హైందవ ధర్మ వీరుడు రాజా శంభాజీ

Sep 23, Wed 2020 12:44 PM Bharateeyam

మిత్రులారా..! మనలో ఎంతమందికి రాజా శంభాజీ గురించి తెలుసు? ఐదు లక్షల సైన్యం. ఇంకా అపారమైన ధన సంపదలు, పైగా పేరు మోసిన సర్థారులందరితో కలిసి…, శంభాజీని బంధించేందుకు వచ్చిన మొగల్ చక్రవర్తి ఔరంగజేబుకు ఏమైంది.? ఆ రోజుల్లో ఆసియా ఖండంలో అత్యంత శక్తిశాలిగా గుర్తించబడిన ఔరంగజేబు.., ఓ చిన్న హిందూ రాజును బంధించేందుకు ఎందుకు 9 ఏళ్ళు పట్టింది? డబ్బు కోసం, భౌతిక సుఖాల కోసం కన్నతల్లిలాంటి మతాన్ని వదిలి విదేశీ మతాలను స్వీకరించే జాతి ద్రోహులకు రాజా శంభాజీ ఎలా బుద్ది చెప్పాడు? స్వయంగా నీ సొంత కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేసినా...నేను మాత్రం ఇస్లామ్ ను స్వీకరించేది లేదంటూ ఔరంగజేబుకు స్పష్టం చేసిన హైందవ ధర్మ నిష్టపరుడాయన..! అంతేకాదు నన్ను నరకయాతనలకు గురిచేసినా..., శరీరాన్నిముక్కలు చేసినా సరే..., నా సమాధానం ఇదేనంటూ గర్జించిన వీరుడు శంభాజీ..! మనం ఇప్పుడు వరుస సిరీస్ లలో శంభాజీ జీవిత విశేషాలను తెలుసుకుందాం. ఈ క్రమంలో మొదట మనం ఛత్రపతి శివాజీ మహారాజు కుటుంబం గురించి తెలుసుకోవాలి.

మనలో చాలా మందికి ఛత్రపతి శివాజీ మహారాజు గురించి తెలుసు. ఆయన స్థాపించిన హిందూ స్వరాజ్యం గురించి కూడా తెలుసు.!1680లో ఛత్రపతి శివాజీ మహారాజు స్వర్గస్థులైన తర్వాత..., హిందూ స్వరాజ్యానికి రాజులైన ఆయన వారుసుల గురించి చాలా మందికి తెలియదు. తెలియదు అనేకంటే మన దేశంలో తిష్టవేసిన సోకాల్డ్ మార్క్స్ మేకాలేవాద చరిత్రకారులు.. ఛత్రపతి శివాజీ తదనంతరం హైందవ ధర్మవీరుల పోరాటగాథలను కావాలనే తొక్కిపెట్టారనే చెప్పాలి. 1674లో ఛత్రపతి శివాజీ మహారాజు... పట్టాభిషేకం జరిగిన కొద్దిరోజులకే ఆయన మాతృమూర్తి జీజామాత దివంగతులయ్యారు. జీజామాత మరణం తర్వాత ఛత్రపతి శివాజీకి సైతం ఇంటిపోరు తప్పలేదు. కుటుంబంలో తన ఇల్లాళ్ళ మధ్య చెలరేగిన వైరాలతో ఆయన కాసింత కలత చెందిన మాట వాస్తవం. ఛత్రపతి శివాజీ మహారాజుకు ఆరుగురు భార్యలు. మొదటి సోయరాబాయి, రెండో భార్య సాయి బాయి , అలాగే కాశీభాయ్, పుత్లాబాయి, సకావర్ బాయి, ఇంకా సుగుణబాయి ఉన్నారు. 1657లో శంభాజీకి జన్మనిచ్చిన తర్వాత రెండళ్ళకే శివాజీ మహారాజు రెండవ భార్య సాయిబాయి మరణించారు. అయితే ఛత్రపతి మొదటి భార్య సోయరా బాయికి అప్పటికింకా సంతానం కలగలేదు. 1670లో ఆమెకు రాజారామ్ జన్మించారు. శంభాజీ కంటే కూడా వయస్సులో రాజారామ్ చాలా చిన్నవారు. శంభాజీ చిన్నతనంలోనే తల్లి సాయిబాయ్ మరణించడంతో... శంభాజీ అలానపాలన అంతా రాజమాత జీజాబాయియే చూసుకున్నారు. ఆమే శంభాజీని పెంచి పెద్ద చేసింది. ఆ రోజుల్లో రాజ కుటుంబంలో రాజకీయ ఒప్పందాల్లో భాగంగా కొన్ని వివాహాలు జరిపించడం అనవాయితీగా ఉండేది. ఛత్రపతి వివాహాలు కూడా ఇంచుమించు అలాంటి ఒప్పందాల్లో భాగంగానే జరిగాయి. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు పెద్ద కుమారుడు శంభాజీ వివాహం కూడా ఓ రాజకీయ ఒప్పందంలో భాగంగానే...యాసోబాయ్ తో జరిగింది.

