ఆఫ్ఘనిస్తాన్ లో ఒకే ఒక్కడు

Sep 27, Sun 2020 01:16 PM In Focus

-- ఆలయాన్ని కాపాడుతున్న క్షేత్రపాలకుడు

అవును… అతనొక్కడే…! ఎప్పుడు ఎటువైపు నుంచి ఉగ్రమూకలు వచ్చి దాడి చేస్తాయో తెలియదు.! కుటుంబ సభ్యులు సైతం ప్రాణాలకంటే మిన్న ఏది లేదన్నారు. తాము పుట్టిపెరిగిన ఈ దేశం ఇక తమది కాదు అంటూ.., ఓ నిర్ణయానికి వచ్చేశారు. ప్రాణాలు అరచేతబట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ భారత్ కు వలస వచ్చారు. మోదీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన పౌరసత్వం పుణ్యమా అని భారత పౌరసత్వం దక్కించుకున్నారు.! అయితే అతను మాత్రం..ఒక్కడే…, ఆ దేశంలోనే ఉండిపోయాడు. ప్రాణాలకంటే కూడా ఆ నేలలో కలిసిపోయిర తన పూర్వీకుల అస్థిత్వాన్ని, తన చివరి క్షణం వరకు పరిరక్షించాలనే తపన..అతనిది. ఇంతకీ ఆ దేశంలో మిగిలిపోయిన లాస్ట్ మ్యాన్ ఎవరో తెలుసా?

గజనీ…ఈ పేరు వినగానే హిందూ సమాజానికి గజనీ మహమ్మద్ గుర్తుకు వస్తాడు. పరమ కిరాతకుడు…, దోపిడి దొంగలకంటే కూడా నీచుడైన గజనీ మహమ్మద్ ఆఫ్గానిస్తాన్ లోని ఈ ప్రాంతం నుంచే భారత దేశానికి వచ్చాడు. భారత్ దేశంపై దాదాపు 17సార్లు దండయాత్రలు చేశాడు. హిందువులకు ఎంతో పవిత్రమైన అనేక దేవాలయాలను ధ్వంసం చేశాడు. అపరమైన ధనరాసులను తన దేశానికి తరలించుకు వెళ్లాడు. ఎంతోమందిని నరకయాతనలు గురి చేశాడు. లెక్కలేనంతమంది హిందువులను బానిసలుగా తనదేశానికి తీసుకుని వెళ్లి అమ్మేశాడు. ఇది చరిత్ర చెప్పే సత్యం.!

నిజానికి… ఆఫ్గానిస్తాన్ కూడా ప్రాచీన కాలం నుంచి అఖండ భారత దేశంలో ఒక భాగంగా ఉండేది.! అయితే వరుసగా ఇస్లామిక్ దండయాత్రలు, కత్తి చేతపట్టి హిందువులందరినీ బలవంతంగా ముస్లింలుగా మతం మార్చవేయడం, దీనికి తోడు శత్రువు అని తెలిసి కూడా క్షమించి వేసే హిందూ రాజుల ఉదాసినత ఒక వైపు. బలవంతంగా మతం మార్చబడిన హిందువులు తిరిగి స్వధర్మంలోకి వస్తామంటే ఒప్పుకునేందుకు సిద్ధంగాలేని ఆనాటి హిందూ ఛాందస సమాజం ఇంకొవైపు. దీంతో ఆయా ప్రాంతాల్లో క్రమంగా హిందూ జానాభా తగ్గిపోయింది. ఆ తర్వాత కాలంలో…, హిందువులుగా బ్రతకలేని పరిస్థితులు సృష్టించబడ్డాయి.! చాలా మంది ప్రాణభయంతో తమ పుట్టిన ఊరును, ప్రాంతాన్ని వదలి భారత్ లోని ఇతర ప్రాంతాలకు కు వలస వచ్చారు.

