ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరణ.. దోషిగా తేలితే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుందంటే..!

షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు బెయిలు మంజూరు చేయాలని మంగళవారం నాడు కోర్టులో వాదనలు వినిపించినా కోర్టు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. విచారణ నిమిత్తం 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ ను ముంబై కోర్టు గురువారం వరకు డ్రగ్స్ నిరోధక ఏజెన్సీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) కస్టడీకి అప్పగించింది.అక్టోబర్ 7 వరకు ఎన్సీబీ కస్టడీలో ఆర్యన్ ఖాన్ ఉండనున్నాడు. ఈ కేసులో దర్యాప్తు నిర్వహించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఆర్యన్ ఖాన్ తో పాటు, ఆర్యన్ స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాను కూడా అక్టోబర్ 7 వరకు ఎన్‌సిబి కస్టడీకి పంపించారు. న్యాయమూర్తి నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో వారు కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్యన్ ఖాన్ దోషిగా తేలితే పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆర్యన్‌పై నమోదైన కేసులను బట్టి అతడికి గరిష్ఠంగా పదేళ్ల శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. ఆర్యన్‌తోపాటు అరెస్ట్ అయిన మరో ఏడుగురిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8 (సి), 20 (బి), 27 రెడ్ విత్ సెక్షన్ 35 ఉన్నాయి. వీరి అరెస్ట్ సమయంలో 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరస్, ఎండీఎంఏ 22 ట్యాబ్లెట్లను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి కేసుల్లో తక్కువ మొత్తంలో డ్రగ్స్ లభ్యమైతే ఏడాది వరకు కఠిన కారాగార శిక్ష, లేదంటే రూ. 10 వేల జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండింటినీ అమలు చేస్తారు. ఎక్కువ మొత్తంలో దొరికితే పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తారు. వాణిజ్య పరమైన విక్రయాలు చేస్తూ దొరికితే పదేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, లక్ష నుంచి రెండు లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఆర్యన్‌పై నమోదైన సెక్షన్లు బట్టి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.
విచారణ సమయంలో ఆర్యన్ ఖాన్ ఏడుస్తూనే గడిపాడని అధికారులు చెప్పారు. అతడు నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. ఆర్యన్ విదేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ తీసుకుంటూనే ఉండేవాడని తెలిపారు. తన కొడుకును బెయిల్‌పై విడుదల చేయించడానికి షారుఖ్ లాయర్ ద్వారా ప్రయత్నాలు జరుపుతున్నాడు. తన షూటింగ్ కార్యక్రమాలను కూడా షారుఖ్ వాయిదా వేసుకున్నాడు. ఆర్యన్ ఖాన్ కేసు వాదించే బాధ్యతను క్రిమినల్ లాయర్ సతీష్ మానెషిండేకు అప్పజెప్పారు. ప్రముఖ లాయర్ రామ్‌జెఠ్మాలనీ వద్ద ఆయన పనిచేశారు. బాలీవుడ్‌కు సంబంధించిన చాలా హైప్రొఫైల్ కేసులను ఆయనే వాదించారు. ఆర్యన్ ను బయటకు తీసుకుని రావడానికి పలు పాయింట్లను ఆయన రైజ్ చేస్తూ ఉన్నారు.