క్రెడిట్ కొట్టేయాలని చూసిన ఇండియా కూటమి..!

0
132

మహిళలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూసిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు, వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చాయి. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ పేరుతో ఈ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘావాల్ సెప్టెంబర్‌ 19న ప్రవేశపెట్టగా.. 8 గంటల పాటూ సుదీర్ఘ చర్చ అనంతరం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. 454 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా.. ఇద్దరు వ్యతిరేకంగా ఓటేశారు. మహిళల రిజర్వేషన్ డిమాండ్‌ను నెరవేర్చే నైతిక ధైర్యం మోదీ ప్రభుత్వానికి మాత్రమే ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. కేబినెట్ ఆమోదంతోనే ఈ విషయం రుజువైందని అన్నారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీకి , కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

చర్చలో భాగంగా INDIA కూటమిలోని కాంగ్రెస్ పార్టీ తాము నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు తాము మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తీ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించారు. నారీ శక్తి వందన్‌ అభియాన్‌ 2023 బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును మొదట ప్రవేశ పెట్టింది తామేనన్నారు. గతంలో ఈ బిల్లును అడ్డుకున్నారని, ఇప్పటికైనా బిల్లు చర్చకు రావడంతో సంతోషంగా ఉందన్నారు. కోటా అమల్లోకి వస్తేనే రాజీవ్ కల నిజమవుతుందన్నారు సోనియా గాంధీ. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాను మద్దతు తెలుపుతున్నట్లు రాహుల్ గాంధీ అన్నారు. కుల గణన చేపట్టి అత్యధిక జనాభా ఉన్న వర్గాలవారికి సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఈ బిల్లు అసంపూర్తిగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఓబీసీలను బీజేపీ గాలికొదిలేస్తోందని ఆరోపించారు.

ఇప్పుడున్న కూటమిలోని కాంగ్రెస్ అప్పట్లో అధికారంలో ఉన్న సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తీసుకుని వెళ్లడానికి ఏ మాత్రం చర్యలు తీసుకోలేదు. అదే కాంగ్రెస్‌ ఇప్పుడు ఈ బిల్లును తమదే అంటూ క్లెయిమ్ చేయడానికి సిద్దమైంది. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ట్విట్టర్లో .. కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తోందన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. ఇక కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించినప్పుడు కూడా బిల్లు గురించి మాట్లాడుతూ.. “ఇది మాది, అప్నా హై” అని బదులిచ్చారు. ఆ తర్వాత పార్లమెంట్ లో సోనియా గాంధీ స్పీచ్ సమయంలో కూడా ఆమె మాటల్లో ఇదే స్పష్టంగా వినిపించింది. రాజీవ్ గాంధీ హయాం నుండి తాము మహిళలకు ఎన్నో చేశామని.. ఇది కూడా ఆ లిస్టులోనిదే అని చెప్పడం ఆశ్చర్యకరం.

మహిళా రిజర్వేషన్ బిల్లును మొదటి నుండి వ్యతిరేకించిన ఎన్నో పార్టీలు కాంగ్రెస్ పార్టీ చెంతనే ఉన్నాయి. మోదీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లును సమర్పించినప్పుడు, కాంగ్రెస్ ఎంపీలు న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే వచ్చాయి. 27 ఏళ్లుగా ఈ బిల్లు పదేపదే రద్దు కావడానికి కారణాలను అర్జున్ రామ్ మేఘ్వాల్ చెబుతూనే వచ్చారు. SP, RJD, LJP, JDU పార్టీలు పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడాన్ని వ్యతిరేకించాయనే విషయాన్ని ఎవరూ మరచిపోరు. వాజ్‌పేయి ప్రభుత్వం పార్లమెంటులో కనీసం ఆరుసార్లు ఈ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే కాంగ్రెస్ కారణంగా ప్రతిసారీ ఈ బిల్లు వెనక్కు వెళ్ళిపోయింది. మెజారిటీ లేకపోవడంతో వాజ్‌పేయి ప్రభుత్వం ఏకాభిప్రాయం కోసం ప్రతిపక్షాలపై ఆధారపడింది. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ మద్దతుతో రాజ్యసభలో బిల్లును ఆమోదించింది. కానీ లోక్‌సభలో బిల్లును ఆమోదించడానికి కాంగ్రెస్, ఆ పార్టీ భాగస్వాములు, ఎంపీల మధ్య ఏకాభిప్రాయాన్ని సంపాదించడంలో విఫలమైంది.

