భారత ఉపగ్రహాలపై చైనా సైబర్ దాడులు

Sep 24, Thu 2020 11:42 PM In Focus

-- 2012-18 మధ్యకాలంలో పలు దాడులు
-- వెల్లడించిన అమెరికన్ థింక్ ట్యాంకర్స్ స్టడీ..!
-- దాడులు నిజమే,.. కానీ, డ్రాగన్ పప్పులుడకలేదన్న శివన్

సరిహద్దుల్లోనే కాదు.. అంతరిక్షంలోనూ డ్రాగన్ హద్దుమీరుతోంది. మన ఉపగ్రహాలపైనా సైబర్ దాడులకు పాల్పడుతూ కయ్యానికి కాలు దువ్వుతోంది. నిన్నమొన్నటి నుంచి కాదు, ఏకంగా 2007 నుంచే జిత్తులమారి చైనా ఈ కుతంత్రానికి తెరతీసిందట.

అమెరికాలోని మేథోవర్గానికి చెందిన చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇనిస్టిట్యూట్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. కొన్నేళ్లుగా భారతీయ ఉపగ్రహాలపై చైనా సైబర్ దాడికి పాల్పడుతోందని దాని సారాంశం. ఇందుకు సంబంధించి మొత్తం 142 పేజీల రిపోర్టును విడుదల చేసింది. 2012 నుంచి 2018 మధ్య.. భారతీయ ఉపగ్రహ వ్యవస్థపై చైనా పలుమార్లు సైబర్ దాడులు చేసిందని,.. అయితే, 2012లో జెట్‌‌‌‌ ప్రొపల్షన్‌‌‌‌ లేబొరేటరీపై జరిగిన దాడి‌‌‌ ఒక్కటే.. విజయం సాధించిందని వెల్లడించింది.

భారత్ దగ్గర సైబర్ దాడులను ఎదుర్కోవడానికి కౌంటర్‌‌‌‌ స్పేస్‌‌‌‌ టెక్నాలజీ కేపబిలిటీ ఉందని.. యాంటీ శాటిలైట్‌‌‌‌ మిసైల్స్‌‌‌‌ టెక్నాలజీతో శత్రు ఉపగ్రహాలను నాశనం చేయగలదని.. సీఏఐఎస్ నివేదిక వెల్లడించింది. అయితే చైనా దగ్గర మల్టిపుల్‌‌‌‌ కౌంటర్‌‌‌‌ స్పేస్‌‌‌‌ టెక్నాలజీ కెపాసిటీ ఉందని తెలిపింది. అంతేకాదు, యాంటీ శాటిలైట్‌‌‌‌ మిసైల్స్‌‌‌‌, కో ఆర్బిట్‌‌‌‌ శాటిలైట్స్‌‌‌‌, డైరెక్టెడ్‌‌‌‌ ఎనర్జీ వెపన్స్‌‌‌‌, జామర్స్‌‌‌‌తో శత్రు దేశాలపై చైనా పై చేయి సాధించే అవకాశం ఉందని తేల్చిచెప్పింది.

దాడులు నిజమే.. ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధం : ఇస్రో
చైనా సైబర్ దాడుల ముప్పును అంగీకరించిన ఇస్రో.. ఈ విషయంలో రాజీపడబోమని పేర్కొంది. అంతేకాదు, సైబర్ దాడులనేవి సర్వసాధారణమని.. అయితే, దాడులను ఎదుర్కోవడంలో భారతీయు ఉపగ్రహ వ్యవస్థ ఇప్పటివరకు రాజీపడలేదని చెప్పింది.

సైబర్ దాడులు ముమ్మాటికీ నిజమే. కానీ, ఆ దాడుల వెనుక ఎవరున్నారో నిర్ధారించలేము. అయితే, దాడి జరగబోయేముందు అప్రమత్తం చేయడానికి మనకు బలమైన వ్యవస్థలున్నాయి. ఈ విషయంలో మేము ఎప్పుడూ రాజీపడలేదు. చైనా కూడా సైబర్ దాడులకు ప్రయత్నించి, విఫలమై వుండవచ్చు అని ఇస్రో సీనియర్ సైంటిస్ట్ ఒకరు చెప్పారు.

అంతేకాదు, భారత్ స్వతంత్ర నెట్ వర్క్ ను కలిగివుందని, ఇది ఇంటర్నెట్ వంటి పబ్లిక్ డొమైన్ భిన్నంగా అనుసంధానించబడి వుందని తెలిపారు. ఈ వ్యవస్థ మన ఉపగ్రహాల భద్రతకు ముప్పు లేకుండా చూస్తుందని అన్నారు.

ఇస్రో చైర్మన్ కె. శివన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సైబర్ దాడుల సమస్య ఎప్పుడూ వుంటుందని, ఈ విషయంలో భారత్ ప్రత్యేకం ఏమీ కాదన్నారు. అయితే, సైబర్ దాడులను తిప్పికొట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటుందని తెలిపారు.

#China #IndianSatellites #CyberAttacks #Isro #Usa #ChinaAeroSpaceStudiesInstitute #UsThinkTank