టీ20 ప్రపంచ కప్ గ్రూప్ మ్యాచ్ లో భారత్ మీద పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ విజయంపై పాకిస్తానీ ఇంటీరియర్ మినిస్టర్ షేక్ రషీద్ మొహమ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ మీద పాకిస్తాన్ గెలవడం ఇస్లాం గెలుపుగా అభివర్ణించారు. ‘ముస్లిం ప్రపంచం విజయం’ ఇది అంటూ షేక్ రషీద్ మొహమ్మద్ చెప్పుకొచ్చారు. “ఈ అద్భుతమైన విజయానికి పాకిస్తాన్ మొత్తాన్ని నేను అభినందించాలనుకుంటున్నాను. పట్టుదల, దృఢ సంకల్పం, ధైర్యం తో కూడిన ఒక ఆదర్శప్రాయమైన ప్రదర్శనతో తన ప్రత్యర్థిని ఓడించినందుకు పాకిస్తాన్ జట్టుకు నేను వందనం చేస్తున్నాను. ముస్లిం ప్రపంచం ముందు పాకిస్తాన్ తన ధర్మాన్ని ప్రదర్శించింది. మినిస్ట్రీరియల్ పని కారణంగా నేను హాజరుకాలేకపోయిన ఏకైక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది “అని అన్నారు. “ప్రజలు సంబరాలు జరుపుకునేందుకు వీలుగా ఇస్లామాబాద్‌లోని రావల్పిండిలో బారికేడ్లను తొలగించాలని నేను ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌ని ఆదేశించాను. ఈ ముఖ్యమైన మ్యాచ్ లో గెలిచిన పాక్ జట్టుకు, ప్రజలకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. టీ20 ప్రపంచకప్‌లో ఇది మా ‘ఫైనల్’ మ్యాచ్ తో సమానం” అని వీడియోలో చెప్పుకొచ్చారు. “పాకిస్తానీ బృందానికి భారతదేశంలోని ముస్లింలతో సహా ప్రపంచంలోని ముస్లింలందరి భావోద్వేగ మద్దతు ఉంది. ఇది ముస్లిం ప్రపంచ విజయం. పాకిస్తాన్ జిందాబాద్. ఇస్లాం జిందాబాద్” అంటూ వ్యాఖ్యలు చేశారు.
రషీద్ వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందిచారు. ఇస్లాంకు, క్రికెట్ మ్యాచ్ లకు ఏమిటి సంబంధం? అని ప్రశ్నించారు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై పాకిస్థాన్ విజయం ఇస్లాం విజయం అని పొరుగుదేశపు మంత్రి చెబుతున్నాడు. ఆ మంత్రి ఓ పిచ్చివాడు కాబట్టే ఆవిధంగా ప్రేలాపనలు చేస్తున్నాడు. మన పెద్దవాళ్లు నాడు పాకిస్తాన్ వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు కాబట్టి సరిపోయింది… లేకపోతే ఇలాంటి పిచ్చి మంత్రులను మనం కూడా చూసేవాళ్లం అంటూ వ్యాఖ్యలు చేశారు. యూపీలోని ముజఫర్ నగర్ లో ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక పాక్ చేతిలో భారత్ మ్యాచ్ ఓడిపోవడం గురించి కూడా అసదుద్దీన్ వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లో భారత్ ఆడకూడదని తాను ముందు నుండి చెబుతూ వస్తున్నానని అన్నారు. ఓ వైపు పాకిస్తాన్ నుండి వచ్చే తీవ్రవాదులు భారత్ కు చెందిన సిపాయిలను చంపుతూ వెళుతుంటే.. మనం మ్యాచ్ ఆడడం ఏ మాత్రం మంచిది కాదని నేను బహిరంగంగా మ్యాచ్ కు ముందే చెప్పానని ఓవైసీ అన్నారు. ఇక క్రికెట్ మ్యాచ్ అన్నది 11 మంది ఆడే గేమ్ అని.. కానీ భారత్ ఓటమికి ఒక్క మహమ్మద్ షమీనే బాధ్యుడిని చేయడం తప్పని అన్నారు. దేశంలో ప్రతి అంశం మతాల మధ్య గొడవలా తయారవుతోందని.. మైనారిటీ మతస్తులను దోషులుగా చూపిస్తున్నారని విమర్శించారు. జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉన్నప్పుడు ఒక ముస్లిం వ్యక్తే ఎందుకు టార్గెట్ అవుతున్నాడని ప్రశ్నించారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదులు మన దేశ సిపాయిల ప్రాణాలు తీస్తున్నారని ఈ వాతావరణం ఆటల్లో కనిపిస్తోందని అన్నారు.