ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని కితౌర్‌లో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో తన కారుపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల కార్యక్రమం ముగించుకుని ఒవైసీ తన కారులో ఢిల్లీకి తిరిగి వస్తుండగా గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ సంఘటన గురించి అసదుద్దీన్ ట్వీట్ చేస్తూ “కొంత సమయం క్రితం నా కారు చిజార్సి టోల్ గేట్ వద్ద కాల్పులు జరిపారు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. అక్కడ 3-4 మంది ఉన్నారు, అందరూ పారిపోతూ ఆయుధాలు అక్కడే వదిలేశారు. నా కారు పంక్చర్ అయింది, కానీ నేను మరొక కారులో వెళ్ళిపోయాను. మేమంతా క్షేమంగా ఉన్నాం. అల్హమ్దులిల్లాహ్.” అని చెప్పుకొచ్చారు. ఒవైసీ పోస్ట్ చేసిన చిత్రాలలో కారు రెండు డోర్‌లకు రెండు రంధ్రాలు కనిపించాయి. దాడిలో తన వాహనం టైర్లు కూడా పంక్చర్ అయ్యాయని
అసదుద్దీన్ చెప్పారు. ఒవైసీ మీరట్ జిల్లా కితౌర్ లో ప్రచారం నిర్వహించారు. తిరిగి వెళ్తుండగా తన వాహనంపై 4 రౌండ్లు కాల్పులు జరిగినట్టు ఒవైసీ తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం వారు ఆయుధాలు పడేసి పారిపోయారని, ఈ ఘటనలో తన కారు టైరుకు పంక్చర్ అయిందని ఒవైసీ వివరించారు. దాంతో తాను మరో వాహనంలోకి మారి అక్కడ్నించి క్షేమంగా బయటపడ్డానని, అల్లా దయతో ఎలాంటి ముప్పు జరగలేదని తెలిపారు. ఏఐఎంఐఎం అధినేతపై జరిగిన దాడులను నిరసిస్తూ హైదరాబాద్ నగరంలోని చార్మినార్ వద్ద నల్లజెండాను ఎగురవేశారు.చార్మినార్ వద్ద దుకాణ యజమానులు నిరసన చిహ్నంగా తమ దుకాణాలను మూసివేశారు.యూపీలో ఏఐఎంఐఎం చీఫ్‌పై దాడి జరిగిన తర్వాత హైదరాబాద్‌లోని సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓల్డ్ సిటీ లో పోలీస్ బందోబస్తు పెంచారు. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతం పూర్తిగా పోలీస్ వలయంలోకి వెళ్లింది. సాధారణంగా ఉండే కంటే ఎక్కువ మంది పోలీసులను మోహరించారు.
తనపై జరిగిన కాల్పుల ఘటన అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తుతానని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. ఈ ఘటనపై యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ విషయంపై లోక్‌సభ స్పీకర్‌ను కూడా కలుస్తానని తెలిపారు. ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎన్నికల కమిషన్‌ను అసదుద్దీన్ కోరారు. తనపై జరిగిన దాడి గురించి ప్రస్థావించేందుకు తనకు సమయం కేటాయించాలని అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం లోక్‌సభ స్పీకరును కలిసి కోరనున్నారు. ఒవైసీపై దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా తమ మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ప్రదర్శనలు చేస్తామని ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ చెప్పారు.
ఒవైసీపై దాడి కేసులో ఇద్దరు షూటర్లను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ వ్యతిరేక ప్రసంగాలపై ఆగ్రహంతోనే దాడికి పాల్పడినట్టు కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన నిందితులు యూపీ పోలీసులకు వెల్లడించినట్లు యూపీ అధికారులు తెలిపారు. దాడి చేసిన వారిలో ఒకరిని అరెస్టు చేయగా, మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అరెస్ట్ చేసిన వ్యక్తి నుంచి 9 ఎంఎం పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.