మోదీ ఉచ్చు బిగించారా..? విపక్షాల భయం దేనికి..?

Sep 23, Wed 2020 12:49 PM Right Angle

మౌలికమైన కొత్తదనం, పరిణతి కలిగిన నేతల గణం లేని రాజకీయ సంస్థలు, పార్టీలు దీర్ఘకాలం మనజాలవు. డాంబికాలు పేలేవారూ, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే నేతలు పెరుగుతున్నకొద్దీ మురుగు మేట వేస్తుంది. భారతదేశ రాజకీయాల్లో 70దశకంలోని ఉత్తరార్ధం అత్యంత కీలకమైంది. ప్రజాస్వామ్యం వల్ల సంతరించిన అధికారం నియంతృత్వంగా పరిణమించిన కాలమది. ఇందిరాగాంధీ అధికారం రాచరికాన్ని తలపించింది. గడచిన నాలుగున్నర దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారింది. ప్రాంతీయ పార్టీలు ప్రాబల్య స్థానాల నుంచి పతనదశలోకి ప్రవేశించాయి. 90వ దశకం తర్వాత పీ.వీ.నరసింహారావు, వాజ్ పేయి ప్రభుత్వాలు మినహా దాదాపు రెండు దశాబ్దాల పాటు కూటమి ప్రభుత్వాల పాలన సాగింది. 2014 తర్వాత కాంగ్రెసేతర స్థిర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, 2019 ఎన్నికల్లో మరోసారి పగ్గాలు చేపట్టడంతో దేశంలోని ప్రాంతీయ పార్టీలు, పతన దశలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. 2016 నోట్ల రద్దు మొదలు ఇటీవలి నూతన వ్యవసాయ విధానం వరకూ అవకాశం దొరికినప్పుడల్లా ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందనీ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిహసిస్తోందనీ, ఫాసిజం రాజ్యమేలుతుందనీ....అల్లరి చేస్తున్నాయి.

మూడు వ్యవసాయ బిల్లుల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీప్రస్తుతం ఒక్కటయ్యాయి. కేంద్రం రాజ్యాంగంపై దాడి చేస్తోందంటూ కొత్త పల్లవి అందుకున్నాయి. నోట్లరద్దు, 370 అధికరణం రద్దు, పౌరసత్వ చట్టసవరణ లాంటి సంచలన, చారిత్రక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కిమ్మనని పార్టీలు నూతన వ్యవసాయ విధానం ఉభయ సభల్లో ప్రవేశపెట్టగానే ఇంతలా అల్లరిచేయడానికి కారణమేంటి? కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో నూతన వ్యవసాయ విధానం గురించి వాగ్దానం చేసినపుడు, బీజేపీ కొత్త వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టినపుడు కంగారెందుకు? కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ విధానంలో అసలేముంది? ప్రాంతీయ పార్టీల సరికొత్త భయాలకు కారణమేంటి? 2024లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే పుట్టగతులుండవన్న భయమే తాజా ఆందోళనకు కారణమా? భారత వ్యవసాయ సంక్షోభానికి కారకులెవరు?

THE FORMERS PRODUCE TRADE AND COMMERCE (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్)’ బిల్లును, ‘THE FORMERS -(ఎంపవర్‌మెంట్ అండ్ ప్రొటెక్షన్) AGREEMENT ON PRICE ASSURENCE AND FORM SERVICES బిల్లును సెప్టెంబర్ 17న మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. వ్యవసాయ రంగానికే చెందిన మరో బిల్లు ‘ESSENTIAL COMADITIES (అమెండ్‌మెంట్)’ సెప్టెంబర్ 15న లోక్‌సభ ఆమోదం పొందింది. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ ల స్థానంలో ఈ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 19న ఈ బిల్లులను పెద్దల సభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. నిత్యావసర సరుకుల (సవరణ) ఈ బిల్లు ప్రకారం... చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి ఆహార ఉత్పత్తుల నిల్వలపై ఆంక్షలు తొలగిపోతాయి.

రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు ప్రకారం రైతులు పండించిన పంటల్ని మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనలు ఉండవు. తమ ఉత్పత్తుల్ని ఎప్పుడైనా, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మార్కెట్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎక్కువ ధర వచ్చినప్పుడే తమ పంటను అమ్ముకోవచ్చు. కనీస మద్దతు ధర కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ధరల నియంత్రణ రైతులు-ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోనే ఉంటుంది. మధ్యలో ఎలాంటి దళారీ వ్యవస్థ ఉండదు. ప్రైవేట్ వ్యాపారులే రైతు వద్దకు వచ్చి కొనుగోలు చేస్తారు కాబట్టి మార్కెటింగ్/రవాణా ఖర్చులు,ఇబ్బందులు ఉండవు. అంతరాష్ట్ర వాణిజ్యం మరింత సులభతరం అవుతుంది. రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు ప్రకారం... పంటలు వేయడానికి ముందే వ్యాపారస్తులతో రైతులు చేసుకునే ఒప్పందాలకు చట్టబద్ధత వస్తుంది. కాంట్రాక్ట్ సేద్యాన్ని చట్టబద్ధం చేయడం వల్ల వ్యాపారులు ఒప్పందాలను ఉల్లంఘించడం కుదరదు.

నిర్ణీత కాల వ్యవధికి ప్రైవేట్ వ్యాపారి రైతుతో ఒప్పందం కుదుర్చుకుని... ఆ పంటను కొనుగోలు చేస్తాడు. వ్యవసాయ సంబంధిత కంపెనీలు,ప్రాసెసర్స్,హోల్ సేలర్స్,రిటైలర్స్,ఎగుమతిదారులు.. ఎవరికైనా రైతులు తమన పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. వ్యవసాయ రంగంలో సాంకేతికతకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు ప్రధానంగా మార్కెట్ యార్డుల్లోనే జరిగేవి. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులతో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు-కొనుగోళ్ల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. నిత్యావసర వస్తువుల(సవరణ) బిల్లు ప్రకారం ధాన్యం,నూనె గింజలు,ఉల్లిగడ్డలు,బంగాళాదుంపలు నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగించబడుతాయి. తద్వారా వీటిని భారీ మొత్తంలో నిల్వ చేసి... ఆ తర్వాత ఇష్టానుసారం ధరలు పెంచి అమ్మే పెద్ద కంపెనీల గుత్తాధిపత్యానికి తెరపడుతుంది. అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ఈ బిల్లు అవకాశం కల్పించనుంది. తద్వారా పోటీ వాతావరణం ఏర్పడి సప్లై చైన్ ఆధునీకరించబడే అవకాశం ఉంటుంది. కోల్ట్ స్టోరేజీలు,వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఆధునిక సదుపాయాల కల్పనకు అవకాశం ఉంటుంది. 1991లో నూతన ఆర్థిక విధానాల పేరిట నాటి పీవీ ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దీంతో క్రమక్రమంగా మన వ్యవసాయ రంగం దేశ, విదేశీ, కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీని పర్యవసానాలే ఇవ్వాళ్టి దుష్ఫలితాలు. సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు. దీనికి పునాది ‘డంకెల్‌ డ్రాఫ్ట్‌’. ఈ ‘డంకెల్‌’ ప్రతిపాదనలను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించడంతో వ్యవసాయ రంగానికి ఉరిశిక్ష పడింది.

‘భారత పేటెంట్‌ చట్టం 1970’ ప్రకారం వ్వవసాయం, పండ్ల తోటలు, మానవమాత్రులు, జంతువులు, మొక్కలకు సంబంధించిన సమస్త ప్రక్రియలు, ఆహారం, మందులకు ఉపయోగించే పదార్థాలు, రసాయనక పదార్థాలు, మొక్కలపై పేటెంట్లు పొందడానికి వీలు లేదు. మొత్తంగా భారత పేటెంట్ల చట్టం మానవాళి జీవనానికి అత్యవసర ఉత్పత్తుల్ని, ప్రకృతి సంపదని ఏ ఒక్కరికో ప్రైవేటు హక్కుగా బదిలీ చేయడానికి ఒప్పుకోదు. ఈ చట్టం దేశ ప్రజలందరికీ రక్షణ చట్టంగా ఉండేది. అయితే ఈ చట్టాన్ని సవరించక(రద్దు) పోతే అమెరికా ‘స్పెషల్‌ 301’ కింద చర్యలు తీసుకొంటామని బెదిరించడంతో అప్పటి మన పాలకులు ఈ చట్టాన్ని రద్దు చేశారు. దీంతో తరతరాల మన విజ్ఞానం, మానవ మేధస్సు, మొత్తం సామాజిక సంపద సాంతం కార్పోరేట్ కంపెనీల ఆస్తిగా మారిపోయింది. మనకు ఆత్మహత్యలు మిగిలాయి. ఇక మన దేశంలో 1980లలో విత్తన, వ్యాపార రంగంలో బహుళజాతి కంపెనీలకు ద్వారాలు తెరిచింది కాంగ్రెస్ పార్టీయే. 1991లో భారతీయ విత్తన పరిశ్రమలో వంద శాతం విదేశీ ఈక్విటీలకు అనుమతి చ్చారు. అదే సమయంలో అప్పటివరకు విత్తనాల దిగుమతుల మీద ఉన్న నియంత్రణలను బాగా సడలించారు. ముఖ్యంగా మన వ్యవసాయ రంగంలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకరించారు. దీంతో మన వ్యవసాయ రంగం పూర్తిగా మార్కెట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. మన వ్యవసాయం ధ్వంసమై పోయింది.

