National

ఎన్నో మలుపులు.. ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చేది.. లేనిది తెలిసేది నేడే..!

ఆర్యన్ ఖాన్ అరెస్టు వ్యవహారంలో హై డ్రామా నడుస్తోంది. డ్రగ్స్‌ కేసులో ఈ నెల 3న అరెస్ట్‌ అయిన ఆర్యన్ ఖాన్ అప్పటి నుంచి ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైలులో ఉంటున్నాడు. ఇప్పటికే రెండుసార్లు కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై సాక్షి ప్రభాకర్ సెయిల్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కేసులో ఎన్సీబీ అధికారులతో భారీగా లంచాల డీల్ నడుస్తోందని తెలిపాడు. ఈ మేరకు కోర్టుకు అఫిడవిట్ సమర్పించాడు. తనతో ఎన్సీబీ అధికారులు ఖాళీ పంచనామా పత్రాలపై బలవంతంగా సంతకం చేయించుకున్నారని వివరించాడు. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేతో తనకు ముప్పు ఉందని.. ముంబయి సమీపంలో క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ వ్యవహారం సమయంలో అనేక కీలక పరిణామాలు జరిగాయని.. వాటిన్నింటికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ప్రభాకర్ సెయిల్ తన అఫిడవిట్ లో తెలిపాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తుల నుంచి ఎన్సీబీ డబ్బులు డిమాండ్ చేస్తోందని, దీనికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు.

ఇక మంగళవారం నాడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై బెయిల్‌ పిటిషన్‌పై ముంబై హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్యన్‌ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ఆర్యన్‌ను అరెస్టు చేయడంలో అసలు అర్థం లేదని, ఆర్యన్‌ ఎప్పుడు డ్రగ్స్‌ తీసుకోలేదని పేర్కొన్నారు. ఆర్యన్‌ వాట్సప్‌ చాట్‌ అంతా గతేడాదివేనని, తాజా కేసుతో ఆర్యన్‌కు సంబంధం లేదని తెలిపారు. క్రూయిజ్‌ షిప్‌ దాడిలో ఆర్యన్‌ వద్ద డ్రగ్స్‌ దొరకలేదని, ప్రదీప్‌ గబ్బా ఆహ్వానం మేరకే పార్టీకి వెళ్లినట్లు చెప్పారు. ఆర్యన్‌కు ఇప్పటి వరకు మెడికల్‌ టెస్ట్‌ చేయలేదని ముకుల్‌ రోహత్గీ వాదించారు.

ఆర్యన్‌కు బెయిల్‌ ఇవ్వకూడదని ఎన్‌సీబీ అధికారులు ముంబై హైకోర్టులో అఫడవిట్‌ దాఖలు చేశారు. ఆర్యన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని.. బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని కూడా ఎన్‌సీబీ తెలిపింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. డ్రగ్స్ కేసులో మనీష్ రాజ్ గారియా, అవిన్ సాహులకు ముంబయి ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పొందిన మనీష్ రాజ్ గారియా డ్రగ్స్ కేసులో 11వ నిందితుడు. 2.4 గ్రాముల గంజాయిని కలిగి ఉన్నాడంటూ అతడిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బెయిల్ రావడంతో రూ.50 వేల పూచీకత్తు మీద అతడిని విడుదల చేశారు. అవిన్ సాహు వద్ద కూడా మాదకద్రవ్యాలు ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

Back to top button