National

డిప్యూటీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. స్వాగతిస్తున్నామన్న సీఎం

ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ఇంట్లో ఇవాళ సీబీఐ సోదాలు నిర్వ‌హించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీలో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల కేసులో ఈ త‌నిఖీలు నిర్వ‌హించారు. ఢిల్లీలోని సుమారు 20 ప్ర‌దేశాల్లో ఈ సోదాలు జ‌రుగుతున్నాయి. సీబీఐ అధికారులు త‌న ఇంటికి వ‌చ్చిన‌ట్లు మ‌నీష్ సిసోడియా ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ద‌ర్యాప్తు సంస్థ‌కు స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. వాళ్ల‌కు త‌న వ‌ద్ద ఏమీ దొర‌క‌ద‌ని.. దేశం కోసం మంచి ప‌నులను చేసేవాళ్ల‌ను వేధించ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఈ పరిణామాలపై ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ స్పందించారు. సీబీఐని స్వాగ‌తిస్తున్న‌ట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆ ద‌ర్యాప్తు సంస్థ‌కు పూర్తిగా స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ విచార‌ణ ద్వారా ఏమీ బ‌య‌ట‌కురాదని ఆయ‌న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ఢిల్లీలో స్కూళ్ల అభివృద్ధి కోసం సిసోడియా ఎంతో చేశార‌ని, ఢిల్లీ ఎడ్యుకేష‌న్ మోడ‌ల్‌ను ప్ర‌శంసిస్తూ అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక‌లో ఇవాళ ఫ్రంట్ పేజీలో క‌థ‌నం ప్ర‌చురిత‌మైంద‌ని, అయితే ఆ రోజునే కేంద్ర ప్ర‌భుత్వం సిసోడియాపై త‌నిఖీలు చేప‌ట్ట‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. గ‌తంలో త‌మ‌పై ఎన్నోసార్లు సోదాలు జ‌రిగాయ‌ని కేజ్రీ అన్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో సుమారు 20 ప్రాంతాల్లో సోదాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

Related Articles

Back to top button