More

  మన వైజ్ఞానిక సంపదకు అమెరికా రీబ్రాండింగ్..!!

  ఇటీవల సైంటిఫిక్ అమెరికన్ జనరల్‎లో ‘ప్రాపర్ బ్రీథింగ్ బ్రింగ్స్ బెటర్ హెల్త్’ పేరుతో ఓ కథనం ప్రచురితమైంది. ఇది ఇప్పుడు మనదేశంలోని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ కథనాన్ని ట్విట్టర్‎లోనూ పంచుకున్న సైంటిఫిక్ అమెరికన్ జనరల్.. కార్డియాక్ కోహరెన్స్ బ్రీథింగ్ ఎక్సర్‎సైజులు హృదయ స్పందనను స్థిరీకరిస్తాయని.. ఆందోళనను తగ్గిస్తాయని రాసుకొచ్చింది. ఈ ట్వీట్‎కు భారతీయ యోగాలోని ప్రాణాయామం చిత్రాన్ని కూడా జతచేసింది. ఇంతకీ కార్డియాక్ కోహరెన్స్ బ్రీథింగ్ అంటే మరేదో కాదు.. మన ప్రాణాయామమే. ఎస్.. మన ప్రాణాయామాన్ని దొంగిలించి.. దానికి ఓ అందమైన పేరు తగిలించి.. ప్రమోట్ చేసుకుంటోంది సైంటిఫిక్ అమెరికన్ జర్నల్. దీంతో ఆ జర్నల్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్రిక అజ్ఞానానికి ఇది పరాకాష్ట అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే, మన ఆచార వ్యవహారాలను, వైజ్ఞానిక సంపదను రీబ్రాండింగ్ చేసి అమ్ముకోవడం పాశ్చాత్య సంస్థలకు కొత్తేమీ కాదు. వందల ఏళ్ల నుంచి మన వైజ్ఞానిక సంపద, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు దోపిడీకి గురవుతూనేవున్నాయి.

  ఇప్పటికే మన సంఖ్యామానాన్ని దొంగిలించారు. మన గణన ప్రక్రియను కొట్టేశారు. మన ఖగోళ సూత్రాలను కాజేశారు. మన యోగాను పీటీ డ్రిల్ గా మార్చేశారు. ఇప్పుడు ప్రాణాయామంపై పడ్డారు. అయినా మనం నిద్రలేవం. గతాన్ని నిందిస్తూ కూర్చుంటాం. పాశ్చాత్య ప్రపంచం భారతీయ ఆవిష్కరణలను చిన్నచూపు చూడటం, ఆ తర్వాత దాన్నే కొట్టేసి రూపం మార్చి వాడుకోవడం పాశ్యాత్యులకు అలవాటైపోయింది. తీరా నిజం తెలిసాక.. అవునా.. అది భారతీయుల సంపదా..! అంటూ ఒప్పుకోలేక ఒప్పుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. రీబ్రాండింగ్ వ్యవహారం కొన్ని శతాబ్దాలుగా సాగుతోంది.

  కాలిక్యులస్ 17వ శతాబ్దంలో న్యూటన్, లైబినిజ్‎లచే ఆవిష్కరించబడిందని.. పాశ్చాత్య సమాజం డబ్బా కొట్టుకుంటూవుంటుంది. నిజానికి, ఈ గణన ప్రక్రియ వేల ఏళ్ల క్రితమే భారతీయులు ఉపయోగించారు. సైన్, కొసైన్ సిరీస్‎లు, ఇన్ఫినిట్ సిరీస్‎లతో లెక్కలు కట్టారు. మన ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు ఏనాడో గ్రహాల వేగాన్ని లెక్కించారు. యూరోపియన్లు, చైనీయుల కంటే ముందే దీనికి గణిత సూత్రాలను కూడా ప్రతిపాదించారు. సాధారణ శకం 1300 నుంచి 1600 వరకు నేటి కేరళ గణిత శాస్త్రజ్ఙులకు ఆలవాలంగా విలసిల్లింది. కాలిక్యులస్ గణితసిద్ధాంతాలను 15, 16వ శాతాబ్దంలోనే మన గణిత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆ సూత్రాలను తాళపత్రాల్లో గ్రంథస్తం చేశారు. భాస్కరాచార్యుడు, బ్రహ్మగుప్తుడు, వరాహమిహిరుడు వంటి ఎందరో మరెన్నో గణిత సూత్రాలను అభివృద్ధి చేశారు. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త జ్వేష్టదేవుడు రాసిన ‘యుక్తి భాష’ నేటి ఆధునిక కాలిక్యులస్‎కు వాస్తవ పాఠ్యాంశం. కాలిక్యులస్‎లో ఉపయోగిస్తున్న అనేక గణిత సూత్రాలను ఆయన ఆనాడే ‘యుక్తి భాష’లో వివరణాత్మకంగా పేర్కొన్నారు.

