విలువైనవాడు.. దివికేగినాడు

Sep 25, Fri 2020 10:21 PM In Focus

-- 40 వేల పాటల గాత్రధారికిదే మా కన్నీటి వీడ్కోలు

సరిగమలకు నాట్యం నేర్పిన స్వరమది.. గమకాలకు గమ్యం చూపిన గాత్రమది.. ఆయన ఓ సంగీత నిధి.. సుస్వరాల పెన్నిధి.. బాణి ఎలాంటిదైనా, భాష ఏదైనా అలవోకగా భావమొలకించే గానం అతని సొంతం.. ఆయన పల్లవిస్తే ప్రకృతి సైతం పరవశిస్తుంది.. ఆబాలగోపాలం ఆదమరిచిపోతుంది. అలాంటి గానగంధర్వుడు ఇక లేరు.. సంగీత సరస్వతీపుత్రుడు సెలవుతీసుకున్నాడు. ప్రపంచం బాలు అని ముద్దుగా పిలుచుకునే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం దివికేగారు. దాదాపు నలభై రోజులుగా కరోనా మహమ్మారితో పోరాడి విశ్రమించారు. నిత్యం మన గుండెల్లో అద్భుతమైన పాటలతో ఒలలాడించిన బాలు పాట ఆగిపోయింది. ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.

బాలు మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. ఎస్పీబాలు లేరనే వార్త ఇప్పుడు అభిమానులు, ఆడియెన్స్ నే కాదు, సాధారణ ప్రజలను కూడా దుఖసాగరంలో ముంచెత్తుతోంది. కరోనా సోకడంతో గత నెల మొదటి వారంలో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు బాలు. అప్పట్నుంచి ఆయన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆయనకు వెంటిలేటర్, ఎక్మోపై చికిత్స అందించారు. ప్రపంచశ్రేణి వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. దీంతో ఇటీవల కొద్దిగా కోలుకున్నారు. కరోనా నెగటివ్ కూడా వచ్చింది. ఆహారం తీసుకుంటారని వార్తలు వెలువడ్డాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక బాలు కోలుకుంటారని అందరూ భావించారు. తిరిగి ఆయన పాటలు పాడతారని, ఆయన పాటలు విని తరించిపోవాలని ఆశించారు. కానీ అందరి ఆశలపై నీళ్ళు చల్లుతూ గురువారం రాత్రి హఠాత్తుగా ఆయన ఆరోగ్యం మళ్లీ విషమించిందని వైద్యులు తెలిపారు. ఇక ఈసారి ఆయన పోరాటం ఫలించలేదు. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. తన కోసం ఎన్నో మొక్కులు మొక్కిన అభిమానుల మొక్కులను వృధా చేస్తూ తుది శ్వాస విడిచారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. చిన్నతనం నుంచే పాటలు పాడటం హాబీగా మార్చుకున్న బాలుకి.. తొలిసారిగా 1966లో విడుదలైన `శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న` చిత్రంలో తొలిసారి తన గాత్రం వినిపించారు బాలు. ఘంటసాల మరణం తర్వాత తెలుగు సినిమా పాటలకు బాలునే దిక్కు అయ్యాడు. సన్నివేశానికి న్యాయం చేకూరుస్తూ.. సన్నివేశానికి తగ్గట్టుగా నటనను గాత్రంలో ప్రస్పుటంగా ప్రకటించగల గాయకుడు ఎప్పీ. ముఖ్యంగా బాలు సినీ జీవితం `శంకరాభరణం` సినిమాతో పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు మాస్ గీతాలకే పరిమితం అయిన బాలు ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలనని విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నాడు.

అప్నట్నుంచి బాలు ఏనాడూ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. అసలు ఆయనకంత టైము కూడా దొరకలేదు. భారతీయ భాషల్లోనే కాదు, జపనీస్ వంటి విదేశీ భాషల్లోనూ ఆయన పాటలు పాడారు. హిందీలో `ఏక్ దూజేలియే` చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నారు బాలు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఆ తర్వాత మైనే ప్యార్ కియా, సాజన్, హమ్ ఆప్కే హై కౌన్ వంటి ఎన్నో చిత్రాలు బాలీవుడ్ లోనూ బాలుకు మంచి పేరుతీసుకొచ్చాయి. తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రమణ్యానికే దక్కింది.

ఏ పాట పాడినా.. ఆ పాటకే అందం వచ్చేంతగా ఆలపించడం బాలుకే చెల్లింది. భక్తి గీతాలను సైతం ఎంతో రసరమ్యంగా పాడటంలో ఆయనకు ఆయనే సాటి. `అన్నమయ్య`, `శ్రీరామదాసు`, `శ్రీరామరాజ్యం` చిత్రాలలో ఎస్పీ ఆలపించిన భక్తి గీతాలు ఇప్పటికీ ప్రతి ఇంటా వినిపిస్తూనే ఉన్నాయి.

గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడిగా, నటుడిగా, టీవీ వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా.. ఇలా బహుముఖ ప్రజ్ఞని ప్రదర్శించి తన విశ్వరూపం చూపించారు. సంగీత దర్శకుడిగా యాభై చిత్రాల వరకూ మ్యూజిక్ అందించాడు.

ఐదున్నర దశాబ్దాల సినీ కెరీర్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతోపాటు ఉత్తరాధి భాషలు ఇలా ఇండియాకి చెందిన 11 భాషల్లో నలభై వేలకుపైగా పాటలు ఆలపించి శ్రోతల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. పాట అంటే బాలు.. బాలు అంటే పాటే అనేలా ఆయన పాటల ఆడియెన్స్ మంత్రముగ్థుల్ని చేశాయి. ఐదున్నర దశాబ్దాలు ఆయనపాటలో మునిగి తేలేలా చేశాయి.

నభూతో నభవిష్యతి అనేలా బాలు గానప్రస్థానం సాగింది. భాతీయ సంగీత సామ్రాజ్యంలో రాజుగా వెలుగొందిన బాలు.. ఇక ఆలపించి, ఆలపించి, అలసి సొలసి సెలవుతీసుకున్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా.. ఆయన పాట ఎల్లప్పడూ మనతోనే వుంటుంది. కష్టసుఖాల్లో ఆ గాత్రం మనల్ని కదిలిస్తూనేవుంటుంది. బాలసుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి కలగాలని నేషనలిస్ట్ హబ్ మనసారా కోరుకుంటోంది.

#Spb #SpBalasubrahmaniam #LegenderySinger #BaluDemise #Covid10 #Coronavirus