NationalistHub - మహాభారత యుద్ధం - వ్యూహాలు..!
Download and install Nationalist Hub Mobile App for instant updates from us.
మహాభారత యుద్ధం - వ్యూహాలు..! img



Share via Whatsapp web

Attack him where he is unprepared, appear where you are not expected...అనేది ప్రాచీన యుద్ధ వ్యూహం. వాటిలోని నిజానిజాల మాట పక్కనబెడితే యుద్ధంలో శత్రువుని జయించాలంటే ఒక ప్రణాళిక ఉండాలని చెప్పింది మాత్రం భారతదేశంలోనే.

విశిష్ఠమైన సైన్య రచనా పద్ధతిని వ్యూహం అని వ్యూహ శాస్త్రనిపుణులు వివరిస్తారు. తమ సైన్యం తక్కువగాను, ఎదుటి సైన్యం ఎక్కువగాను ఉన్నప్పుడు వ్యూహం బాగా ఉపయుక్తమవుతుంది. ఒకవేళ అధికంగా సైన్యం ఉన్నా ఒక కట్టుదిట్టమైన విధానంతో దీన్ని విస్తరింపచేస్తూ తక్కువ ప్రాణనష్టం జరిగేలా, విజయం తమకు దక్కేలా వ్యూహాన్ని నిర్మించుకోవాలి. మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహం, గరుడ వ్యూహం, మకర వ్యూహం, కూర్మవ్యూహం, శకట వ్యూహం, సూచి, శ్యేన, వజ్ర, అచల, సర్వతోభద్ర, మండలార్థ, శృంగాటక ఇలా అనేకానేక రకాల పేర్లతో వ్యూహాలు రూపొందించారు. పశువులు, పక్షుల పేర్లతో రూపొందించే వ్యూహాలు నిజానికి ఆయా పశువులు, పక్షులు తమ శత్రువులతో ఎలా పోరాడితే గెలుస్తున్నాయో అటువంటి స్వభావాన్ని అంతటినీ వ్యూహ రచయిత సంపూర్ణంగా అవగతం చేసుకుంటాడు.

యుద్ధ వ్యూహాలు: -

అచల వ్యూహం:-

అచలం అంటే పర్వతం, అచల వ్యూహమన్నప్పుడు ఒకచోట ఒక క్రమపద్ధతిలో కొండలాగా కదలకుండా సైన్యం ఉండి శత్రువును ఎదుర్కొంటుంది.

మకర వ్యూహం:-

మకర వ్యూహంలో మకరం అంటే మొసలి. మొసలి నోరుభాగం అతి భయంకరంగా ఉంటుంది. దీన్ని తలపిస్తూ మకర వ్యూహన్ని రూపుదిద్దుతారు.

కూర్మవ్యూహం:-

కూర్మం వీపు భాగం ఎంతో గట్టి కవచంలాగా ఉంటుంది. కూర్మవ్యూహం పన్నేటప్పుడు సైన్యంలో ప్రధానమైన వారికి ఎవరికీ దెబ్బతగలకుండా మిగిలిన సైనిక భాగాలన్ని రక్షక కవచంలాగా ఉంటాయి.

శ్యేన వ్యూహం:-

శ్యేనం అంటే డేగ, డేగ కళ్ళు ఎంతో చురుకుగా ఉంటాయి. ఆ కళ్ళతోటే తనకు కావలసిన పదార్థాన్ని ఎంతో దూరం నుండి చూసి చాకచక్యంగా తన ఆహారాన్ని తన్నుకుపోతుంది. అలాగే శత్రుసైన్యాన్ని చిత్తు చేయటానికి ఈ వ్యూహాన్ని వాడతారు. క్రౌంచ వ్యూహం:-

క్రౌంచ పక్షి ముక్కు చాలా ధృడంగా ఉంటుంది. ఈ వ్యూహంలో ముక్కు భాగంలో ఉండే వారిని జయించటమంటే శత్రువు ఎంతో కష్టానికి గురికావలసి వస్తుంది.

