డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ హీరో షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతనితోపాటు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ దమేచాకు కూడా బెయిల్ వచ్చింది. పూర్తి వివరాలను(డీటైల్డ్ ఆర్డర్) శుక్రవారం న్యాయస్థానం వెల్లడించనుంది. ఈ నెల 3న క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో ఆర్యన్‌తో పాటు పలువురిని ఎన్‌సీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
గత రెండు రోజులుగా ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం బాంబే హై కోర్టులో వాదనలు జరిగాయి. రెండ్రోజులుగా ఆర్యన్ ఖాన్, అతడి స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ తరపున సీనియర్ లాయర్లు ముకుల్ రోహత్గీ, అమిత్ దేశాయ్ వాదలను వినిపించారు. తమ క్లయింట్లను అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారనీ, ఇంత చిన్న కేసులో అవసరం లేకున్నా వారిని అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. నేరం రుజువు అయితే కేవలం ఏడాది శిక్ష పడే కేసు విషయంలోనే తాము బెయిల్‌ను అడుగుతున్నామని కోర్టుకు వాదనలు వినిపించారు. ముంబై విడిచిపెట్టాలని అనుకున్నా అధికారులతో అనుమతి తీసుకోవాలని.. విదేశాలకు వెళ్లాలంటే మాత్రం కోర్టు అనుమతులు తప్పనిసరి అని బాంబే హై కోర్టు తెలిపింది.