ట్విట్టర్ ‘హేట్ సింబల్’గా స్వస్తిక..!

0
806
Twitter logo and a photo of Elon Musk are displayed through magnifier in this illustration taken October 27, 2022. REUTERS/Dado Ruvic/Illustration

ఎలన్ మస్క్ ట్విట్టర్ సీఈఓ అవగానే ఇన్నాళ్ళూ వామపక్ష భావజాలంతో నిండిన ట్విట్టర్ కు స్వేచ్చ కలిగిందని అందరూ భావిస్తున్నారు. ఇంతకుముందు సోషల్ మీడియాలో కేవలం లెఫ్టిస్టులకు మాత్రమే యాజమాన్యం నుంచి మద్దతు ఉండేదనే విమర్శలను మూటగట్టుకుంది. అయితే తర్వాత మస్క్ దీన్ని కొనుగోలు చేయడంతో పాటుగా ఇందులో చాలా మార్పులు చేస్తానని హామీ కూడా ఇచ్చాడు. ముఖ్యంగా ఇందులో ఉన్న వామపక్ష భావజాలాన్ని తొలగించి దీన్ని పరిశుద్దం చేస్తానని చెప్పాడు. ఇక అనుకున్నదే తడవుగా మస్క్ ట్విట్టర్ ను కొనేసి తానే సీఈఓ అయ్యాడు. మొదటి రోజునే వామపక్ష భావజాలికులకు మద్దతిచ్చిన అప్పటి సీఈఓ ‘పరాగ్ అగర్వాల్’ తో పాటు ఫైనాన్షియల్ ఛీఫ్ ‘నీద్ సెగల్’, లీగల్ అఫైర్స్ ఛీఫ్ ‘విజయా గడ్డె’ ను తొలగించి సంచలనం సృష్టించారు. దీంతో మస్క్ తాను చెప్పినట్టే చేస్తున్నాడనే నమ్మకం అందరిలోనూ కలిగింది. ఇక ట్విట్టర్ యూజర్లు కూడా ఇన్నాళ్ళూ సోషల్ మీడియా యాప్ లో ఉన్న వామపక్ష భావజాలాన్ని గుర్తించి వాటిని తొలగించాల్సిందిగా ఎలన్ మస్క్ కు అభ్యర్థనలు పెట్టుకుంటున్నారు.

ఇదిలావుంటే, ఇటీవల ట్విట్టర్ పాలసీలపై మస్క్ చేసిన ట్వీట్ పై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ ట్వీట్ ల పాలసీల్లో విద్వేష పూరిత వ్యాఖ్యలు, విద్వేషాన్ని రెచ్చగొట్టే చిహ్నాల గురించిన ప్రస్తావన ఉంది. ట్విట్టర్ పాలసీ ప్రకారం ఇటువంటివి షేర్ చేస్తే ఆ ట్వీట్ కు రీచ్ తగ్గిపోవడం, ట్వీట్ డిలీట్ అయిపోవడం లేక అకౌంట్ లను సస్పెండ్ చేయడం వంటివి జరుగుతుంది. అయితే వీటిలో హిందువులు ఎంతో ఆరాధ్య చిహ్నంగా భావించే స్వస్థిక గుర్తు కూడా ఉండటంతో ఈ గుర్తును ట్విట్టర్ పాలసీల్లోని హేట్ స్పీచ్ నుంచి తొలగించాలనే డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. సాధారణంగా హిందువుల స్వస్థికకు నాజీ స్వస్థికకి చాలా తేడా ఉంటుంది. నాజీలకు ఉండే గుర్తుకు స్వస్తికకి ఏమాత్రం చారిత్రక సంబంధం కూడా ఉండదు. నాజీలు ఉపయోగించే చిహ్నాన్ని హాకెన్‎క్రూజ్ అని పిలుస్తారు. దీన్నే నాజీలు తమ జెండాల్లోనూ, యూనిఫాంల్లోనూ ఉపయోగించారు. అయితే ఈ చిహ్నానికి హిందువుల స్వస్తికకు చాలా దగ్గరి పోలిక ఉంటుంది. కానీ వీటి మధ్య చారిత్రకంగా ఎటువంటి సంబంధమూ లేదు. కానీ,.. విదేశీ వామపక్ష భావజాలికులు హిందువులను కూడా నాజీలుగా క్రూరులుగా చిత్రీకరించే ప్రయత్నంలో దీన్ని స్వస్తికగా పిలవడం మొదలుపెట్టారు. ఇప్పటికే విదేశీయుల్లో చాలా మందిలో ఈ రెండూ ఒకటే అనే భావనలోనే ఉన్నారు. దీంతో అమెరికన్ పార్లమెంట్ బిల్లుల్లో కూడా స్వస్తికను విద్వేషాలను రెచ్చగొట్టే సింబల్‎గా గతంలో గుర్తించారు కూడా. కానీ, తర్వాతి కాలంలో కొన్ని బిల్లుల్లో ఈ స్వస్తిక గుర్తును అమెరికా పార్లమెంటు తొలగించినా ప్రజల్లో మాత్రం ఆ భావన ఇంకా పోలేదు. ఇక ట్విట్టర్ లోనూ వామపక్ష భావజాలికులు ఇన్నాళ్ళూ రాజ్యమేలడంతో ఏకంగా దీన్ని ‘నాజీల స్వస్తిక’ అనే పేరుతో ట్విట్టర్ పాలసీల్లో పొందుపరిచారు. దీంతో ఆ గుర్తులను ఉపయోగించిన ట్వీట్లకు రీచ్ తగ్గడం లాంటిది జరుగుతోంది.

అయితే తాజాగా ఎలన్ మస్క్ సీఈఓ కావడంతో ట్విట్టర్ లో చాలామంది నెటిజన్లు మస్క్ ను ఈ స్వస్థిక గుర్తును హేట్ స్పీచ్ పాలసీల్లోనుంచి తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికి ఇంకా ట్విట్టర్ లో మార్పులు చేయాల్సినవి చాలా ఉన్నాకూడా,.. వాటిని ఎలన్ మస్క్ అంతగా పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ సీఈఓ అయి వారాలు గడుస్తున్నా ఇప్పటికీ అమెరికన్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఉన్న నిషేధాన్నే తొలగించలేకపోయారు. ఇక ఇటువంటి చిహ్నాలన్నిటినీ తొలగిస్తారని భావించడం కూడా కాస్తంత అతిశయోక్తిగానే ఉంటుంది. అయితే ఎప్పటికైనా ఇటువంటి కంపెనీలన్నీ తమ స్వార్థం కోసమే పనిచేస్తాయి. గతంలోనూ ఎలన్ మస్క్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో వ్యాఖ్యలు చేశాడు. చైనాలో తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్లను భారత్ లో అమ్మడానికి పన్నుల రాయితీ తప్పకుండా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీనికి భారత ప్రభుత్వం ససేమిరా అంగీకరించకపోవడంతో బహిరంగంగానే విమర్శించే ప్రయత్నం చేశాడు. ఇటువంటి వ్యక్తి ఏదో ఒక వర్గానికి సంతృప్తి కలిగించే ప్రయత్నం చేయగలడా అంటే అది అనుమానమే అని చెప్పాలి. కాబట్టి ఇటువంటి వ్యక్తులను నమ్ముకోవడం కంటే కాస్తంత ఇబ్బందిగా అనిపించినా కూడా పూర్తి భారతీయ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలైన ‘కూ’ లాంటి యాప్ లను వాడటం కొద్దో గొప్పో భారత్ కు మేలు చేసినవారవుతాం.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

nine − 9 =