వ్యూహాలు పన్నటానికి తగిన సమయం, వాటికి సంబంధించిన విషయాలను శుక్రనీతిలో గమనించవచ్చు. నదులు, అడవులు, దుర్గాలు, తదితర ప్రాంతాలలో తమ సేనకు ఏదైనా ముప్పు వాటిల్లబోతుంది అని సేనాపతి భావించినప్పుడు సందర్భానికి తగిన వ్యూహరచన చెయ్యడం జరుగుతుండేది. సైన్యం ప్రయాణిస్తున్నపుడు అగ్రభాగంలో ఉన్న సైనిక బలానికి ప్రమాదం ఎదురవుతుందన్నప్పుడు మొసలినోరు భాగాన్ని పోలినట్లుగా మకర వ్యూహాన్ని పన్ని శత్రువును చిత్తు చేసేవారు. అవతల శత్రువు కూడా బలంగానే ఉంటే డేగను పోలిన శ్యేన వ్యూహాన్ని పన్నేవారు. శ్యేన వ్యూహం పన్నటానికి ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే సూదిలాగా ముందుకు దూసుకుపోయి శత్రువును నాశనం చెయ్యటానికి సూచీ వ్యూహాన్ని పన్నేవారు.

అగ్రభాగాన కాక, వెనుక భాగంలో శత్రువు వల్ల ప్రమాదం కలుగుతుందనుకుంటే శకటం (బండ) లాగా వ్యూహరచన చేసేవారు. ముందూ వెనుక కాక పక్క భాగాల నుండి ప్రమాదం ముంచుకొస్తుందనుకుంటే వజ్ర వ్యూహాన్ని, అలా కూడా కాక నాలుగువైపుల నుండి శత్రువులు దాడి చేయబోతున్నారనుకున్నప్పుడు చక్రవ్యూహమూ,భద్రం, వ్యాళం అనే పేర్లున్న వ్యూహాలను కానీ పన్నేవారు. ఈ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బతీయడానికి ఉపయుక్తమయ్యేవిగా ఉండగా, మరికొన్ని తమను తాము కాపాడుకోవటానికి పనికొచ్చేవిగా ఉంటాయి.

వ్యూహాలకు అందులో వుండే సైనికులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ ముందుకు నడవటానికికానీ శత్రువును నిర్భయంగా ఎదుర్కోమని చెప్పటానికి కానీ, వెనక్కి తిరిగి రమ్మనమని చెప్పటానికి కానీ సంబంధిత నాయకులు యుద్ధ సమయంలో ఉపయోగంచే వాద్య పరికరాలను ఉపయోగించటం, రథానికున్న ధ్వజాలు, జెండాలతో సూచనలు చేయడం లాంటివి చేస్తుండేవారు.

ఇలా వ్యూహరచనా విన్యాసాలు సమర కళలో ఆనాడు ఎంతో ప్రాధాన్యం వహిస్తుండేవి.

మహాభారతం లోని పద్మ వ్యూహం :- బాహుబలి సినిమా లో త్రిశూల వ్యూహం చూసారు గా.కాని యుద్ద వ్యూహాలు అన్నిటి లోకి మహా వ్యూహం పద్మ వ్యూహం .

పద్మవ్యూహం లేదా చక్రవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో ఒకటి. ఈ వ్యూహ నిర్మాణం ఏడు వలయాలతో కూడి శత్రువులు ప్రవేశించడానికి దుర్భేధ్యంగా ఉంటుంది. చక్రవ్యూహాన్ని మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను సంహరించడానికి పన్నగా అందులో అభిమన్యుడు చిక్కుకొని విరోచితంగా పోరాడి మరణిస్తాడు.

మహాభారత యుద్ధంలో భీష్ముడు ఓడిపోయిన తర్వాత కౌరవసేనకు ద్రోణాచార్యున్ని సేనాధిపతి చేశాడు దుర్యోధనుడు. యుద్ధం పదమూడవ రోజున ద్రోణాచార్యుడు పాండవులను ఓడించేందుకు తన అనుభవ జ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నాడు. పాండవ సైనికులు ఆ వ్యూహాన్ని ఛేదించలేకపోయారు. పద్మవ్యూహాన్ని ఛేదించే పరిజ్ఞానము పాండవ పక్షములో శ్రీకృష్ణునికి, అర్జునునికి, ప్రద్యుమ్నునికి(శ్రీకృష్ణుని కొడుకు), మరియు అభిమన్యునికి తప్ప మరెవరికీ లేదు. ప్రద్యుమ్నుడు మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు. పద్మవ్యూహాన్ని గమనించిన ధర్మరాజు, సమయానికి అర్జునుడు అందుబాటులో లేకపోవటం వల్ల గత్యంతరం లేక అభిమన్యున్ని పద్మవ్యూహంలోకి వెళ్ళమని ఆ వెనుక ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు వెంట రక్షణగా వస్తామని చెప్పి ముందుకు పంపించాడు. అదే సమయంలో పాండవులను ఏదైనా ఒక్కరోజు పాటు నిలువరించే వరం కలిగిన సైంధవుడు వీరిని యుద్ధరంగంలో అడ్డుకుంటాడు. వ్యూహంలో ప్రవేశించిన అభిమన్యునికి ఇలా పాండవుల సహాయం అందలేదు. అయినా వీరోచితంగా పోరాడి కౌరవుల వ్యూహానికి హతుడైపోతాడు.

అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు. అయితే, పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. అలా చెప్పబోయేంతలో సుభద్ర నిద్రలోకి జారుకోవటం చూసి అర్జునుడు చెప్పటం ఆపివేశాడు. అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు.

మహబారత యుద్ద వ్యూహాలు:-

కురు పాండవ సేవలు పన్నిన వ్యూహాలిలా ఉన్నాయి.

యుద్ధంలో పాండవ, కౌరవ సేనల వ్యూహ ప్రతి వ్యూహాలు

1. వజ్ర వ్యూహం,సర్వతోముఖ వ్యూహం: కృష్ణుడు అర్జునునకు గీతోపదేశం చేశాడు. భీష్ముడు దావానలంలా విజృంభించాడు. అభిమన్యుడు, అర్జునుడు మాత్రమే అతనిని కాస్త నిలువరించ గలిగారు. ఆరోజు పాండవులు చింతా క్రాంతులయ్యారు. 2. క్రౌంచ వ్యూహం, త్రికూట వ్యూహం: అర్జునుడు భీష్ముని తీవ్రంగా బాధించాడు. భీముడు విజృంభించి కళింగ సేనను కల్లోల పరచాడు. అభిమన్యుని ధాటికి తట్టుకోవడం భీష్మ ద్రోణులకు కూడా సాధ్యం కాలేదు.

3. అర్ధచంద్ర వ్యూహం, గరుడ వ్యూహం: భీష్ముని దాడితో క్రోధుడైన అర్జునుడు చెలరేగి కౌరవ సేనను దావానలంలా దహించాడు.అభిమన్యుడు, భీముడు విజృంభించారు. తొమ్మండుగురు కౌరవ సోదరులు భీముని చేత హతులయ్యారు. ఘటోత్కచుని మాయాయుద్ధంతో కౌరవసేన కకావికలయ్యింది.

4. శ్యేన వ్యూహం,మకర వ్యూహం: పాండవుల పక్షంలో భీముడు, అభిమన్యుడు, అర్జునుడు చెలరేగిపోయారు. కౌరవుల పక్షంలో భీష్ముడు, భూరిశ్రవుడు విజృంభించారు. విజయం ఎటూ కాకుండా పోయింది. భూరిశ్రవుని చేత సాత్యకి కొడుకులు పదిమంది మరణించారు. అర్జునుడు పాతికవేల రధికులను నిర్జించాడు.

5. మకర వ్యూహం,క్రౌంచ వ్యూహం: భీముడు, పాండవుల కొడుకులు ఐదుగురూ కౌరవులను ముప్పుతిప్పలు పెట్టించారు. ద్రుపదుడు, ద్రోణుడు తలపడ్డారు. నకులుడి కొడుకు శతానీకుడు అద్భుతంగా యుద్ధం చేశాడు.

6. వజ్ర వ్యూహం,మండల వ్యూహం: కౌరవులలో భీష్ముడు, పాండవులలో భీమార్జునులు అద్భుతంగా యుద్ధం చేశారు. భగదత్తుడు ఘటోత్కచుని తరిమేశాడు. సాత్యకి అలంబసుడిని తరిమేశాడు. ధర్మరాజు ధాటికి శ్రుతాయువు పారిపోయాడు. సుశర్మ అర్జునుడిని ఢీకొన్నాడు.