  ఇక, తంత్ర సంగ్రహం అనే ఖగోళ సంస్కృత గ్రంథంలో మన నీలకంఠుడు త్రికోణమితిని ఏనాడో సవివరంగా వివరించాడు. ఆయన వివరించిన సైన్, కొసైన్, ఆర్క్‎టాన్లను నేడు టేలర్ సిద్ధాంతాలుగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు, గ్రహగమనానికి సంబంధించి నేడు ‘టైకోనిక్ మోడల్’గా చెబుతున్న ఎన్నో అంశాలను 1583లోనే తన తంత్ర సంగ్రహంలో పేర్కొన్నాడు నీలకంఠుడు. అంతెందుకు భూమి గోళాకారంగా వుందని చెప్పడానికి పాశ్చాత్యులకు కొన్ని శతాబ్దాలు పట్టింది. కానీ, ఈ విషయం భారతీయ పురాణేతిహాసాల్లోనే వుంది. మహావిష్ణువు తన మూడవ అవతారమైన వరాహావతారంలో భూమిని తన దంతాలతో పైకెత్తి అది గోళాకారంగా వుంటుందని చెప్పకనే చెప్పాడు. రాక్షసరాజు హిరణ్యాక్షుడు భూమిని దొంగిలించి ఆదిమ జలాల్లో దాచినప్పుడు.. విష్ణుమూర్తి వరాహావతారంలో వచ్చి భూమిని కాపాడుతాడు. హిరణ్యాక్షుడిని సంహరించి.. భూదేవిని సముద్ర గర్భంలో నుంచి తన దంతాలపై పైకెత్తి తిరిగి నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెడతాడు. అలా టెలిస్కోప్ లేని ఆరోజుల్లోనే భూమి గోళాకారంగా వుంటుందని వరాహావతారంలోనే చెప్పాడు మహావిష్ణువు.

  అంతేకాదు, సౌరవ్యవస్థను కూడా భారతీయులు లక్షల ఏళ్ల క్రితమే కచ్చితంగా అంచనా వేశారు. తొమ్మిది గ్రహాలను పూజించడానికి హిందువులు నవగ్రహ పూజలు చేస్తారు. ఆరోగ్యం, విజయం, శ్రేయస్సు కోసం ఈ నవగ్రహపూజలు నిర్దేశించబడినవి. సౌర వ్యవస్థలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చెప్పడానికి ఇంతకన్నా బలమైన ఉదాహరణ ఏముంటుంది..? కానీ, సౌరవ్యవస్థను ప్రతిపాదించిన వాడిగా ప్రపంచం గెలీలియో గెలిలీ అనే ఇటలీ ఖగోళ శాస్త్రవేత్తకు పట్టం కట్టింది. అయినప్పటికీ, ఆనాడు గెలీలియో వాదనను అధునాతన క్యాథలిక్ చర్చ్ ఒప్పుకోలేదు. రెండు దశాబ్దాల పాటు అతన్ని వేధించింది. అతని మరణ సమయంలో కూడా చర్చి అతన్ని హింసించిందని నమ్ముతారు. ఇలా చెప్పుకుంటూపోతే.. భారతీయ ఖగోళ, గణిత శాస్త్రవేత్తల ఆవిష్కరణలను.. పాశ్చాత్యులు రీబ్రాండింగ్ చేసుకున్న ఘటనలు కోకొల్లలు. భారతీయ విజ్ఞానాన్ని కొల్లగొట్టి, పేర్లు మార్చి యదేశ్ఛగా బ్రాండింగ్ చేసుకుంటున్నారు.

