అమిత్ షా కు అసదుద్దీన్ లేఖ

0
912

ఈ ఏడాది తెలంగాణ విమోచ‌న దినాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హించ‌నుందని తెలియడంతో పలు పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి. ఈ ఏడాది తెలంగాణ విమోచ‌న దినాన్ని ఈ నెల 17న సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా నిర్వ‌హించేందుకు కేంద్రం నిర్ణ‌యించింది. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు మ‌హారాష్ట్ర, కర్ణాట‌క ముఖ్య‌మంత్రులు ఏక్‌నాథ్ షిండే, బ‌స‌వ‌రాజ్ బొమ్మైలు హాజ‌రు కానున్నారు.

తాజా పరిణామాల మధ్య కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ లేఖ రాశారు. లేఖల్లో సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచ‌న దినంగా కాకుండా ‘జాతీయ సమైక్యత దినం’గా నిర్వహించాలని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు. కాబట్టి సెప్టెంబర్‌ 17ను జాతీయ సమైక్యత దినంగా నిర్వహించాలి. 17వ తేదీన పాతబస్తీలో తిరంగాయాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ పాల్గొంటారని చెప్పుకొచ్చారు. తెలంగాణ విమోచనం కోసం హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారని అన్నారు అసదుద్దీన్. సెప్టెంబ‌ర్ 17న జాతీయ స‌మైక్య‌తా దినాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని తాను ఆ లేఖ‌లో అమిత్ షాను కోరిన‌ట్లు ఓవైసీ తెలిపారు. ఈ లేఖను అమిత్ షాతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఓవైసీ పంపారు.