ఢిల్లీ అల్లర్ల వెనుక కమ్యూనిస్టు, కాంగ్రెస్ నాయకులు..!

Sep 25, Fri 2020 10:18 PM Politics

-- చార్జ్ షీట్ లో సంచలన విషయాలు వెల్లడించిన ఢిల్లీ పోలీసులు
-- ఆందోళనలో పార్టీల అధినాయకులు

ఢిల్లీలో జరిగిన సీఏఏ వ్యతిరేక అల్లర్లలో తవ్వుతున్నకొద్దీ భయంకర నిజాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసులు, ముస్లిమేతరులే టార్గెట్ జరిగాయని భావిస్తున్న ఈ హింసాకాండలో రాజకీయ నాయకుల పేర్లు బయటికి రావడం కలకలం రేపుతోంది. ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన తాజా చార్జ్ షీట్ లో రాజకీయ పార్టీల నాయకుల హస్తం వున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లౌకికవాదానికి బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకునే.. సీపీఎం, కాంగ్రెస్ లీడర్లతో పాటు.. పలు పార్టీల నాయకులకు.. ఢిల్లీ అల్లర్లతో లింకులు వెలుగుచూస్తున్నాయి. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌, కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షిద్‌, ఉదిత్‌రాజ్‌, సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేందర్‌ యాదవ్‌లపై పోలీసులు అభియోగాలు మోపారు. సీఏఏను వ్యతిరేకిస్తూ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న ఆరోపణలున్నాయి. అటు ఇప్పటికే ఈ కేసులో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు పలువరి పేర్లను ఢిల్లీ పోలీసులు ఛార్జ్ షీట్ లో చేర్చారు .వీరంతా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని చార్జిషీట్లో స్పష్టం చేశారు.

సుమారు 17 వేల పేజీలతో సెప్టెంబర్ 13న నమోదు చేసిన చార్జిషీట్‌లో.. ‘‘ఉమర్‌ ఖలీద్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, నదీం ఖాన్‌.. వంటి నాయకులు యాంటీ సీఏఏ- ఎన్సార్సీ ఉద్యమాల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ప్రజలను ప్రేరేపించారు’’ అని ఓ సాక్షి వాంగ్మూలం ఇచ్చినట్లుగా ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. హింస చెలరేగేలా కుట్రలు పన్నిన కోర్‌టీంలో సదరు సాక్షి కీలకంగా వ్యవహరించినట్లు స్పష్టం చేశారు. సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 164 ప్రకారం మెజిస్ట్రేట్‌ ఎదుట ఈ మేరకు వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిపారు. సదరు సాక్షితో పాటు మరో నిందితుడు కూడా సల్మాన్‌ పేరును ప్రస్తావించినట్లు పేర్కొన్నారు.

ఇక, ఈ విషయంపై స్పందించిన సల్మాన్‌ ఖుర్షీద్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీరు చెత్తను సేకరించాలనుకుంటే చాలా మలినాలు దొరుకుతాయి. ఎవరో ఒక వ్యక్తి ఇచ్చిన స్టేటమెంట్‌ను నిరూపించేందుకు ఈ చెత్తను జతచేస్తారు. నిజానికి ఆ రెచ్చగొట్టే ప్రసంగం ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చెత్త సేకరించే వాళ్లు తమ పనిని సరిగ్గా చేయలేకపోతున్నారు అనిపిస్తోంది’’అంటూ విమర్శలు గుప్పించారు.

ఢిల్లీ అల్లర్ల కేసు విచారణలో రాజకీయ నాయకుల హస్తం వెలుగుచూడటంతో ఆందోళన కలిగిస్తోంది. ఈ అల్లర్లలో ఇంకా ఎంతమంది పాత్ర వుందోననే అంశంపై ఢిల్లీ పోలీసులు దృష్టిసారించనట్టు తెలుస్తోంది. ఆ దిశగా విచారణను వేగవంతం చేసినట్టు సమాచారం.

#DelhiRiots #DelhiPolice #ChargeSheet #SalmanKhurshid #BrindaKarat #PrashantBhushan