అయితే కొంతమంది హిందువులు మాత్రం…, స్వధర్మాన్ని…తాము పుట్టిపెరిగిన ప్రాంతంపై మమకారాన్ని చంపుకోలేక అక్కడే ఉండిపోయారు.! చాలా మంది దారుణమైన నరకయాతనలు అనుభవించారు.! ఒక ముస్లిం రాజ్యాంలో హిందువులుగా బతకాలంటే…జీజియా టాక్స్ కట్టాలని హుకుంలు జారీ చేశారు. అయినా భరించారు. పన్నులు కట్టి మరి హిందువులుగానే బ్రతికారు. తమ పూర్వీకుల అస్థిత్వాన్ని.., ఆ మట్టిలో కాపాడే ప్రయత్నం చేశారు.

కాలం గడిచింది. రాచరికం పోయింది. ఆధునిక పాలన వచ్చింది. అయినా ఆ ఆఫ్గానిస్తాన్ లో మిగిలిపోయిన మైనారిటీలైన హిందువులు, సిక్కుల పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలేదు.! తర్వాత కాలంలో అఫ్గానిస్తాన్ లో అంతర్యుద్ధం మొదలైంది. ఆపై తాలిబన్లు పాలనతో …, హిందువుల పరిస్థితి పెనం నుంచి పోయ్యిలో పడ్డట్టు అయ్యింది. చివరకు అఫ్గానిస్తాన్ మొత్తంగా ఒకప్పుడు లక్షల సంక్యలో ఉన్నహిందువులు, సిక్కులు… చివరకు 80 వేల మందిగా లెక్కతేలారు. వీరిలో కూడా చాలా మంది …ఈ మధ్యనే మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పౌరసత్వ చట్టం కారణంగా భారత్ కు వలస వచ్చారు. మిగిలిన వారు అప్గానిస్తాన్ లో అక్కడక్కడ ఉండిపోయారు.

వీరిలో గజనీపట్టణంలో ఉంటున్న రాజా రామ్ ఒకడు. ప్రస్తుతం గజనీ పట్టణంలో నివసిస్తున్న లాస్ట్ హిందూ మ్యాన్ ఇతనే. ఇతని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పటికే భారత్ కు వలస వచ్చారు. అయితే రాజా రామ్ మాత్రం ఆఫ్గానిస్తాన్ లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. గజనీలోని ధ్వంసం కాకుండా మిగిలిపోయిన ఓ హిందూ దేవాలయానికి అతను సంరక్షకుడిగా ఉన్నాడు. ఈ మధ్యనే ఫ్రీ ఆఫ్గాన్ రెడియో అతన్ని ఇంటర్వ్యూ చేయడంతో ఈ విషయం లోకానికి తెలిసింది. ఆఫ్గానిస్తాన్ లో మళ్లీ మంచి రోజులు వస్తాయని రాజా రామ్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం తన కుటుంబం అంతా భారత్ కు వలస వెళ్లిందని…, తాను మాత్రం గజనీ పట్టణంలోనే ఉండిపోయానని, అక్కడ దేవాలయాన్ని సంరక్షించడం తన బాధ్యత అని..గుళ్లో రోజు దీపం పెడతానని తెలిపాడు రాజారామ్. ఏదో ఒక రోజు తన కుటుంబ సభ్యులు గజనీకి తిరిగి వస్తారని ఎదరుచూస్తున్నాడు రాజారామ్.!

అయితే… ఆఫ్గానిస్తాన్ లో మళ్లీ హిందువులకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? గజనీలో నివసిస్తున్న ఈ రాజా రామ్ కున్న ధర్మనిష్ఠ మన దేశంలోని హిందువుల్లో ఎంతమందికి ఉంటుంది చెప్పండి.? డబ్బుకు, ఇతర ప్రలోభాలకు లోనై మతం మార్చుకునే హిందువుల కంటే…, గజనీ పట్టణంలో తీవ్ర నిర్భందాల మధ్యనే ఒంటరిగా నివసిస్తూ తన ధర్మనిష్టను కొనసాగిస్తున్న రాజా రామ్ ఎంతో ఉన్నతుడు. కాదంటారా…?

#Afghanistan #Temple #Rajaram