అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి

0
760

లోక్‌సభ ఎంపీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లింమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి జరిగింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంపీగా అసదుద్దీన్ కు ఢిల్లీలోని అశోక్ రోడ్డులో నివాసం కేటాయించారు. ఇప్పుడా నివాసంపైనే దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మీడియా తెలిపింది. దుండగుల దాడిలో ఒవైసీ నివాసంలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసం అయ్యాయి.

దాడి చేసిన వ్యక్తులు ఒవైసీ ప్రసంగాలు విన్నారని.. అతను ‘హిందూ వ్యతిరేక’ వ్యాఖ్యలు చేశాడని ఈ పని చేశామని తెలిపారని ఓ సీనియర్ పోలీసు అధికారి మీడియాతో అన్నారు. ఇటీవల అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే తాము ఈ దాడులు చేసినట్టు తెలిపారని డీసీపీ దీపక్ యాదవ్ వెల్లడించారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఒవైసీ ఇంటిని ధ్వంసం చేసిన వ్యక్తులు అతని వ్యాఖ్యల పట్ల కోపంగా ఉన్నారని దీపక్ యాదవ్ అన్నారు. నిందితులను ప్రశ్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్రలు మరియు గొడ్డళ్లతో ఆయుధాలు కలిగి ఉన్నారని మరియు తన ఇంటిపై రాళ్లు రువ్వారని ఒవైసీ చెప్పారు.

పిరికిపందలు గుంపుగా వచ్చి దాడి చేశారని వెల్లడించారు. అది కూడా తాను ఇంట్లో లేని సమయం చూసి వచ్చారని తెలిపారు. వారి చేతిలో గొడ్డళ్లు, కర్రలు ఉన్నాయని, వారు తన నివాసంపై రాళ్ల దాడి చేశారని, తన ఇంటి నేమ్ ప్లేట్ ను కూడా ధ్వంసం చేశారని వివరించారు. గత 40 ఏళ్లుగా ఈ ఇంటిని చూసుకుంటున్న రాజు అనే వ్యక్తిపైనా దాడికి పాల్పడ్డారని, దాడి సందర్భంగా వారు మతపరమైన నినాదాలు చేశారని ఒవైసీ తెలిపారు. రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని వెల్లడించారు. తన నివాసంపై దాడికి పాల్పడడం ఇది మూడోసారని తెలిపారు. ఈ దాడులతో తమను భయపెట్టాలని ఈ గూండాలు అనుకుంటే అంతకంటే పొరబాటు మరొకటి ఉండదని.. న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

తన ఇల్లు ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం పక్కన ఉందని మరియు పార్లమెంట్ వీధి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉందని తెలిపారు. ప్రధాన మంత్రి నివాసం ఎనిమిది నిమిషాల దూరంలో ఉంది.. ఒక ఎంపీ ఇల్లు సురక్షితం కాకపోతే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏ సందేశం పంపుతున్నారు? అని ఒవైసీ ప్రశ్నించారు. ఈ సంఘటన తనను భయపెట్టలేదని అసదుద్దీన్ తెలిపారు.