పోలీసులు, ముస్లిమేతరులే లక్ష్యంగా ఢిల్లీ అల్లర్లు..!

Sep 23, Wed 2020 10:57 PM Politics

-- సోషల్ మీడియాతో యువతకు ప్రలోభాలు
-- ప్రధాన సూత్రదారులుగా ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్
-- ఢిల్లీ పోలీసుల ఛార్జ్ షీట్ లో భయంకర నిజాలు

ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లోని.. మైనార్టీ హిందువులు, సిక్కులు, జైనులు, క్రైస్తవులకు.. భారత పౌరసత్వాన్ని కల్పించేందుకు కేంద్రం సీఏఏ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే, దీనికి వ్యతిరేకంగా కొన్ని కుహనాలౌకిక శక్తులు ఆందోళనబాట పట్టాయి. ఈ ఆందోళనల్లో హింసను ప్రేరేపించి, తమ పబ్బం గడుపుకోవాలని చూశాయి. ఇందులో భాగంగానే జె.ఎన్.యు. లో కొన్ని విద్యార్థి సంఘాలు సీఏఏ వ్యతిరేక ఆందోళనకు తెరతీశాయి. గతేడాది డిసెంబర్ తో పాటు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పలు హింసాత్మక ఘటనలతో రాజధాని ఢిల్లీ అట్టుడికింది. ఈ ఆందోళనలకు ప్రధాన సూత్రధారులుగా గుర్తించిన ఢిల్లీ పోలీసులు.. చార్జ్ షీట్ లో పలు భయంకర నిజాలను పేర్కొన్నారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో హింసను ప్రేరేపించడానికి.. కుట్రదారులు అన్ని వనరులను పకడ్బందీగా ఉపయోగించుకున్నట్టు ఢిల్లీ పోలీసులు తేల్చారు.

సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా.. జె.ఎన్.యు. మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్.. యువతను ఆకర్షించడానికి సోషల్ మీడియాను ఉపయోగించారని.. ఢిల్లీ పోలీసులు తమ చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు, హింసే అంతిమ లక్ష్యంగా నిరసనలు జరిగాయని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. జనాన్ని సమీకరించడం, అల్లర్లు సృష్టించడం, ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా హింసను ప్రేరేపించినట్టు.. ఫిబ్రవరి 17 నాటి కొన్ని వాట్సాప్ మెసేజ్ ల ద్వారా ఢిల్లీ పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.

అటు చార్జ్ షీట్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ లీడర్, ఆ పార్టీ సహ వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్ పేరు కూడ ప్రస్తావనకు వచ్చింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా.. 2019లో యోగేంద్ర యాదవ్.. జంతర్ మంతర్ వద్ద షార్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్ లను కలిసినట్టు తెలుస్తోంది. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా నిర్వహించ తలపెట్టిన ‘చక్కా జామ్’ కోసం యువతను సమీకరించడానికి ఈ ముగ్గురు సోషల్ మీడియాను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారని పోలీసులు ఆరోపించారు. అంతేకాదు, షహీన్ బాగ్ నిరసనల వెనుక ప్రధాన సూత్రధారి షార్జీల్ ఇమామ్ గా ఢిల్లీ పోలీసులు గుర్తించారు.

ప్రత్యేకమైన సామాజిక, ఆర్థిక, జనాభా దృష్ట్యా.. అల్లర్ల కోసం ఉత్తర ఢిల్లీని ఎంచుకున్నట్టు చార్జ్ షీట్ వెల్లడించింది. కుట్రదారులు జనసమీకరణకు, హింసను ఇదే అనువైన స్థలంగా భావించినట్టు పోలీసులు ఆరోపించారు. కుట్రదారులంతా దక్షిణ ఢిల్లీలోని తమ నివాసాల్లో క్షేమంగా వుంటూనే.. ఉత్తర ఢిల్లీలో హింసను ప్రేరేపించినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

అంతేకాదు, గతేడాది డిసెంబర్ లో జరిగిన ఆందోళనలకు, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆందోళనలకు మధ్య సారూప్యతలను ఢిల్లీ పోలీసులు గుర్తించారు. డిసెంబర్ అల్లర్ల కంటే.. ఫిబ్రవరిలో అల్లర్లు మరింత తీవ్రతతో జరిగాయి. ఈ రెండు సందర్భాల్లోనూ కుట్రదారులు తమ ప్రేరేపిత ప్రసంగాలతో యువతను రెచ్చగొట్టి.. ‘చక్కా జామ్’ ఆందోళనలకు జనాన్ని సమీకరించినట్టు తెలుస్తోంది. 2019 డిసెంబర్ అల్లర్లలో పాల్గొన్న దాదాపు అందరు కుట్రదారుల.. 2020 ఫిబ్రవరి ఆందోళనల్లో కూడా పాలుపంచుకున్నట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు.

రెండు సందర్భాల్లోనూ కుట్రదారుల మొదటి లక్ష్యం పోలీసులు, ముస్లిమేతరులేనని తెలుస్తోంది. అయినప్పటికీ రెండు సందర్భాలకు రెండు ముఖ్యమైన తేడాలను పోలీసులు గుర్తించారు. 2019 డిసెంబర్ లో జామియా, షహీన్ బాగ్ ప్రాంతాల్లో ఆందోళనలు తీవ్రస్థాయిలో జరిగాయి. 2020 ఫిబ్రవరి ఆందోళనల్లో ఆందోళనకారుల ఈ ప్రాంతాన్ని ఉద్దేశపూర్వంగా తప్పించి, కొత్త ప్రాంతాన్ని ఎంచుకున్నారు. డిసెంబర్ నాటి ఆందోళనలకు భిన్నంగా.. ఫిబ్రవరి ఆందోళనలో మహిళలను ముందు వరుసలో ఉంచినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మొత్తానికి, కుట్రదారులు డిసెంబర్ అల్లర్ల నుంచి పాఠాలు నేర్చుకుని.. ఫిబ్రవరి ఆందోళనలను మరీ పకడ్బందీగా నిర్వహించినట్టు తెలుస్తోంది.

#DelhiRiots #DelhiPoliceChargesheet #DelhiPolice #ShaheenBagh #Jamia #UmarKhalid #SharjeelImam #YogendraYadav