  ఇంకా.. కొన్ని విషయాల్లోనైతే మన ఆచారాలను తప్పుబట్టి.. వాటిని మరో రూపంలో మనపైనే రుద్దుతూ వుంటారు. ఒక్కసారి 70, 80వ దశకంలో దూరదర్శన్‎లో వచ్చిన కోల్గేట్ యాడ్ గుర్తుకుతెచ్చుకుంటే ఈ విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. బొగ్గుతో పల్లుతోమితే చిగుళ్లు పాడవుతాయని.. టూత్ పేస్ట్‎ను మాత్రమే వాడాలంటూ టూత్ పేస్ట్‎ను ప్రమోట్ చేసుకుంది కోల్గేట్ కంపెనీ. నిజానికి, టూత్ పేస్ట్‎లో వాడేది చార్ కోల్ రూపంలో వున్న బొగ్గే. ఒక్క టూత్ పేస్ట్ మాత్రమే కాదు, నేడు కోల్గేట్ సహా ఇతర FMCG కంపెనీలు తయారు చేసే టూత్ పేస్టులు, ఫేస్ వాష్‎ల తయారీలో చార్ కోల్‎, నీమ్‎లను వాడుతున్నాయి. నిజానికి, ఇదే బొగ్గు, వేప పుల్లలతోనే ఒకప్పుడు భారతీయులు దంతధావనం చేసుకునేవాళ్లు. కానీ, పాశ్చాత్యుల మోజులో పడి మన మూలాల్ని మరిచిపోయాం. కోల్గేట్ వంటి కార్పొరేట్ కంపెనీలు.. మనం వాడినదాన్నే వాడి, మళ్లీ మనకే అంటగడుతూ కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇక, యూజ్ అండ్ త్రో ప్లేట్ల విషయానికి వద్దాం. పూర్వకాలంలో మనవాళ్లు విస్తరాకుల్లోనే భోజనం చేసేవాళ్లు. అంటే ఇవి యూజ్ అండ్ త్రో బయోడీగ్రేబుల్ వస్తువులు అన్నట్టే కదా..! కానీ, ఇప్పడు అదే విస్తరాకును బయోడీగ్రేడేబుల్ ప్లేట్‎గా మార్చి.. ఇది తమ గొప్పతనమంటూ.. పాశ్యాత్యులు జబ్బలు చరుచుకుంటున్నారు.

  భారతీయ సంప్రదాయాలను, పద్దతులను పాశ్చాత్యులు ఒప్పుకోరు. అందుకే, మన విధానాలను కాపీ కొట్టి, రూపు మార్చి కొత్త కొత్త ఆవిష్కరణలంటూ మనమీదే రుద్దుతుంటారు. భారతీయులమైన మనం గొప్ప వారసత్వ చరిత్రను, ఆచారవ్యవహారాలను మరిచి.. పాశ్చాత్యులు చెప్పిందే నిజమనే మూసలో కొట్టుకుపోతూవుంటాం. ఇప్పటికైనా మన విజ్ఞానాన్ని గుర్తించాలి. భారతీయ విజ్ఞానికి పాశ్యాత్యుల విజ్ఞానం ఏమాత్రం సాటిరాదని నినదించాలి. మన జ్ఞానాన్ని కల్తీ కాకుండా కాపాడుకోవాలి. మన ఆచారాలపై మనం గర్వపడాల్సిన సమయమిది.

  ఇప్పుడు యోగాను కూడా మన నుంచి కొట్టేసేందుకు పాశ్చాత్య దేశాలు సిద్ధమయ్యాయి. ప్రాణాయామం రీబ్రాండింగ్ చేసిన సైంటిఫిక్ అమెరికా జర్నల్ ప్రయత్నం ఇందులో భాగమే. యోగా భారతీయ హిందూ మూలాలతో అనుసంధానమై వుందన్నది ఎవరూ కాదనలేని సత్యం. అయితే, యోగాకు మతం లేదని కొందరు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. హైందవ సంస్కృతి ప్రపంచానికి ఇచ్చిన గొప్ప ఆస్తి యోగా. ఆ క్రెడిట్ హిందువులదని ఒప్పుకోవడానికి పాశ్చాత్యుల మనసు అంగీకరించదు. అందుకే, ఇలా సరికొత్త పేర్లతో కొత్త కొత్త వేషాలేస్తుంటారు. వీటిని మొదట్లోనే గుర్తించి ఎదిరించకపోతే.. అనాదిగా అపహరణకు గురవుతున్నట్టే.. ఇకపై కూడా మన విజ్ఞానం దొంగిలించబడుతూనేవుంటుంది. దీనిపై ప్రతి భారతీయుడూ గొంతెత్తాల్సిన అవసరం వుంది. ప్రాణాయామానికి రూపం మార్చి తమదని చెప్పుకుంటున్న సైంటిఫిక్ అమెరికన్ వంటి జర్నల్స్ వంటి పత్రికల ఆగడాలను ఎండగట్టాలి.

  Trending Stories

  Related Stories