ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఉచ్చు బిగుసుకుంటోంది. మద్యం పాలసీ సర్కార్ ను డైలమాలో పడేసింది. దీని విషయంలో ఢిల్లీ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివాదాస్పద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దర్యాప్తునకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు.
ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ నివేదిక ఆధారంగా ఎల్‌జీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.టెండర్లు ఖరారైన తర్వాత లిక్కర్ లైసెన్సుల మంజూరులో అనుచిత లబ్ధి చేకూర్చడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడిందని కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. 2021-22లో లిక్కర్ లైసెన్సుదారులకు అనుచిత ప్రయోజనాలు వర్తింపచేయడంలో నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లకు పంపిన నివేదిక అనంతరం ఎల్‌జీ మద్యం పాలసీపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.
ఎక్సైజ్ శాఖకు ఇన్‌చార్జ్ మంత్రిగా మనీష్ సిసోడియా వ్యవహరించిన క్రమంలో ఉన్నత రాజకీయ స్ధాయిలో నిబంధనలను ఉల్లంఘిస్తూ నోటిఫైడ్ ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా వ్యవహరించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని నివేదిక వెల్లడించింది. టెండర్లు ఖరారైన అనంతరం లిక్కర్ లైసెన్సుదారులకు సిసోడియా అనుచిత లబ్ధి కలిగించడంతోనే ఖజానాకు గండిపడిందని ప్రధాన కార్యదర్శి సమర్పించిన నివేదిక స్పష్టం చేసింది. కొవిడ్ మహమ్మారి డెల్టా వేవ్ విరుచుకుపడిన సమయంలో తీసుకువచ్చిన ఎక్సైజ్ పాలసీని పౌరసమాజం, విద్యాసంస్ధలు, తల్లితండ్రుల సంఘాలు, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.