ఉత్తరకోస్తా దక్షిణ ఒడిశా మధ్య కేంద్రీకృతమైన అసని తుఫాను టెన్షన్ పెడుతూ ఉంది. మరికొద్ది గంటల్లో ఇది బలహీనపడి తుఫానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇది గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు ఈశాన్యంగా 330 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 350 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు నైరుతి దిశలో 510 కిలోమీటర్లు, పూరీకి 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తరకోస్తా జిల్లాలకు ఉరుములతో కూడిన జల్లులు కురవనున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కూడా పడే అవకాశం ఉంది.
విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే ఐదు రోజులు సముద్రంలో చేపల వేటపై నిషేధాజ్ఞలు విధించారు. మంగళవారం రాత్రి వరకూ వాయువ్య దిశగా పయనించి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరానికి దగ్గరగా వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత దిశ మార్చుకుని ఉత్తరాంధ్ర, ఒడిశా తీరంవైపు పయనించి, మే 11 వరకు తుఫానుగా కొనసాగనుంది. తదుపరి 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుంది. అసని తుఫాను ప్రభావంతో మంగళ, బుధవారాలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఒడిశాలోని భారీ వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. గురువారం ఒడిశా, పశ్చిమ్ బెంగాల్ తీరంలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ విభాగం హెచ్చరించింది.
తుఫాను కారణంగా మంగళ, బుధవారాల్లో ఏపీ తూర్పుగోదావరి, కోనసీమ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలతోపాటు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడొచ్చు. గాలులు గంటకు 40 కి.మీ. నుంచి 60 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎప్ బృందాలు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగం కోరింది. తుఫాను నేపథ్యంలో విశాఖకు విమాన రాకపోకలు రద్దయ్యాయి. అన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా, ఇండిగో సంస్థలు ప్రకటించాయి. తీవ్ర గాలుల నేపథ్యంలో సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించాయి.