బుల్డోజర్ ద్వేషాన్ని ఆపాలంటున్న అసదుద్దీన్ ఒవైసీ

0
879

దేశ రాజధాని నగరంలోని జహంగీర్‌పురి ప్రాంతంలో చట్టవిరుద్ధ ఆక్రమణలను తొలగించడం కోసం ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ అధికారులు చేపట్టిన కార్యక్రమాన్ని ఆపాలని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేస్తూ.. బీజేపీ పేదలపై యుద్ధం ప్రకటించిందని ఆరోపించారు.

ఆక్రమణల పేరుతో ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో మాదిరిగానే ఢిల్లీలో కూడా ఇళ్ళను ధ్వంసం చేయాలని చూస్తోందన్నారు. చట్టవిరుద్ధ ఆక్రమణల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వైఖరి అనుమానాస్పదంగా ఉందని అన్నారు. జహంగీర్ పురిలోని అక్రమ ఆక్రమణలను తొలగించడంలో కేజ్రీవాల్ ప్రభుత్వంలోని పీడబ్ల్యూడీ శాఖ కూడా పాల్గొంటోందా? అని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఇలాంటి నమ్మక ద్రోహం చేస్తారని, పిరికితనంతో వ్యవహరిస్తారని ఆయనకు ఈ ప్రాంత ప్రజలు ఓటు వేశారా? అని ప్రశ్నించారు. ఆయన తరచూ పోలీసులులు తన నియంత్రణలో లేరని చెప్తున్నారని, ఈ సాకు ఇక్కడ పని చేయదని అన్నారు అసదుద్దీన్.

ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ అధికారులు బుధవారం ఈ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రయత్నించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ కొన్ని ఆక్రమణలను తొలగించింది. ఈ నేపథ్యంలో ఈ చర్యలను నిలిపేయాలని కోరుతూ ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ, జహంగీర్ పురి ఏరియాలో అనధికారికంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఆక్రమణలను తొలగిస్తున్నారని ఆరోపించారు.

అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియపై సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. యథాతథ స్థితి (స్టేటస్‌ కో) కొనసాగించాలని ఆదేశించింది. జామియా ఉలామా ఏ హింద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కూల్చివేత ప్రక్రియను తక్షణమే ఆపేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ వ్యవహారంపై గురువారం విచారణ కొనసాగించనుంది. సుప్రీంకోర్టు ఆదేశించినా జహంగీర్‌పురిలో కూల్చి వేత ప్రక్రియ కొనసాగింది. ఆర్డర్ కాపీ అందిన వెంటనే కూల్చివేత ఆపేస్తామని ఎన్‌డీఎమ్‌సీ అధికారులు తెలిపారు.