శంభాజీ చిన్నతనంలో ఉన్నప్పుడు...ఛత్రపతిని ఓడించలేకపోయిన ఔరంగజేబు..., తన హిందూ సేనాని అయినా రాజా జయ్ సింగ్ ను శివాజీ మీదకు పంపాడు. ఒక హిందూ రాజు...మరో హిందూ రాజుతో పోరాటం వలన..., హిందూ సమాజానికే నష్టమని భావించారు ఛత్రపతి శివాజీ. దీంతో ఆయన రాజా జయసింగ్ తో పురంధర్ సంధి చేసుకున్నారు. అయితే సంధి షరతులపై నమ్మకం లేని జయసింగ్... శివాజీ కుమారుడు శంభాజీని తన ఆధీనంలో ఉంచాలని కోరారు. అందుకు అంగీకరించిన శివాజీ తన కుమారుడు శంభాజీని జయసింగ్ వెంట ఉత్తరభారతానికి పంపించారు. ఈ ఒప్పందం కారణంగా చిన్నతనంలోనే..., శంభాజీకి మొగల్ మనసాబ్దార్ హోదాతోపాటు, 5వేల సైన్యాన్ని అతని పర్యవేక్షణలో ఉంచుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత 1666లో ఆగ్రా కోటలో ఔరంగజేబును...కలిసేందుకు ఛత్రపతి శివాజీ మహారాజు వెళ్లినప్పుడు..., తన వెంట శంభాజీని కూడా మొగల్ దర్బారుకు తీసుకువెళ్లారు. ఈ చర్య ద్వారా తన తదనంతరం హిందూ స్వరాజ్యానికి కాబోయే ఛత్రపతి..., శంభాజీయేనని శివాజీ మహారాజు అందరికీ తెలియజేశారు. అయితే తర్వాత కాలక్రమంలో సోయరాబాయిలో స్వార్థం పెరిగింది. ఛత్రపతి పట్టపురాణి తానేనని..., పట్టపు రాణి కుమారుడే రాజు కావడం సంప్రదాయమని..., హిందూ స్వరాజ్యానికి తన కుమారుడు రాజా రాం ఛత్రపతి కావాలని పట్టుపట్టసాగింది. ఆమె మొండితనం కారణంగా చెలరేగుతున్న కుటుంబ కలహాలు..., హిందూ స్వరాజ్యంపై పడకుండ చూశారు శివాజీ. శంభాజీని సోయరాబాయ్ కు దూరంగా ఉంచారు. ఒక దశలో తన సవతితల్లి సోయరాబాయ్ తనపై కుట్రలు పన్నుతోందని కోపోద్రిక్తుడైన శంభాజీ... దక్కనులో మొగల్ సుబేదారు అయిన దిలేర్ ఖాన్ తో చేతులు కలిపారు. అయితే తన తప్పు తెలుసుకుని పశ్చాతాపంతో తిరిగి తన తండ్రి వద్దకు వచ్చారు శంభాజీ.

