అంతర్వేది వద్ద తీరం దాటనున్న అసని తుపాను

0
761

ప్రస్తుతం మచిలీపట్నంకు 40 కి.మీ., నరసాపురంకు 50 కి.మీ., కాకినాడకు 130 కి.మీ., విశాఖపట్నంకు 270 కి.మీ. దూరంలో ఆసని తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి కొనసీమ అంతర్వేది వద్ద తీరం దాటి భూభాగంపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉంది. రేపు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కిమీ వేగంతో ఈదురగాలులు వీయనున్నాయి.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నివాసముండే వారిని ఆదుకునేందుకు ఏపీ సర్కార్ పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి పరిహారం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సహాయ శిబిరాలకు తరలించిన వ్యక్తికి రూ.1000, కుటుంబానికి రూ.2వేలు చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అసని తుపాను ప్రభావంపై సంబంధిత శాఖ అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ఆదేశాలు జారీ చేశారు.