జీవ పరిజ్ఞానంపై, మొక్కలు, జంతువులు, జీన్స్‌ లపై పేటెంట్‌ హక్కు కావాలని మొదట్లోనే వ్యవసాయ ప్రధాన దేశాలు కోరుకున్నట్లైతే ఇన్ని రకాల మొక్కల్ని, జీన్స్‌ని ధనిక దేశాలు సమకూర్చుకోగలిగి ఉండేవి కావు. సంపన్న దేశాలు ఈ రోజు అనుభవిస్తున్న ఎన్నో రకాల వంగడాలు మన లాంటి వ్యవసాయ దేశాలు పెట్టిన భిక్షే. ఉదాహరణకు మన రాష్ట్రంలోని ఒంగోలు గిత్తపై మనకు పేటెంట్‌ ఉండి వుంటే ఆ మేలు జాతి గిత్త బ్రెజిల్‌ లాంటి దేశాలకు తరలిపోయేదా? సంపన్న దేశాలు విరివిగా వాడుకుంటున్న ఆకు కూరల రకాలు భారత్‌, చైనా, ఇరాన్‌ లాంటి దేశాల నుంచి సేకరించినవే. సంపన్న దేశాలు విరివిగా జన్యు సంపదను తరలించుకు పోయి, బయో టెక్నాలజీ, జెనటిక్‌ ఇంజనీరింగ్‌లను అభివృద్ధి చేసుకొన్నాయి. 12 దేశాలకు 1900 రకాల విత్తనాలని పంచి పెట్టిన మన దేశం ఒక్క పైసా కూడా సంపాదించలేదు. ఇంత విధ్వంసం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడే.

1990లో మొదలైన సంస్కరణ పర్వాన్ని సైద్ధాంతిక ఎజెండాతో నిమిత్తం లేకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అమలు చేయాల్సిందే. నిజానికి తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ విధానం దళారీ వ్యవస్థను నియంత్రిస్తుంది. కార్పోరేట్ సంస్థలు అడ్డగోలుగా దోచుకోకుండా ఒప్పందాలు చేసుకునే వీలు కల్పిస్తోంది. అనివార్యంగా అమలు చేయాల్సిన సంస్కరణల్లో రైతు ప్రయోజనాన్ని జోడించింది మోదీ సర్కార్. మొత్తం వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీకి హఠాత్తుగా రాజ్యాంగం, రైతన్నలు గుర్తుకు రావడమే వైచిత్రి. కాంగ్రెస్, వామపక్షాలు సహా ప్రాంతీయ పార్టీలకు అభ్యంతరం నూతన వ్యవసాయ విధానం గురించి కాదు. బీజేపీ తన పట్టుపెంచుకోవడాన్ని సహించలేకపోతున్నాయి.

బీజేపీ సభ్యత్వం దేశ వ్యాప్తంగా 18 కోట్లకు చేరింది. ప్రతి ఇంట్లో సగటున ఇద్దరు కమలం వైపు మొగ్గుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి 3కోట్ల 60 లక్షల మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2019 ఎన్నికలకు ముందే బీజేపీ సుమారు 35శాతం ఓట్లను ఖరారుగా తయారు చేసుకుంది. 2019లో 37.36శాతం ఓట్లను రాబట్టింది. రాబోయే ఎన్నికల నాటికి 42 నుంచి 45 శాతం ఓట్లను సాధించ గలిగితే హ్యాట్రిక్ అధికారాన్ని నమోదు చేయవచ్చన్నది బీజేపీ టార్గెట్. జేడీ(యూ)తో తగ్గిన సాన్నిహిత్యం, వ్యవసాయ బిల్ నేపథ్యంలో అకాలీదళ్ మంత్రి రాజీనామాతో, ఆ పార్టీతో పొరపచ్చాలు, బీహార్ లో పాశ్వాన్ శక్తి అల్పం కావడాన్ని బీజేపీ అధిగమించాలని, స్వంతంగా అధికారాన్ని సాధించేందుకు పూర్తి స్థాయి శక్తియుక్తులు వెచ్ఛించాలని చూస్తోంది.

ఈ మొత్తం వ్యూహంలో భాగమే రామమందిర నిర్మాణం. 5వందల ఏళ్ల తప్పిదాన్ని సరిదిద్దేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఆ పార్టీకి అనుకూలించే అవకాశాలే ఎక్కువ. బీజేపీ త్రిశూల వ్యూహాన్ని అనుసరించేందుకు పావులు కదపడమే కాంగ్రెస్ సహా మిగతా ప్రతిపక్షాల్లో గుబులు రేపుతోంది. రామ మందిర నిర్మాణం, సంక్షేమ పథకాల ప్రతిఫలాలు అందేలా చేయడం, సంస్థాగతంగా బలపడటం అన్న మూడు అంశాల ఆధారంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2021లో వచ్చే బీహార్ ఎన్నికలు, ఆ తర్వాత వరుసగా వచ్చే పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో తమ తాజా వ్యూహాన్ని పరీక్షించేందుకు బీజేపీ సన్నద్ధమైంది. 1984లో కేవలం 2 లోక్ సభ స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ సరిగ్గా నాలుగు దశాబ్దాల తర్వాత 2024లో వందల స్థానాలు లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగనుందని అంచనా. పదేళ్ల పాలన నినాదంగా సాగే బీజేపీ పోల్ స్ట్రాటజీ ప్రతిపక్షాల్లో గుబులు పుట్టిస్తోంది. రామమందిరం, ట్రిపుల్ తలాఖ్, 370 అధికరణం రద్దు, పౌరసత్వ చట్ట సవరణ, అసోంలో ఎన్నార్సీ అమలు లాంటి అంశాలు తమ అమ్ములపొదిలో అస్త్రాలుగా రంగం సిద్ధం చేసింది. రాబోయే రోజుల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసినా ఆశ్చర్యం లేదంటారు రాజకీయ విశ్లేషకులు.

కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు అంతంతమాత్రమే. ప్రాంతీయ పార్టీలన్నీ అవినీతి, బంధుప్రీతిలో ఓలలాడుతున్నాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే, జాతీయ వ్యవహారాలలో ప్రాంతీయపార్టీల వైఖరి అవకాశవాదంతో కూడుకున్నది. జాతీయస్థాయిలో బలాబలాల సమీకరణలో, తమ బలంతో తాము బేరాలు ఆడగలమని, ఒత్తిళ్లు తేగలమని, లేదా తమ బలాన్ని అమ్ముకోగలమని అనుకుంటున్నాయే తప్ప, తమకంటూ సొంత విధానాలు ఆ పార్టీలకు లేవు. అటువంటి ప్రాంతీయ పార్టీల నుంచి ఏమి ఆశించగలం? నిజాయితీకి మారుపేరని పిలిచే నితీశ్‌ కుమార్‌కు ఇంకా సిద్ధాంతాలున్నాయా? రామమనోహర్‌ లోహియా, కర్పూరీ ఠాకూర్‌ల పేర్లు ఆయనకు గుర్తున్నాయా? వీరందరికీ విదేశాంగం గురించి, రక్షణ గురించి, ఆర్థికాంశాల గురించి జాతీయస్థాయి వైఖరులేమైనా ఉన్నాయా? ఉన్నట్టు మనకు తెలుసునా? జాతీయస్థాయిలో మోదీకి ప్రాంతీయనాయకులు ప్రత్యామ్నాయం కాలేరు. తప్పుడు పునాదులపై అలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా ఫలితం ఉండదు.

#SaiKrishna #RightAngle #Modi #FarmersBill