అయితే ఈ కుటుంబ కలహాలను రూపుమాపేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.., 1680 మార్చి నెల చివరి వారంలో ఛత్రపతి శివాజీ మహారాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా అవిశ్రాంత పర్యటనలు, యుద్ధాల మూలంగా ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. ఎన్ని మందులు వాడిన ప్రయోజనం కల్పించలేదు. 1680 ఏప్రిల్ 3వ తేదీన ఛత్రపతి శివాజీ మహారాజు స్వర్గస్థులయ్యారు. ఛత్రపతి మరణం తర్వాత ఈ విషయాన్ని ఆయన పెద్దకుమారుడైన శంభాజీకి తెలియకుండా సోయరాబాయ్ కుట్రలు చేసింది. అయితే ఈ విషయాన్నితన గుప్తచరుల ద్వారా తెలుసుకున్న శంభాజీ తగు చర్యలు తీసున్నారు. తన పినతల్లి మాటలు విని... తండ్రి మరణవార్తను తనకు తెలియకుండా దాచారనే కోపంతో కొంతమంది సర్థారులపై కఠిన చర్యలు తీసుకున్నాడు. మరి కొందరిని చంపించాడు కూడా. తన అనుచరులైన సర్దారులతో రాయ్ గఢ్ కోటను చేరుకుని...1680 జులై మాసంలో శాస్త్రయుక్తంగా హిందూ స్వరాజ్యానికి రెండవ ఛత్రపతిగా రాజ్యా పాలన చేపట్టాడు శంభాజీ.

మరోవైపు ఛత్రపతి శివాజీ మహారాజు మరణం, కుటుంబంలో చెలరేగిన అంత:కలహాల మూలంగా, మరాఠా సర్థారులు సైతం రెండు వర్గాలుగా చీలిపోయారని, శంభాజీ తీరుతో రాజ్యంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయనే సమాచారం ఆగ్రా కోటలోని ఔరంగజేబుకు చేరింది. గతంలో కూడా అనేక సార్లు ఛత్రపతి మరణించారనే వార్తలు వచ్చాయి. అయితే అవి నిజం కావని ఆ తర్వాత రుఢీ అయ్యాయి. ఇది కూడా అలాంటి వార్తేనా అని ఔరంగజేబు భావించాడు. ఎందుకైనా మంచిదని.. మరోసారి తన గుప్తచరులు ద్వారా రుడీ చేసుకున్నాడు. శివాజీ పేరెత్తగానే గజగజ వణికిపోయే ఔరంగజేబు..., ఛత్రపతి మరణించాడనే వార్త తెలుసుకుని తొలిసారిగా అమితానందపడ్డాడు. ఇక ఛత్రపతి శివాజీ స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని సులభంగా నాశనం చేస్తానని సంబరపడ్డాడు. కశ్మీర్ నుంచి దక్షిణభారతంలోని సముద్ర తీరం వరకు.., అంతా కూడా సంపూర్ణంగా ఇస్లామ్ రాజ్యం స్థాపిస్తానని కలలు కన్నాడు. వెంటనే సైన్యాన్నిసమీకరించడం మొదలు పెట్టాడు. 1682లో ఛత్రపతి శివాజీ లేని దక్కనులో..., ఇక తనకు ఎదరించేవారే లేరనే ధీమాతో మూడు లక్షలకు పైగా భారీ సైన్యం, ఫిరంగులు, ఇంకా మందుగుండు సామాగ్రితో దక్షిణ భారతానికి బయలుదేరి... అహ్మద్ నగర్ లో మకాం వేశాడు ఔరంగజేబు. రాజ్యాధికారం చేపట్టిన తర్వాత శంభాజీ నాయకత్వంలో జరిగిన యుద్ధాలు, శంభాజీ రాజా...ఔరంగజేబును తొమ్మిదేళ్ళపాటు దక్కన్ ప్రాంతంలో ఎలా మూడు చెరువుల నీళ్లు తాగించిన విషయాలను మనం తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హాబ్..మనసా వాచా కర్మణా దేశహితం కోసం.!

#ShambajiMaharaj #ShivajiMaharaj #UnsungHeroes