International

1255 కోట్లతో పారిపోయారనే ఆరోపణలపై స్పందించిన అష్రఫ్ ఘనీ

కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్ళిపోయారు. పలు దేశాలు అష్రఫ్ కు ఆశ్రయం కలిగించాయనే ఆరోపణలు వచ్చాయి. కానీ దీనిపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక ప్రకటన చేసింది. అష్రఫ్ ఘనీకి ఆయన కుటుంబానికి తాము ఆశ్రయం ఇచ్చామని యూఏఈ ప్రకటించింది. దేశంలోని ఏ నగరంలో ఆయన ఉన్నారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచింది. ఆఫ్ఘనిస్తాన్ ను పునఃనిర్మిస్తానన్న హామీతో అధ్యక్ష పీఠం ఎక్కిన అష్రఫ్‌ సొంత వైఫల్యాలతో తాలిబన్లను ఎదుర్కోలేక, ప్రభుత్వం కూలిపోతుంటే చూస్తు ఉండటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో దేశం నుంచి పారిపోయారని తెలిపారు. అష్రఫ్ ఘనీ గురించి రష్యన్ ఎంబసీ సంచలన ఆరోపణలు చేసింది. దేశం విడిచి వెళ్లే సమయంలో ఘనీ నాలుగు కార్లు, ఒక హెలికాప్టర్ నిండా డబ్బు కట్టలు నింపుకున్నారని రష్యన్ అధికారులు అంటున్నారు. నాలుగు కార్లలో నిండుగా డబ్బులు నింపారు. ఇంకా మిగిలిన డబ్బును ఒక హెలికాప్టర్లో కుక్కారు. అయినా మొత్తం డబ్బును తీసుకెళ్లలేకపోయారు. మిగిలిపోయిన డబ్బు అక్కడే రోడ్డుపై పడిపోయిందని రష్యా ఆరోపణలు గుప్పించింది. కొందరు వ్యక్తులు ఈ తతంగాన్ని కళ్లారా చూశారని.. అయితే ఈ మాటల్లో ఎంత వరకూ నిజముందనే విషయంలో సరైన స్పష్టత లేదని రష్యన్ ఎంబసీ చెప్పుకొచ్చింది. ఘనీ పరారైన కాసేపటికే కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు, అనంతరం అధ్యక్ష భవనాన్ని కూడా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు.

ఇక తజకిస్థాన్‌లోని ఆప్ఘనిస్థాన్ రాయబారి మొహమ్మద్ జహీర్ తీవ్ర ఆరోపణలు చేశారు. అష్రఫ్ ఘనీ దేశం నుంచి పారిపోతూ దేశ ఖజానా నుంచి రూ. 1,255 కోట్లు (169 మిలియన్ అమెరికన్ డాలర్లు) తస్కరించారని ఆరోపించారు. వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని ఇంటర్‌పోల్‌ను డిమాండ్ చేశారు. దేశం నుంచి డబ్బు తీసుకుని ఓ విద్రోహిలా ఘనీ యూఏఈకి పారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘనీని అరెస్ట్ చేయాలంటూ త్వరలోనే ఇంటర్‌పోల్‌కు వినతిపత్రం ఇవ్వనున్నట్టు చెప్పారు.

తన మీద వచ్చిన ఆరోపణలపై ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ స్పందించారు. తనకు ఆశ్రయమిచ్చిన యూఏఈ నుంచి ఆయన ఫేస్‌బుక్‌ ద్వారా వివరణ ఇచ్చారు. నాలుగు కార్లు, హెలికాప్టర్ నిండా డబ్బులతో పరారైనట్టు వచ్చిన ఆరోపణల్లో ఎంతమాత్రమూ నిజం లేదన్నారు. రక్తపాతం జరగకూడదన్న ఉద్దేశంతోనే తాను కాబూల్‌ను విడిచిపెట్టినట్టు చెప్పారు. ఆ సమయంలో తనకు బూట్లు ధరించే సమయం కూడా లేకుండా పోయిందని, చెప్పులతోనే ఆదివారం అధ్యక్ష భవనాన్ని విడిచిపెట్టినట్టు చెప్పారు. అధ్యక్షుడు మిమ్మల్ని అమ్మేసి తన దారి తాను చూసుకున్నాడంటూ ఎవరేం చెప్పినా నమ్మకండని అష్రఫ్ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని.. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నా అని ఘనీ స్పష్టం చేశారు. చెప్పులు విప్పి షూ వేసుకునే సమయం కూడా తనకు లభించలేదని.. దుబాయ్‌లోనే ప్రవాస జీవితం గడపాలని తనకు లేదని, స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు చర్చలు జరుపుతున్నానని అన్నారు. తాను కాబూల్‌లోనే ఉండి ఉంటే ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తనను ఆఫ్ఘన్ ప్రజల కళ్లముందే ఉరితీసేవారని ఘనీ చెప్పుకొచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

fourteen + six =

Back to top button