ఒక్క ఫొటోతో పాక్ ను షేక్ చేసిన ఆఫ్ఘనిస్తాన్..!

0
779

ఒక్క ఫొటో.. ఒకే ఒక్క ఫొటోతో.. పాకిస్తాన్‎కు దిమ్మదిరిగే షాకిచ్చాడు ఆఫ్ఘనిస్తాన్ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్. ఇంతకీ ఏమిటా ఫొటో..? అందులో అంత విశేషం ఏముంది..? తెలియాలంటే.. బక్రీద్ సందర్భంగా.. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షభవనంలో జరిగిన సామూహిక ప్రార్థనల నుంచి మొదలు పెట్టాలి.

ఇటీవల బక్రీద్ ప్రార్థనల్లో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో పాటు ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‎తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే, ప్రార్థనలు మొదలు పెడుతున్న సమయంలో తాలిబన్లు అధ్యక్ష భవనానికి దగ్గర్లో ఒక రాకెట్‌ను ప్రయోగించారు. ఆ చప్పుడుకు ఉపాధ్యక్షుడు అమ్రుల్లాతో పాటు కొంతమంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత తమాయించుకొని దాడిని లెక్కచేయకుండా ప్రార్థనలు కొనసాగించారు. అయితే, పాకిస్తాన్ ట్రోలర్లు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. అమ్రుల్లాను ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. 1971 వార్‎కు సంబంధించిన ఓ ఫొటోతో రీట్వీట్ చేశాడు. 1971 యుద్ధంలో భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత.. పాకిస్తాన్ సేనలు లొంగిపోతున్నట్టు పాక్ లెఫ్టినెంట్ జనరల్ A.A.K. నియాజీ సంతకం చేస్తున్న ఫొటో అది. ఇంకా ఆ ఫొటోలో నాటి భారత లెఫ్టినెంట్‌ జనరల్‌ జగ్‌జీత్‌ సింగ్‌ అరోరా కూడా ఉన్నారు.

ఆ లెజెండరీ చిత్రాన్ని పోస్ట్‌ చేసిన అమ్రుల్లా.. ‘మా దేశ చరిత్రలో ఇలాంటి ఫొటో లేదు.. ఇక ముందు కూడా రాదు. నిన్న నేను కొన్ని క్షణాలు ఉలిక్కిపడిన మాట వాస్తవమే. డియర్‌ పాక్‌ ట్విటర్‌ ఎటాకర్స్‌.. ఈ ఒక్క చిత్రంతో మీలో పుట్టే భయం నుంచి తాలిబన్‌, ఉగ్రవాదం మిమ్మల్ని బయటపడేయలేవు’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ఇప్పుడా ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. పాకిస్తాన్ ట్రోలర్ల నోళ్లుకు మూతలు పడ్డాయి.

