అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ నదిలోని నీరంతా నలుపు రంగులోకి మారిపోయింది. నీరు మొత్తం విషమయం కావడంతో ఆ నదిలో జీవిస్తున్న వేలాది చేపలు చనిపోయాయి. అరుణాచల్ ప్రదేశ్లోని కామెంగ్ నదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నదిలోని నీరంతా విషమయం కావడానికి కారణం చైనా అనే అంటున్నారు. చైనాలో భారీ నిర్మాణాలు చేపట్టడమే నదీ జలాలు నలుపు రంగులోకి మారడానికి కారణమని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. నదిలో కరిగే వ్యర్థాల (టీడీఎస్) పరిమాణం సాధారణంగా లీటర్ నీటిలో 300 నుంచి 1200 మిల్లీ గ్రాముల వరకు ఉండాలి. కానీ కామెంగ్ నదిలో 6800 మిల్లీ గ్రాముల టీడీఎస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని వల్లే కామెంగ్ నదిలోని నీరు అకస్మాత్తుగా నల్లగా మారిందని దీనివల్ల ఆ నదిలో ఉన్న జలచరాలు శ్వాస పీల్చుకోవడం సాధ్యం కాక మరణించాయని తెలిపారు.

ఈ నది తూర్పు కమెంగ్ జిల్లాలో ఉద్భవిస్తుంది మరియు బ్రహ్మపుత్ర యొక్క ఉపనది. తూర్పు కమెంగ్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రవిమల్ అభిషేక్ పోలుమట్ల మాట్లాడుతూ, వివిధ ప్రదేశాలలో నీటిని విశ్లేషించి, పరీక్షించినప్పుడు నదిలో టీడీఎస్ చాలా ఎక్కువగా ఉందని మరియు కరిగిన ఆక్సిజన్ చాలా తక్కువగా ఉందని జిల్లా అధికారులు కనుగొన్నారు. చాలా చేపలు మరియు ఇతర జలచరాలు చనిపోవడానికి ఇదే కారణమని ఆయన అన్నారు. నాలుగు రోజుల నుండి పరిస్థితి ఇలాగే ఉంది అని అంటున్నారు. శాటిలైట్ చిత్రాలు లేదా ఏరియల్ సర్వేల ద్వారా అసలు కారణాన్ని తెలుసుకోవచ్చని.. దీనిపై రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

నదిలో టీడీఎస్ శాతం భారీ స్థాయికి చేరడంతోనే జలాలు నలుపు రంగులోకి మారాయని ప్రాథమికంగా గుర్తించినట్టు జిల్లా మత్స్య అభివృద్ధి విభాగం అధికారి హలీ తాజో తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, ఇది ఇలాగే కొనసాగితే అందులోని జలచరాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కమెంగ్ నది నీటి రంగు అకస్మాత్తుగా మారడం.. పెద్ద సంఖ్యలో చేపలు చనిపోవడానికి గల కారణాలను అన్వేషించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సెప్పా తూర్పు ఎమ్మెల్యే తపుక్ టాకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చనిపోయిన చేపలను తింటే తీవ్ర అనారోగ్య సమస్యలకు అవకాశం ఉన్నందున వాటిని తినొద్దని స్థానికులకు అధికారులు సూచించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు నదిలో చేపలు పట్టొద్దని, చనిపోయిన వాటిని విక్రయించడం, తినడ చేయొద్దని స్పష్టం చేసింది.
తూర్పు సియాంగ్ జిల్లాలోని పాసిఘాట్ వద్ద ఉన్న సియాంగ్ నది 2017 నవంబరులో ఇలాగే నల్లగా మారింది. అప్పట్లో చైనా సొరంగం నిర్మాణం చేపట్టడం వలన అలా చోటు చేసుకుంది. 20-30 ఏళ్ల కిందట కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.