ఈరోజు తాము మహిళా సాధికారత కోసం పోరాడుతూ ఉన్నామని.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలే అని చరిత్ర చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ తమ భాగస్వామ్య పక్షాలను ఈ విషయంలో రెచ్చగొట్టే ధోరణి అవలంభించిందని కూడా రాజకీయ విశ్లేషకులు గతంలో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి కారణమైన చాలా పార్టీలు.. బిల్లును ప్రవేశపెట్టడాన్నే సహించలేకపోయాయి. ఈరోజు బిల్లుకు క్రెడిట్ దక్కిందని చెప్పుకుంటున్న ప్రతిపక్ష నేతలు అనేకసార్లు సభలకు అంతరాయం కలిగించడంతో మహిళా రిజర్వేషన్ బిల్లు రూపాంతరం చెందడానికి 27 ఏళ్లు పట్టింది. 1998లో ఆర్జేడీ ఎంపీ సురేంద్ర ప్రకాశ్ యాదవ్ అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎం.తంబి దురై చేతిలో నుంచి బిల్లును లాక్కున్నారు. అజిత్ కుమార్ మెహతాతో కలిసి వాటిని నాశనం చేసే ప్రయత్నం చేశారు. ఏకంగా స్పీకర్ టేబుల్‌పైకి దూసుకు వెళ్లారు.

రాజ్యసభలో బిల్లు పెట్టగానే అప్పట్లో అధికారంలో ఉన్న ఎంపీలు చేసిన రచ్చను మహిళా లోకం మరచిపోదు. RJDకి చెందిన సుభాష్ యాదవ్, LJP కి చెందిన సబీర్ అలీ, సమాజ్ వాదీ పార్టీకి చెందిన వీర్‌పాల్ సింగ్ యాదవ్, నంద్ కిషోర్ యాదవ్, అమీర్ ఆలం ఖాన్, కమల్ అక్తర్ లు బిల్లును తీసుకురాగానే సభలో గందరగోళం సృష్టించారు. 2010లో సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు అబు అసిమ్ అజ్మీ, అతని సహచరులు అప్పటి న్యాయ మంత్రి హన్సరాజ్ భరద్వాజ్ నుండి బిల్లు కాపీని లాక్కునేందుకు ప్రయత్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ రాజ్యసభలో ఎస్పీ సభ్యులు నినాదాలు చేశారు. 2010లో తన సొంత పార్టీలోనే బిల్లుపై వ్యతిరేకత ఉందని సోనియా గాంధీ అంగీకరించారు. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకుని రావడానికి సాధ్యపడలేదు. అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి రావడానికి కారణం తామేనని చెప్పుకుంటూ ఉంటుంటే.. దేశ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టాలనే గట్టి ప్లాన్ ను వేశారని స్పష్టంగా తెలుస్తోంది.

ఇక మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. అసాధారణ మద్దతుతో లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల చాలా సంతోషంగా ఉందని అన్నారు. పార్టీలకు అతీతంగా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలకు ధన్యవాదాలు తెలిపారు. “నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ ఒక చారిత్రాత్మకమైన చట్టం అన్నారు.. భవిష్యత్తులో ఇది మహిళా సాధికారతను ఎంతో పెంపొందిస్తుందని.. మన రాజకీయ ప్రక్రియలో మహిళలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావడానికి వీలు కల్పిస్తుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.