నాలుగేళ్లు అలా.. ఓ ఏడాది ఇలా..

Sep 25, Fri 2020 10:19 PM Politics

-- మమతా బెనర్జీ ఫలిస్తుందా..?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు హిందూ ఓటు బ్యాంకుపై కన్నేశారా..? ఎన్నడూ లేనిది వారికి వరాలు ప్రకటించారా..? మైనారిటీలను సంతుష్టపరుస్తూ కనబడే మమతా బెనర్జీలో ఈ మార్పేంటి..? తాజాగా బెంగాల్ సి ఎం సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దుర్గమ్మ భక్తులకు ఓ వరాన్ని ప్రకటించారు. పశ్చిమబెంగాల్లోని ఉన్న దుర్గ పూజ కమిటీలకు ఒక్కో కమిటీకి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అంతేకాదు... ఈ సంవత్సరం దుర్గ పూజ నిర్వహించే కమిటీల నుంచి ఫైర్ డిపార్ట్‌మెంట్, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్, ఇతర స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు ఎలాంటి రుసుమును వసూలు చేయకూడదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా దుర్గ పూజ నిర్వహించే మండపాల వద్ద భద్రత, ఫైర్ సేఫ్టీ లాంటివి కల్పించడానికి స్థానికంగా రుసుము వసూలు చేస్తుంటాయి. ప్రభుత్వ శాఖలు వాటిని వసూలు చేస్తాయి. అయితే, ఈ ఏడాది ఎలాంటి రుసుములు వసూలు ఉండదని మమతా బెనర్జీ స్పష్టం చేశారట.

ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో దుర్గా పూజ మండపాల నిర్వాహకులు ప్రజల నుంచి చందాలు వసూలు చేస్తున్నారు. అసలే, ఉద్యోగాలుపోయి, ఉపాధి లేని వారికి ఇప్పుడు మండపాల నిర్వాహకులకు చందాలు ఇవ్వాలంటే ప్రజలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి మండపానికి రూ.50,000 చొప్పున సాయం చేస్తున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించారని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించేందుకు ఈ సాయం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 30,000 కమిటీలకు ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున అందిస్తే ప్రభుత్వానికి రూ.140 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. దుర్గ పూజ కమిటీలతో సీఎం మమతా బెనర్జీ సమావేశ నిర్వహించారు. ఈ సంవత్సరం దుర్గ పూజ మండపాలకు విద్యుత్ బిల్లులపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు.

‘దుర్గ పూజ నిర్వహించే రోజుల్లో ప్రత్యేకంగా ఓ కోవిడ్ 19 హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తాం. అలాగే, ఈ సంవత్సరం ఫైర్ డిపార్ట్‌మెంట్, ఎమర్జెన్సీ సేవలను ఉచితంగా అందించాలని కూడా కోరాను.’ అని మమతా బెనర్జీ చెప్పారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ దుర్గ పూజ కార్నివాల్ నిర్వహించడం లేదని ప్రకటించారు. ‘వచ్చే సంవత్సరం మరింత భారీ ఎత్తున దుర్గ పూజ కార్నివాల్ నిర్వహిస్తాం.’ అని మమతా అన్నారు. కాగా పశ్చిమ బెంగాల్లో సుమారు 37,000 దుర్గ పూజ కమ్యూనిటీలు ఉన్నాయి. అయితే ఇదంతా కపట ప్రేమగా పశ్చిమ బెంగాల్ బీజెపీ ఎద్దేవా చేసింది. గతంలో జై శ్రీరాం నినాదాలు వినగానే అంతెత్తున లేచిన మమతా ఇప్పుడు దుర్గమ్మ తల్లిని అడ్డుపెట్టుకుని రానున్న ఎన్నికలకు ఓట్లు కూడగట్టుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. గెలిచాక నాలుగేళ్లు మైనారిటీలకు వంతపాడుతూ మిగిలిన ఓ ఏడాది హిందువులకు సాయం చేయడం జిమ్మిక్కు మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#MamataBanerjee #DurgaPuja #HinduVotes #WestBengal