భారత్-పాక్ టీ20 మ్యాచ్ పై అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు విన్నారా..?

0
748

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ తో పాకిస్తాన్ తలపడనుంది. భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ మ్యాచ్ అక్టోబరు 24న జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కు టికెట్లు అప్పుడే అయిపోయాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరిగి చాలా సంవత్సరాలే అయ్యాయి. ఆసియా కప్, ఐసీసీ ఈవెంట్స్ లో భారత్-పాక్ మ్యాచ్ లంటే ఎక్కడలేని హై టెన్షన్ ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కూ వ‌న్డే, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ల‌లో ఎప్పుడూ పాక్ చేతిలో ఇండియా ఓడ‌లేదు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ల‌లో ఐదుసార్లు త‌ల‌ప‌డ‌గా.. అన్ని మ్యాచ్‌ లలోనూ భారత్ గెలిచింది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ మ్యాచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదాన్ని అణిచివేస్తామ‌న్న ప్రధాని నరేంద్ర మోదీ అందులో విఫ‌ల‌మయ్యారని అసదుద్దీన్ వ్యాఖ్యలు చేశారు. క‌శ్మీర్‌లో తాజాగా జ‌రిగిన ఉగ్ర‌వాద దాడుల్లో 9 మంది భార‌త జ‌వాన్లు మ‌ర‌ణించార‌ని.. ఒక‌వైపు సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే, మ‌రో వైపు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇండియా ఎలా పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడుతుంద‌ని అస‌ద్ ప్ర‌శ్నించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉంది.

టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడకుండా టీమిండియా బాయ్ కట్ చేయాలని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు(Terrorists) కాల్పులకు తెగబడుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో దాయాదుల పోరు జరగడం వల్ల ఉద్రిక్తతలు మరింత పెరిగే ఆస్కారముందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్-పాక్ మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేవని.. కాబట్టి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచ్‌పై పునరాలోచన చేయాలని కోరారు. పంజాబ్ మంత్రి పర్గత్ సింగ్ ఈ మ్యాచ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగే భారత్-పాక్ మ్యాచ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.