7. శృంగాటక వ్యూహం,కూర్మ వ్యూహం : భీముడి చేత 12 మంది కౌరవ సోదరులు మరణించారు. ఘటోత్కచుని తమ్ముడు ఇరావంతుడు అలంబసునిచేత మరణించాడు. అర్జునుని తీవ్రత కొనసాగింది.

8. సర్వతోభద్ర వ్యూహం: భీష్ముని ప్రతాపాన్ని తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. అర్జునుడు తేజోహీనుడయ్యాడు. ఇక లాభం లేదని కృష్ణుడే స్వయంగా చక్రధారియై భీష్మునిపైకి లంఘించాడు. అర్జునుడు బ్రతిమాలగా కృష్ణుడు వెనక్కి తగ్గాడు. భీష్ముని చంపడం సాధ్యం కాదనుకొన్న పాండవులు ఆ రాత్రి భీష్ముని ప్రార్ధించారు. పాండవులు శిఖండిని అడ్డుపెట్టుకొని యుద్ధం చేస్తే తనకు యుద్ధోత్సాహం నశిస్తుందని భీష్ముడు సలహా ఇచ్చాడు.భీష్ముడు, అర్జునుడు, శిఖండి, ధర్మరాజు విజృంభించారు. శిఖండి ఎదురుపడినప్పుడల్లా భీష్ముడు వేరేవైపు వెళ్ళసాగాడు. ధర్మరాజు పరాక్రమానికి ద్రోణుడు నిలువలేకపోయాడు. అర్జునుడి శరపరంపరకు భీష్ముడు కూలిపోయాడు. అంపశయ్యపై విశ్రమించాడు.

9.క్రౌంచ వ్యూహం,శకట వ్యూహం: కౌరవ సేనాధిపతిగా ద్రోణుడున్నాడు. కర్ణుడు మొదటిసారి యుద్ధరంగంలో ప్రవేశించాడు. ద్రోణుడు ధర్మరాజును పట్టుకోబోయే సమయంలో అర్జునుడు అడ్డం పడ్డాడు. మరుసటిరోజు అర్జునుని రణరంగంనుండి దూరంగా తీసుకెళ్ళాలని త్రిగర్త దేశాధీశుడు సుశర్మతో కలిసి పన్నాగం పన్నారు.

10. మండలార్ధ వ్యూహం : గరుడ వ్యూహం సంశప్తకులను ఓడించి కృష్ణార్జునులు యుద్ధంలోకి తిరిగి వచ్చారు. భగదత్తుని వైష్ణవాస్త్రం కృష్ణుని వల్ల వ్యర్ధమయింది. అర్జునుడు భగదత్తుని వధించాడు. కర్ణార్జునులు తొలి ద్వంద్వయుద్ధం చేశారు. మరునాడు అర్జునుని ఇంకా దూరంగా తీసుకెళ్ళాలని, తిరిగి రానీయమని సంశప్తకులు మాట యిచ్చారు.

11. పద్మ (చక్ర) వ్యూహం:

ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నాడు. పద్మ వ్యూహాన్ని ఛేదించి అభిమన్యుడు కాలాగ్నిలా చెలరేగిపోయాడు. కర్ణుడు పారిపోయాడు. తక్కిన పాండవులను జయద్రధుడు వ్యూహ ద్వారంలో ఆపేశాడు. ఒంటరియైన అభిమన్యుడు ఏడుమార్లు తనను చుట్టుముట్టినవారిని మట్టి కరిపించారు. ఎనిమిదవ సారి అభిమన్యుని అన్నివైపులనుండి చుట్టుముట్టి వెనుకనుండి నిల్లు విరిచి అతనిని చంపేశారు. మరునాడు సూర్యాస్తమయంలోపు సైంధవుని చంపుతానని అర్జునుడు ప్రతిన పూనాడు.

