జకీర్ నాయక్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

Sep 24, Thu 2020 11:44 PM In Focus

-- పీస్ టీవీ, మొబైల్ యాప్, యూట్యూట్ చానెళ్లపై నిషేధం..!
-- సోషల్ మీడియా ద్వారా ముస్లిం యువతను రెచ్చగొడుతున్న జకీర్
-- ఇంటలిజెన్స్ నివేదికలో భయంకర నిజాలు

వివాదాస్పద ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్ చుట్టూ మోదీ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ద్వేషాన్ని రేకెత్తిస్తున్నాడన్న కారణంతో.. జకీర్ నాయక్ కు చెందిన పీస్ టీవీతో పాటు, మొబైల్ యాప్, యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఇంటలిజెన్స్ బ్యూరో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఇచ్చిన నివేదికలో.. జకీర్ నాయక్ తన సోషల్ మీడియా నెట్ వర్క్ ద్వారా ముస్లిం యువతను రెచ్చగొడుతున్నాడని, వారిని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నాడని పేర్కొన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, నాయక్ కు చెందిన సోషల్ మీడియా సంస్థలకు జీహాదీ గ్రూపులతో సంబంధాలున్నాయని, దేశంలో జిహాదీ కార్యకలాపాలను అమలు చేయడానికి అరబ్ దేశాల నుంచి నిధులు పొందుతున్నట్టు ఐబీ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.

ఇక, జకీర్ నాయక్ ఇటీవల తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసిన వీడియోలో.. భారతదేశంలో హిందువులు 60 శాతం కంటే తక్కువగా వున్నారని.. ఈ పరిస్థితిని ముస్లింలు సద్వినియోగం చేసుకుని, తమ నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చాడు. అంతేకాదు, ముస్లిం సమాజానికి మద్దతు ఇచ్చేవారికే ఓటేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

మరోవైపు, ఇటీవల ఐబీ, ఎన్ఐఏతో పాటు ఇతర ఇంటలిజెన్స్ సంస్థల ఉన్నతాధికారులు హోమంత్రిత్వ శాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు. జకీర్ నాయక్ పోస్టు చేసిన ద్వేషపూరిత ప్రసంగాలు దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం జకీర్ నాయక్ పరారీలో వున్నాడు. అతడు మలేషియాలో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ జకీర్ నాయక్ కోసం వెతుకుతున్నాయి. అంతేకాదు, నాయక్ ఎన్.ఐ.ఎ. మోస్ట్ వాంటెడ్ జాబితాలో కూడా వున్నాడు.

ఇదిలావుంటే, పదే పదే హత్యలను ప్రేరేపించడం వంటి ద్వేషపూరిత ప్రసంగాలను ప్రసారం చేసినందుకు.. బ్రిటన్ కు చెందిన ఆఫ్ కామ్ మీడియా సంస్థ.. పీస్ టీవీ, పీస్ టీవీ ఉర్దూ చానెళ్లపై.. గత మే నెలలో 2 కోట్ల 75 లక్షల రూపాయల జరిమానా విధించింది.

అటు, జకీర్ నాయక్ మొబైల్ యాప్ ను కూడా ప్రారంభించాడు. లక్షకు పైడా డౌన్ లోడ్ లు కలిగిన ఈ యాప్ ఇంగ్లీష్, ఉర్దూ, బంగ్లా, చైనీస్ భాషల్లో పీస్ టీవీ కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా నాయక్ లైవ్ టీవీ కార్యక్రమాలు 24 గంటల పాటు దేశవ్యాప్తంగా ప్రసారం అవుతాయి. యాప్ నిషేధించబడినప్పటికీ త్రీప్లస్ రేంటింగ్ సాధించింది.

#ZakirNaik #HateSpeech #PeaceTv #Ban #India #IntelligenceBureau