచ్చింది.

ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణలో చీఫ్ కాంప్లయన్స్ అధికారి నియామకంపై ట్విట్టర్ వివరణ ఇచ్చింది. ఎనిమిది వారాల్లో పూర్తిస్థాయి చీఫ్ కాంప్లయన్స్ అధికారి నియామకం పూర్తవుతుందని తన అఫిడవిట్లో వెల్లడించింది. కొత్త ఐటీ నిబంధనల నుంచి ట్విట్టర్‌కు ఎలాంటి మినహాయింపు, రక్షణ ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. ఒకవేళ ఆ నిబంధనల ఉల్లంఘన జరిగితే, చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని స్పష్టం చేసింది. తాజా ఐటీ నిబంధనలను అమలు చేస్తామని పేర్కొంటూ అమెరికాలో నోటరీ అయిన అఫిడవిట్‌ను రెండు వారాల్లోగా సమర్పించాలని జస్టిస్‌ రేఖ పల్లి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ట్విట్టర్ ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. కొత్తగా నియమించిన చీఫ్‌ కంప్లయన్స్‌ ఆఫీసర్, నోడల్‌ ఆఫీసర్‌ తదితర అధికారుల వివరాలను జులై 8లోగా కోర్టు ముందుంచాలని గతంలోనే కోర్టు ఆదేశించింది. గురువారం ట్విట్టర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తాత్కాలిక ప్రాతిపదికన అధికారులను నియమించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. తాత్కాలిక చీఫ్‌ కంప్లయన్స్‌ అధికారిని ఇప్పటికే నియమించామని, భారత్‌లో నివసించే గ్రీవెన్స్‌ అధికారిని, నోడల్‌ ఆఫీసర్‌ను తాత్కాలిక ప్రాతిపదికన ఈ నెల 11న నియమిస్తామని తెలిపారు. వారు తాత్కాలిక అధికారులే అయినా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపడ్తారని వివరించారు.

జూన్‌ 5న కేంద్రప్రభుత్వం ట్విట్టర్‌కు తుది హెచ్చరిక జారీ చేసింది. అయినప్పటికీ ఆ కంపెనీ మాట వినకపోవడంతో సోషల్‌ మీడియా సంస్థలకు ఇస్తున్న ‘మధ్యవర్తిత్వ హోదా’ను ట్విట్టర్‌కు రద్దు చేసి షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. దీంతో ట్విట్టర్‌ వేదికపై ట్వీట్‌ చేసే అంశాలపై తలెత్తే వివాదాలకు ఆ ట్వీట్‌ చేసిన వ్యక్తితోపాటు ట్విట్టర్‌ కంపెనీ కూడా బాధ్యత వహించే పరిస్థితి ఉంది. దీంతో పలు రాష్ర్టాల్లో ట్విట్టర్ పై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 2 =

Back to top button