సంచుల కొద్దీ డబ్బుతో పారిపోయిన అష్రాఫ్‌ ఘనీ..?

0
747

తాలిబాన్లు కాబూల్ కు దగ్గరగా రాగానే ఆఫ్ఘనిస్తాన్ దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు కథనాలు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ ను పునఃనిర్మిస్తానన్న హామీతో అధ్యక్ష పీఠం ఎక్కిన అష్రాఫ్‌ సొంత వైఫల్యాలతో తాలిబన్లను ఎదుర్కోలేక, ప్రభుత్వం కూలిపోతుంటే చూస్తు ఉండటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో దేశం నుంచి పారిపోయారు. అష్రాఫ్‌ ఘనీ ఆఫ్ఘనిస్తాన్ లోనే ఓ గొప్ప విద్యావేత్త, ఆర్థికంగా నష్టపోయిన దేశాలపై అధ్యయనం చేసిన ప్రపంచస్థాయి ఆర్థిక నిపుణుల్లో ఒకరు. అహంకారంతో సొంత నేతలను దూరంపెట్టి ఒక దేశం ఎన్నో కష్టాలు పడేందుకు కారణమయ్యాడు. తిరుగుబాటుదారుల అరాచకాలను అడ్డుకోలేక దేశం విడిచి పారిపోయాడు.

అష్రాఫ్‌ ఘనీ 1949 మే నెలలో ఆఫ్ఘనిస్తాన్ లోని లోగర్‌ ప్రావిన్స్‌లో జన్మించారు. ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లి అమెరికాలోని పలు యూనివర్శిటీల్లో విద్యనభ్యసించారు. పీహెచ్‌డీ పూర్తిచేసిన తర్వాత కాలిఫోర్నియా యూనివర్శిటీ, జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటీల్లో అధ్యాపకుడిగా పనిచేశారు. ఆ తర్వాత 1991లో ప్రపంచబ్యాంకులో చేరారు. ఐక్యరాజ్యసమితిలోనూ పనిచేశారు.

2001లో ఆఫ్ఘనిస్తాన్ తిరిగి వచ్చిన ఘనీ అప్పటి అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌కి సలహాదారుగా ప్రభుత్వంలో చేరారు. 2002 నుంచి 2004 వరకు ఆర్థికమంత్రిగానూ వ్యవహరించారు. ఆ సమయంలో కొత్త కరెన్సీని విడుదల చేయడంతో పాటు పన్ను వ్యవస్థను ఏర్పాటు చేశారు. దేశంలో పాతుకుపోయిన అవినీతిని తరిమికొట్టేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఒక నేతగా ఎదిగాడు. అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని 2009లో ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్ష పదవికి ఘనీ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. 2014లో మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో ఆయన ప్రత్యర్థి అబ్దుల్లాతో అధికారాన్ని పంచుకునేందుకు ఒప్పందం కుదిరింది. 2014 సెప్టెంబరులో ఘనీ తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అబ్దుల్లాను చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫ్‌ ఆఫ్ఘనిస్తాన్ గా నియమించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలిచి రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కారు. తాలిబాన్లతో పలుమార్లు శాంతి చర్చలు జరిపారు. తాలిబన్లను రాజకీయ పార్టీగా గుర్తించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చెప్పారు. దేశంలో యుద్ధాన్ని ముగించే పనిని పూర్తి చేశానని చెబుతూ తాలిబన్లతో ఒప్పందానికి సిద్ధమేనని 2019 ఎన్నికల ప్రచార సమయంలో చెప్పారు.

తాలిబన్లు ప్రభుత్వాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నించడంతో ఘనీ అమెరికాపై అతిగా ఆధారపడక తప్పలేదు. సొంత సైన్యాన్ని బలోపేతం చేసుకోవడంలోనూ ఆయన విఫలమయ్యారు. తాలిబన్లతో అమెరికా జరుపుతున్న చర్చలకు ఘనీ దూరమవుతూ వచ్చారు. అమెరికా ఒత్తిడితో 5000 మంది క్రూరమైన తిరుగుబాటుదారులను ఘనీ జైళ్ల నుంచి విడుదల చేసేందుకు అంగీకరించాల్సి వచ్చింది. ఇది ప్రజల్లో ఆయనపై వ్యతిరేకతను పెంచింది. ఆ తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ను వీడటం మొదలుపెట్టింది. ప్రముఖ ఆఫ్ఘనిస్తాన్ రచయిత అహ్మద్‌ రషీద్‌ తన పుస్తకంలో ఘనీ ఎవరితోనూ సన్నిహితంగా ఉండరని, అందర్నీ దూరం పెట్టడంతో ఒంటరివారయ్యారని అన్నారు. అలా ఆయన ప్రభుత్వమే అందరినీ దూరం చేసేసింది.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయిన అష్రాఫ్ ఘనీ గురించి రష్యన్ ఎంబసీ సంచలన ఆరోపణలు చేసింది. దేశం విడిచి వెళ్లే సమయంలో ఘనీ నాలుగు కార్లు, ఒక హెలికాప్టర్ నిండా డబ్బు కట్టలు నింపుకున్నారని రష్యన్ అధికారులు అంటున్నారు. నాలుగు కార్లలో నిండుగా డబ్బులు నింపారు. ఇంకా మిగిలిన డబ్బును ఒక హెలికాప్టర్లో కుక్కారు. అయినా మొత్తం డబ్బును తీసుకెళ్లలేకపోయారు. మిగిలిపోయిన డబ్బు అక్కడే రోడ్డుపై పడిపోయిందని రష్యా ఆరోపిస్తోంది. కొందరు వ్యక్తులు ఈ తతంగాన్ని కళ్లారా చూశారని తెలిపారు. అయితే ఈ మాటల్లో ఎంత వరకూ నిజముందనే విషయంలో సరైన స్పష్టత లేదని.. ఘనీ పరారైన కాసేపటికే కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు, అనంతరం అధ్యక్ష భవనాన్ని కూడా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక తాము కాబూల్‌లో దౌత్యసంబంధాలను కొనసాగిస్తామన్న రష్యా తాలిబన్లను ఆఫ్ఘనిస్థాన్ పాలకులుగా గుర్తించే విషయంలో తొందరేమీ లేదని చెప్పింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

one × one =