ఏపీ స్కూల్స్ ప్రారంభం

Sep 23, Wed 2020 12:50 PM Politics

-- తల్లిదండ్రులనుండి డిక్లరేషన్ కోరుతున్న విద్యాశాఖ
-- కారణం అదేనట..!

ఆంధ్రప్రదేశ్‌లో నెలల తరబడి మూసేసిన స్కూళ్లను సెప్టెంబర్ 21న మళ్లీ తెరవడం జరిగింది. అయితే ప్రైవేట్ స్కూల్స్ ఇంకా క్లాసులు ఆరంభించేందుకు సిద్ధం కానట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విద్యాలయాలు మాత్రం తెరుచుకుంటున్నాయి. 9 వతరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల వరకు అందరినీ హాజరుకావాలంటూ ఏపీ విద్యాశాఖ నోటీసులిచ్చింది. అయితే కరోనావ్యాప్తి ఇంకా అలానే ఉంది కాబట్టి... విద్యార్థులను స్కూళ్లకు పంపాలా వద్దా అనే దానిపై తుదినిర్ణయం తల్లిదండ్రులకే వదిలేసింది ప్రభుత్వం.

విద్యార్థులు స్కూళ్లకు వస్తే... వాళ్లకు కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని చెబుతూ... ముందుగానే విద్యా శాఖ... స్కూళ్ల గదులను పూర్తిగా శానిటైజ్ చేయించి విద్యార్థులకు పూర్తి స్థాయిలో పరిశుభ్రమైన వాతావరణంలో విద్య బోధన జరిగేలా చర్యలు చేపట్టున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ చూసిన కొందరు తల్లిదండ్రులు నమ్మకంతో విద్యార్థులను స్కూళ్లకు పంపాలని డిసైడవుతున్నారు.

తల్లిదండ్రులకు కండీషన్
స్కూళ్లకు వచ్చే పిల్లల తల్లితండ్రుల దగ్గర అనుమతి పత్రం తీసుకుంటున్నారు అధికారులు. ఇదేంటంటే... "మా పిల్లల్ని స్కూళ్లకు పంపడానికి మాకు ఏ అభ్యంతరమూ లేదు. మా ఇష్ట ప్రకారమే స్కూళ్లకు పంపుతున్నాం" అని పేరెంట్స్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాదు... పిల్లల్ని స్కూళ్లకు పంపేటప్పుడు... వాళ్లకు కరోనా సోకకుండా... నోటికి మాస్కులు, చేతులకు శానిటైజర్ రాసి, సేఫ్ డిస్టాన్స్ పాటించేలా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రిపేర్ చెయ్యాల్సి ఉంటుంది. ఇవన్నీ చేస్తామనేందుకే ఆ డిక్లరేషన్ అంటున్నారు.

స్కూళ్లకు 9వ తరగతి నుంచి ఇంటర్ పిల్లల్నే అనుమతిస్తున్నారు కాబట్టి... ఆ పిల్లలందరికీ... కరోనాపై ఒక అవగాహన వారికి వుంటుంది అని నమ్ముతోంది ప్రభుత్వం. అయినప్పటికీ... రేపు ఏ పిల్లలకైనా కరోనా సోకితే... ప్రభుత్వంపై తల్లిదండ్రులు ఆరోపణలు చేయకుండా ఉండేందుకే విద్యా శాఖ తెలివిగా పేరెంట్స్ నుంచి డిక్లరేషన్ తీసుకుంటూ ముందు జాగ్రత్తలు తీసకుంటున్నట్లు కనబడుతోంది.

తొలిరోజు అంటే నిన్న అనగా సెప్టెంబర్ 21న... స్కూళ్లు అంతంతమాత్రంగానే తెరచుకున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల విధులలో ఉన్నవారు తప్ప మిగిలిన ఉపాధ్యాయులు 9, 10 తరగతి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది హాజరయ్యారు. ఆన్లైన్ క్లాస్‌లలో సందేహాలను తీర్చుకోవడానికే స్కూళ్లు తెరిచారు అనే అపోహతో... చాలా మంది 9, 10వ తరగతి విద్యార్థులు స్కూళ్లకు రాలేదు. మంగళవారం అంటే నేటి నుంచి స్కూళ్లకు విద్యా శాఖ ఆదేశాలతో 50 శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే హాజరవుతున్నారు.

ఇప్పటికీ తల్లిదండ్రులకు పిల్లల్ని స్కూళ్లకు పంపే ఆసక్తి కనిపించట్లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... కరోనా సోకుతుందేమో అనే భయం వెంటాడుతోంది. మంగళవారం డిక్లరేషన్ ఇచ్చేందుకు కొందరు తల్లిదండ్రులు స్కూళ్లకు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే మరికొందరు తల్లిదండ్రులు మాత్రం డిక్లరేషన్ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న.. ప్రభుత్వం నుంచి పూర్తి భరోసా వచ్చేదాకా పిల్లల్ని స్కూళ్లకు పంపించేది లేదు అని తేల్చిచెబుతున్నారు.

#SchoolsReopen #AndhraPradesh #Covid19 #Pandemic