నాడు బిలియనీర్.. నేడు బికారి..!

Sep 26, Sat 2020 09:03 PM In Focus

-- అవిరైపోయిన అనిల్ అంబానీ ఆస్తులు
-- నగలమ్మి కోర్టు ఖర్చులు భరించాల్సిన పరిస్థితి
-- సొంత ఖర్చులకు సైతం కుటుంబ సభ్యులే దిక్కు

ఓడలు బళ్లు, బళ్లు ఓడలు కావడం అనే సామెత అనిల్ అంబానీకి సరిగ్గా సరిపోతుంది. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల్లో టాప్ టెన్ జాబితాలో నిలిచిన అనిల్.. ఇప్పుడు అథ:పాతాళానికి చేరుకున్నారు. ఓవైపు అన్న ముఖేష్ అంబానీ ప్రపంచ ధనవంతుల్లో టాప్ ఫైవ్ లోకి దూసుకుపోవడానికి సిద్ధమవుతుంటే.. తమ్ముడు మాత్రం గత వైభవాన్ని కోల్పోయి పూర్తిగా దివాలా తీశాడు. ప్రస్తుతం అనిల్ అంబానీ పరిస్థితి ఎలావుందంటే, కోర్టు ఖర్చుల కోసం నగలమ్ముకునే దీనావస్థకు చేరుకున్నాడు.

అనిల్ అంబానీకి చెందిన పలు సంస్థలకు చైనాకు చెందిన మూడు కంపెనీలో గతంలో రుణాలిచ్చాయి. ఈ రుణాలను తిరిగి రాబట్టుకునేందుకు సదరు కంపెనీలు గతంలో బ్రిటన్ కోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అనిల్ అంబానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యాడు. జీవనశైలి, ఆస్తులు, అప్పులకు సంబంధించిన పలు ప్రశ్నలకు అనిల్ కోర్టుకు సమాధానమిచ్చాడు.

తాను ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నానని.. తనకు రోల్స్ రాయిస్ కారు వుందని మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. తన వద్ద ప్రస్తుతం ఒకే ఒక కారు వుందని.. ఖర్చులను భారీగా తగ్గించుకున్నానని చెప్పారు. తన భార్య, కుటుంబ సభ్యులే తన ఖర్చులను భరిస్తున్నారని కోర్టుకు విన్నవించారు. తాను విలాసవంతమైన జీవితం గడపడం లేదని.. తన ఆదాయమార్గాలన్నీ మూసుకుపోయాయని తెలిపారు. ఏదైనా ఖర్చు చేయాల్సి వస్తే.. ఆస్తులను అమ్ముకోవడం తప్ప తనకు గత్యంతరం లేదని అన్నారు. దానికి కూడా కోర్టు అనుమతి అవసరమని తెలిపారు. నగలమ్మి కోర్టు ఖర్చులు చెల్లిస్తున్నానని విన్నవించారు అనిల్ అంబానీ.

ఈ కేసుకు సంబంధించి చైనా బ్యాంకులకు 5821 కోట్లు తిరిగివ్వడంతో పాటూ చట్టపరమైన ఖర్చుల కింద మరో 7 కోట్ల రూపాయలు చెల్లించాలని బ్రిటన్ కోర్టు మే 22న అనిల్ అంబానీని ఆదేశించింది. కానీ, కోర్టు ఇచ్చిన గడువులోపు అనిల్ చెల్లింపులు చేయలేకపోయారు. దీంతో తనకు సంబంధించిన ఆస్తులన్నిటీ గురుంచి తెలియపరుస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు జూన్ 29న అనిల్‌ను ఆదేశించింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు జరిగిన విచారణలో కోర్టు అనిల్‌ను పలు ప్రశ్శలు వేసింది. తన తల్లికి అనిల్ బాకీ పడ్డ 66 మిలియన్ డాలర్లు, కుమారుడికి బాకీ పడ్డ 41 మిలియన్ డాలర్ల గురించి కూడా కోర్టు ప్రశ్నించింది. ఆ అప్పులకు సంబంధించి పూర్తి వివరాలు తనకు గుర్తు లేవని అనిల్ పేర్కొన్నారు. అయితే.. అవి తనకు వారి నుంచి అందిన బహుమతులు కావని మాత్రం స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, తమ అప్పులు ఎగ్గొట్టేందుకు అనిల్ పెద్ద యుద్ధమే చేస్తున్నారని చైనా బ్యాంకుల తరఫు ప్రతినిధి వ్యాఖ్యానించారు. తమకు ఆస్తులు దక్కకుండా ఉండేందుకు వాటి యాజమాన్య హక్కులన్నీ కార్పొరేట్ కంపెనీల పేరిట పెట్టారని రుణదాతలు ఆరోపిస్తున్నారు.

#AnilAmbani #Reliance #Debts #UkCourt #Jewellery