జనాభాను నియంత్రించాల్సిందేనన్న మోహన్ భగవత్.. ముస్లింల జనాభా తగ్గుతోందన్న ఒవైసీ

దేశంలో జనాభా అసమతుల్యత పెను సమస్యగా మారిందని, దీనిని నియంత్రించాల్సి ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దసరా సందర్భంగా నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భగవత్ సంఘ్ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో జనాభా నియంత్రణ విధానాన్ని మరోమారు తీసుకురావాల్సిన అవసరం ఉందని.. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని దానిని రూపొందించాలని పిలుపును ఇచ్చారు. అందరికీ సమానంగా వర్తింపజేయాలని అన్నారు.
గత దశబ్దకాలంగా జనాభా నియంత్రణకై తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయని అన్నారు. కానీ 2011 జనగణన వివరాలు విశ్లేషిస్తే మతపరమైన జనాభా మార్పుల దృష్ట్యా జనాభా విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని అఖిల భారతీయ కార్యకారీ మండలి అభిప్రాయపడుతున్నదని మోహన్ భగవత్ చెప్పుకొచ్చారు. జనాభా పెరుగుదలలో వివిధ మత వర్గాల మధ్య ఉన్న అసమతుల్యత చొరబాట్లు, మత మార్పిడులకు కారణమవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా సరిహద్దుల్లో ఇది దేశ భద్రత, సమైక్యత, సమగ్రతలకు ముప్పుగా పరిణమిస్తున్నదని తెలిపారు. జనాభా నియంత్రణ చర్యలు ప్రారంభమవుతాయని 1952లో భారత్ ప్రకటించినా జనాభా విధానం 2000సంవత్సరం వరకు తయారవలేదని అన్నారు.. 2045నాటికి సంతాన సాఫల్య రేటు 2.1 ఉండేలా చూడటం వంటి లక్ష్యాలతో జనాభా నియంత్రణ విధానం రూపొందిందన్నారు. జాతీయ వనరులు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పరచుకున్న ఈ సూచికను అన్ని వర్గాల ప్రజలకు వర్తింపజేయాలి. కానీ 2005-06 నాటి ఆరోగ్య, సంతాన సాఫల్య అధ్యయనం ప్రకారం 0-6 వయస్సు ఉన్న వారి శాతంలో మతాల వారీగా చాలా వ్యత్యాసం ఉంది. 1951-2011 మధ్య హిందువుల జనాభా 88శాతం నుండి 83శాతానికి పడిపోగా ముస్లిముల జనాభా 9.8 శాతం నుండి 14.23శాతానికి పెరిగింది. జాతీయ సరాసరి కంటే ముస్లిం జనాభా పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉందని అన్నారు. సరిహద్దు జిల్లాలు ఉన్న అస్సాం, పశ్చిమ బెంగాల్ , బీహార్ లలో బంగ్లాదేశీయుల చొరబాట్లు దీనికి కారణమని అన్నారు. సుప్రీం కోర్టు నియమించిన ఉపమన్యు హజారికా కమిషన్ కూడా ఈ విషయాన్ని ఆయా సమయాల్లో ధృవీకరించిందని వివరించారు. చొరబాటుదారులు దేశ పౌరుల హక్కులను కాలరాయడమే కాకుండా అరకొర వనరులున్న రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా పరిణమించారు. అనేక సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్ధిక ఉత్పాతాలకు కారణమవుతున్నారు. ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల్లో మతపరమైన జనాభా అసమతుల్యత బాగా కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లో 1951నాటికి హిందువుల సంఖ్య 99.21శాతం ఉండగా, 2001 నాటికి 81.3కు, 2011నాటికి 67శాతానికి పడిపోయింది. ఒక దశాబ్ద కాలంలో క్రైస్తవ జనాభా 13శాతం పెరిగింది. మణిపుర్ లో కూడా 80శాతం ఉన్న హిందువుల జనాభా 2011నాటికి 50 శాతానికి పడిపోయింది. ఈ తరహా జనాభా అసమతుల్యతకు కారణం వ్యవస్థీకృతంగా కొన్ని విదేశీ శక్తులు చేస్తున్న మతమార్పిడులేనని అఖిల భారతీయ కార్యకారీ మండలి స్పష్టం చేస్తోందని అన్నారు. ఈ జనాభా అసమతుల్యత గురించి స్వయంసేవకులు అప్రమత్తమై ప్రజలకు అవగాహన కలిగించి, న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించి, ఈ సమస్య నుండి దేశాన్ని రక్షించడం తమ బాధ్యతగా భావించాలని అన్నారు.
జమ్మూకశ్మీర్‌లో ప్రజల్ని బయపెట్టేందుకు ఉగ్రవాదులు హింసను ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు చైనా, పాకిస్థాన్ మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు. తాలిబన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కుల ఆధారిత వక్ర భావాలతో నిండిన మన సామాజిక స్పృహను మార్చుకోవాల్సిన అవసరం ఉందని భగవత్ అన్నారు. సరిహద్దుల్లో అక్రమ వలసలు అరికట్టాలి. ఒక జాతీయ జనాభా పట్టికను రూపొందించాలి. చొరబాటుదారులు పౌరులుగా చెలామణి అవకుండా, భూములు కొనకుండా కట్టడి చేయాలని పిలుపును ఇచ్చారు.
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. విజయదశమి సందర్భంగా చేసిన ప్రసంగంలో మోహన్ భగవత్ అబద్ధాలు చెప్పారని ఆయన విమర్శించారు. సగం సత్యాలు, సగం అసత్యాలు చెప్పారని విమర్శించారు. ముస్లింల జనాభా పెరగలేదని తగ్గుతోందని అసదుద్దీన్ చెప్పారు. క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే వ్యాఖ్యల్లో కూడా నిజం లేదని తెలిపారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల అక్కడి ప్రజలు ప్రయోజనాలు పొందుతున్నారంటూ మోహన్ భగవత్ చెప్పిన మాటల్లో నిజం లేదని అన్నారు.