నాగరాజు హత్యోదంతంపై అసదుద్దీన్ స్పందన ఇదే..!

0
792

హైద‌రాబాద్‌లోని స‌రూర్ న‌గ‌ర్‌లో దళిత యువకుడు నాగరాజును.. భార్య ఆశ్రిన్ సుల్తానా సోద‌రుడు హత్య చేయ‌డాన్ని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఖండించారు. హ‌త్య కేసులో నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని, తాము హంతకుల పక్షాన నిల‌బ‌డ‌బోమ‌ని చెప్పారు. నాగ‌రాజును ఆశ్రిన్ సుల్తానా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుందని అన్నారు. ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయమేనని చెప్పారు. ఆశ్రిన్ సుల్తానా సోదరుడికి నాగ‌రాజును చంపే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఇటువంటి హ‌త్య‌లు చేయ‌డం రాజ్యాంగం ప్రకారమే కాకుండా ఇస్లాం ప్రకారం కూడా దారుణమైన నేరం అని అన్నారు. ఈ హ‌త్య ఘ‌ట‌న‌కు వేరే రంగు పులిమేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమ‌ర్శ‌లు గుప్పించారు.

రంగారెడ్డి జిల్లా మర్‌పల్లికి చెందిన బిల్లాపురం నాగరాజు, పోతిరెడ్డిపల్లెకు చెందిన ఆశ్రిన్‌ సుల్తానా కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరు కావడంతో వీరి పెళ్లికి ఆశ్రిన్‌ సుల్తానా కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. జనవరి 31న ఆర్యసమాజ్‌లో నాగరాజు-ఆశ్రిన్‌ సుల్తానా వివాహం చేసుకున్నారు. తొలుత బాలానగర్‌ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బుధవారం నాగరాజు, ఆశ్రిన్‌ దంపతులు బైక్‌పై ముసారాంబాగ్‌ వెళ్లారు. తిరిగి ఈ జంట ఇంటికి వస్తున్న సమయంలో కొందరు బైక్‌ను అడ్డగించి నాగరాజుపై దాడి చేసి చంపారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. తమ చెల్లెలిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతోనే నాగరాజును హత్య చేశామని నిందితులు ఒప్పుకున్నారు. నిందితులు మూబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్‌ లను అరెస్ట్ చేశారు.

భర్త నాగరాజు హత్య గురించి ఎన్నో విషయాలను నాగరాజు భార్య ఆశ్రిన్ సుల్తానా చెప్పుకొచ్చింది. వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకున్నానన్న కారణంతో తన అన్న మొబీన్ తనను రెండు సార్లు ఉరితీసి చంపేందుకు ప్రయత్నించాడని.. ఆ తర్వాతే నాగరాజుతో కలిసి హైదరాబాద్ కు వచ్చానని తెలిపింది. ఇద్దరం పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తనను మరిన్ని బెదిరింపులకు గురి చేశారని పేర్కొంది. దాడి చేసినప్పుడు వదిలేయాలంటూ ఎంత వేడుకున్నా తన అన్న కనికరించలేదని కన్నీరుమున్నీరైంది. తన అన్నలు చంపేందుకు వెనుకాడరని చెప్పగా.. చావడానికీ సిద్ధమేనంటూ గతంలో నాగరాజు చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది.