టీ-20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. భారతజట్టు ఓటమిపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లో భారత్ ఆడకూడదని తాను ముందు నుండి చెబుతూ వస్తున్నానని అన్నారు. భారత్ తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడకుండా ఉండాల్సిందని.. ఈ విషయం తాను ముందే చెప్పానని అన్నారు. ఓ వైపు పాకిస్తాన్ నుండి వచ్చే తీవ్రవాదులు భారత్ కు చెందిన సిపాయిలను చంపుతూ వెళుతుంటే.. మనం మ్యాచ్ ఆడడం ఏ మాత్రం మంచిది కాదని నేను బహిరంగంగా మ్యాచ్ కు ముందే చెప్పానని ఓవైసీ అన్నారు. ఇక క్రికెట్ మ్యాచ్ అన్నది 11 మంది ఆడే గేమ్ అని.. కానీ భారత్ ఓటమికి ఒక్క మహమ్మద్ షమీనే బాధ్యుడిని చేయడం తప్పని అన్నారు.
భారత ఆటగాళ్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిపై ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి అంశం మతాల మధ్య గొడవలా తయారవుతోందని.. మైనారిటీ మతస్తులను దోషులుగా చూపిస్తున్నారని విమర్శించారు. జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉన్నప్పుడు ఒక ముస్లిం వ్యక్తే ఎందుకు టార్గెట్ అవుతున్నాడని ప్రశ్నించారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదులు మన దేశ సిపాయిల ప్రాణాలు తీస్తున్నారని ఈ వాతావరణం ఆటల్లో కనిపిస్తోందని అన్నారు. ముస్లింలపై ద్వేషాన్ని పెంచి పోషించి రాజకీయంగా లబ్ది పొందే కుట్రలు కొందరు పన్నుతూ ఉన్నారని అసదుద్దీన్ మీడియాతో అన్నారు.