More

    తీరం దాటిన అసని తుపాను

    అసని తుపాను తీరం దాటింది. మచిలీపట్టణానికి 20 కిలోమీటర్లు, నరసాపురానికి 40 కిలోమీటర్ల మధ్య తీరాన్ని దాటింది. ఇది ఈ రాత్రికి ఉత్తర ఈశాన్య దిశగా యానాం, కాకినాడ, తుని తీరాల వెంబడి కదులుతూ వాయుగుండంగా మారి మళ్లీ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. తుపాను ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్టణం, శ్రీకాకుళం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో అత్యధికంగా 15.5 సెంటీమీటర్లు, తిరుపతి జిల్లా ఓజిలిలో 13.6 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. భారీ వర్షాల కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్క కృష్ణా జిల్లాలోనే 900 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. తుపాను కారణంగా రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

    తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు.. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని, మత్స్యకార గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలలు సాధారణం కంటే అరమీటరు ఎక్కువ ఎత్తుకు ఎగసిపడతాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. తుపాను ప్రభావంతో గురువారం కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు.

    తెలంగాణలో కూడా వర్షాలు:
    తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అసని తుపాను కారణంగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాలపై మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రెండుమూడు రోజుల క్రితంతో పోలిస్తే హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. గత 24 గంటల్లో అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొత్తపల్లిలో 2.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

    Trending Stories

    Related Stories