ఈ ఫొటో ప్రస్తావన కాసేపు పక్కనపెడితే.. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‎లో తాలిబాన్ల అరాచకాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అమెరికా, నాటో దళాలు వెళ్లిపోయిన తర్వాత నుంచి మరింత రెచ్చిపోతున్నారు. అక్కడి పౌర ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. బాంబులు, రాకెట్లతో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాలపై దాడులు చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే.. మరోసారి పాక్ వక్రబుద్ధి బయటపడింది. ఉగ్రమూకల పక్షాన చేరి వారికి అండగా నిలుస్తోంది. తాలిబన్లపై ఆఫ్ఘన్ సైన్యం వైమానిక దాడులు చేయకుండా పాకిస్తాన్‌ మిలిటరీ అడ్డుకుంది. దక్షిణ కాందహార్‌లోని కీలక మార్కెట్‌ ప్రాంతమైన స్పిన్‌ బోల్డాక్‌ నుంచి తాలిబన్లను తరిమికొట్టే ప్రయత్నాలకు అడ్డుపడింది. తాలిబన్లపై వైమానిక దాడులు చేస్తే తమ సైన్యం ఎదురుదాడి చేస్తుందని పాకిస్తాన్‌ వాయుసేన హెచ్చరిక జారీచేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలెహ్ ట్వీట్‌ చేయడం పాక్ ఉగ్రబుద్ధికి అద్దం పడుతోంది. అంతేకాదు, పాకిస్తాన్ సైన్యం కొన్నిప్రాంతాల్లో తాలిబన్లకు వైమానిక సాయంతో పాటు.. ఆఫ్ఘన్ సేనల దాడిలో గాయపడిన తాలిబన్లకు వైద్య సాయం అందిస్తోంది. ఆఫ్ఘన్​ సరిహద్దులోని పాకిస్తాన్‌ ఆస్పత్రులన్నీ తాలిబన్లతో నిండిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇదిలావుంటే, పాకిస్తాన్ కన్ను ఆఫ్ఘనిస్తాన్‎లోని భారత ఆస్తులపై పడింది. ఆఫ్ఘనిస్తాన్‎లో భారత్ చేపట్టిన నిర్మాణాలే లక్ష్యంగా దాడులు చేయాలని.. తాలిబన్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తాలిబన్లు, పాకిస్తాన్ ఉగ్రవాదులు కలిసి ఆఫ్గానిస్థాన్‌లో భారత ఆస్తులే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇటీవల భారత్‌-ఆష్ఘన్‌ స్నేహానికి గుర్తుగా నిర్మించిన సల్మా డ్యాంపై తాలిబన్లు మోర్టార్‌ దాడులు చేసినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. 2016 జూన్‌ 4న సల్మా డ్యాంను ప్రధాని మోదీ, ఆఫ్ఘన్​ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ ప్రారంభించారు. ఈ డ్యాం విధ్వంసానికి కుట్ర చేశాడన్న అభియోగాలపై భద్రతాదళాలు పాకిస్తాన్‌ పౌరుడ్ని అరెస్ట్‌ చేసినట్లు ఆఫ్ఘన్​ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్‎లో మౌలిక సదుపాయాల కల్పనకు భారత్ చేయూతనిచ్చింది. సల్మా డ్యాం, ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ భవనంతో పాటు.. జారంజ్, డెలారామ్ మధ్య ఉన్న 218 కిలోమీటర్ల రోడ్డును భారత్ నిర్మించింది. అంతేకాదు, ఆఫ్ఘనిస్థాన్‌లో విద్యాభివృద్ధికి కూడా భారత్ విశేషంగా సేవలందించింది. ఇవన్నీ మనసులో పెట్టుకున్న పాకిస్తాన్.. ఇప్పుడు భారత ఆస్తులపై తాలిబాన్లను ఉసిగొల్పుతోంది.

ఇదిలావుంటే, తాలిబాన్ల ఆగడాలు పెరిగిపోతుండటంతో ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో వుంది. ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ వలీ మొహమ్మద్ అహ్మద్జాయ్ జూలై 27 నుంచి 30 వరకు భారత్‎లో పర్యటించనున్నారు. మన ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‎తో పాటు.. పలువురు భద్రతా అధికారులతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. పైకి.. వలీ మొహమ్మద్ పర్యటన భారత సైన్యం మద్దతు కోసం కాదని చెబుతున్నా.. తాలిబాన్ల ఆగడాలు పెరుగుతున్న నేపథ్యంలో సైనిక మద్దతు కోరే అవకాశం లేకపోలేదంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడు ట్వీట్ చేసిన 1971 వార్ ఫొటో చర్చనీయాంశంగా మారింది. పైకి పాకిస్తాన్ ట్రోలర్ల నోరుమూయించడానికి చేసిన ప్రయత్నంగా కనిస్తున్నా.. ఆఫ్ఘనిస్తాన్ భారత మద్దతు కాంక్షిస్తుందని చెప్పడానికి ఇది అద్దం పడుతోంది. మరి, ఆఫ్ఘనిస్తాన్ అడిగితే భారత్ సైనిక సాయం చేస్తుందా..? లేదా..? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఒకవేళ సాయం అందిస్తే మాత్రం.. ఇది పాకిస్తాన్‎తో యుద్ధానికి దారితీయవచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనావేస్తున్నారు. అదే జరిగితే ఇలాంటిది మరో ఫోటో కూడా చూడాల్సి రావొచ్చేమో..!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here