12. శకటవ్యూహం , పద్మవ్యూహం:

సూచీవ్యూహంద్రోణుని వ్యూహ రచన సైంధవుని రక్షించడం కోసం చేయబడింది. అయినా అర్జునుడు అందరినీ జయించి తృటిలో వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళాడు. శ్రుతాయుధుడు, కృతవర్మాదులు, విందానువిందులు అర్జునునిచేత మరణించారు. ఘటోత్కచుడు అలంబసుడిని, హలాయుధుడిని వధించాడు. దుర్మర్షణుడు, దుర్మధుడు, శత్రుంజయుడు వంటివారు భీమునిచేత చచ్చారు. సాత్యకి భూరిశ్రవుని చంపాడు. చివరకు అర్జునుడు సైంధవుని చంపి తన ప్రతిన నెరవేర్చుకొన్నాడు. రాత్రి పూట జరిగిన యుద్ధంలో ఘటోత్కచుడు పెట్రేగిపోయాడు. అర్జునుని చంపడానికి దాచుకొన్న శక్తిని ప్రయోగించి కర్ణుడు ఘటోత్కచుని కడతేర్చాడు.

13.ద్రోణార్జునుల ద్వంద్వ యుద్ధంలో ఎవరూ ఓడలేదు. చివరకు "అశ్వత్థామ" (అనే ఏనుగు) మరణించినట్లు ప్రకటించగా ద్రోణుడు అస్త్ర సన్యాసం చేశాడు. ధృష్ష్టద్యుమ్నుడు ద్రోణుని శిరసు తెగనరికాడు. దుఃఖ క్రోధాలతో రెచ్చిపోయిన అశ్వత్థామ పాండవులపై విరుచుకుపడ్డాడు. అశ్వత్థామ దివ్యాస్త్రాలు కృష్ణార్జునుల శక్తియుక్తులవలన వృధా అయ్యాయి. వేదవ్యాసుడు అర్జునునికి పరమేశ్వర మహిమను విశదీకరించాడు.

14. అర్ధచంద్ర వ్యూహం,మకర వ్యూహం: అశ్వత్థామ సూచనపై దుర్యోధనుడు కౌరవ సైన్యాధిపతిగా కర్ణుని నియమించాడు. భీముడు క్షేమధూర్తిని వధించాడు. ప్రతివింధ్యుడు చిత్రసేనుని చంపేశాడు. భీముడు అశ్వత్థామతోను, కర్ణుడు నకులునితోను, అర్జునుడు సుశర్మతోను ద్వంద్వ యుద్ధాలు చేశారు. ధర్మరాజు సుయోధనుని మూర్ఛిల్ల చేశాడు. అర్జునుడూ, కర్ణుడూ ఎదురి పక్షాలను గగ్గోలు పెట్టించారు. మరునాడు పాండవులను అంతం చేస్తానని కర్ణుడు దిగాలుగా ఉన్న దుర్యోధనునికి మాట యిచ్చాడు.

15. దుర్జయ వ్యూహం: దుర్యోధనుని ప్రార్ధననంగీకరించి కర్ణునికి సారధ్యం చేయడానికి శల్యుడు అంగీకరించాడు. శల్యుడి పరుష వ్యంగ్య వచనాలకు కర్ణుడు నొచ్చుకొన్నాడు. కర్ణుడూ, కర్ణుని కొడుకులూ చెలరేగి పాండవ సైన్యాన్ని కాలరాశారు. కర్ణుడు ధర్మరాజుని పట్టుకొని పరుషంగా అవమానించి వదిలేశాడు. భీముడు దుశ్శాసనుని వధించి దారుణంగా రొమ్ము చీల్చి రక్తం త్రాగాడు. కర్ణార్జునుల ద్వంద్వయుద్ధం ప్రళయ సమానంగా సాగింది. కర్ణుని సర్పముఖాస్త్రం విఫలమయ్యింది. కర్ణుని రథం భూమిలో దిగబడినపుడు అర్జునుడు అంజలికం అనే దివ్యాస్త్రంతో అతని తల నరికేశాడు. ధర్మరాజు చాలా సంతోషించాడు. 16. త్రిశూల వ్యూహం, సర్వతోభద్ర వ్యూహం : దుర్యోధనుని కోరికతో కౌరవ సేనాధిపతిగా శల్యుడు ఉన్నాడు. భీమార్జునులు మిగిలిన కౌరవ సేనను తుడిచిపెట్టసాగారు. యుధిష్ఠిరుని చేత శల్యుడు హతుడయ్యాడు. సహదేవుడు గాంధార సైన్యాన్ని ఊచకోత కోశాడు. శకునిని చంపేశాడు. అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ పారిపోయారు. దుర్యోధనుడు పరిసర అరణ్యాలకుపోయి ఒక జలాశయంలో దాగున్నాడు. ....