అణుయుద్ధం రానుందా..? విశ్వరక్షణ భారత్ బాధ్యతేనా..?

Sep 23, Wed 2020 12:43 PM Right Angle

వివేక భ్రష్ఠత్వం విషాదంగా ముగుస్తుంది అంటుంది జనచైనా సామెత. భారత్-చైనా సరిహద్దు వివాదంలో ప్రస్తుతం జరుగుతున్నది అదే. 60-70 దశకాల యుద్ధ సూత్రాలూ, వ్యూహ నమూనాలూ ప్రస్తుతం అమలుకావన్నది చైనాకు ప్రస్తుతం అనుభవ పూర్వకంగా తెలియాల్సి ఉంది. అందుకే యుద్ధాన్ని అనివార్యం చేస్తోంది. ఒక వేళ యుద్ధమే అనివార్యమవుతే జరిగేదేంటి? శక్తి, యుక్తులేంటి? భౌగోళిక అనుకూలతలు ఏ దేశానికి ఎంత వరకు ఉపకరిస్తాయి? అణుయుద్ధం అనివార్యమైతే ఎవరి బలాబలాలేంటి? ఇరు దేశాల వాయుసేన బలాబలాలేంటి? ఇలాంటి కీలక ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ప్రపంచ జనాభా 759 కోట్లయితే అందులో మూడో వంతు మంది అంటే చైనాలో సుమారు 139 కోట్ల మంది, భారత్‌ లో సుమారు 135 కోట్ల మంది నివసిస్తున్నారు. అలాంటి భారత్‌-చైనాలు యుద్ధానికి దిగితే దాని దుష్ప్రభావం ఆ రెండింటిపైనే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దారుణంగా ఉంటుంది. అందువల్ల ఈ యుద్ధ ఫలితం భారత్‌-చైనాల బలాబలాల మీదే కాకుండా వివిధ దేశాల వైఖరులు, ఒత్తిడులు, భారత్‌-చైనాల్లో అంతర్గత పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. భారత్‌, చైనాలు ప్రపంచంలో అతి పెద్ద సైన్యం కలిగిన దేశాలైనప్పటికీ వాటి మధ్య భూతల యుద్ధం భారీ స్థాయిలో జరిగే అవకాశాల్లేవు. ఎందుకంటే రెండు దేశాల సరిహద్దు ప్రాంతం కొండలు, లోయలతో చాలా దుర్గమమైంది. భారీ పరికరాలతో పెద్దఎత్తున సైన్యం సరిహద్దును దాటి వెళ్లడం అసాధ్యం. ఒక దేశం భారీగా సైన్యాన్ని ముందుకు దూకించినా రెండో దేశం కేవలం శతఘ్నులతోనే వారిని చాలావరకూ అడ్డుకోగలదు. ఎందుకంటే ఇక్కడ సైన్యం ప్రయాణించగల మార్గాలు పరిమితం. ఆ మార్గాలేమిటనేది ఇరు దేశాలకూ స్పష్టంగా తెలుసు. అందుకే 1962 యుద్ధంలో చైనా 80 వేల మంది సైన్యంతో దాడి చేయగా, భారత్‌ కేవలం 12 వేల సైన్యంతోనే చైనాను చాలావరకూ అడ్డుకోగలిగింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చైనా కొత్తగా కొన్ని రోడ్లు నిర్మించినప్పటికీ పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పులేదు. భూతల యుద్ధంలో ఎవరిదీ పైచేయి కాకపోయే అవకాశాలే ఎక్కువ. ఇరు దేశాల మధ్య భూతల, వైమానిక యుద్ధాలతో పోలిస్తే సాగర యుద్ధమే నిర్ణయాత్మకమయ్యే అవకాశం ఉంది. భారత్‌ వద్ద యుద్ధ విమాన వాహక నౌక -ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య ఉంది, చైనా వద్ద -లియావోనింగ్‌ ఉంది. అయితే భారత్‌ వద్ద 14 జలాంతర్గాములు మాత్రమే ఉండగా చైనా వద్ద ఏకంగా 68 ఉన్నాయి. సంఖ్యాపరంగా చైనా ముందు ఉన్నప్పటికీ భౌగోళికంగా భారత్‌కు సానుకూలత ఉంది. టోపోగ్రఫికల్ అడ్వంటేజ్ భారత్ కు చాలా ఎక్కువ.

హిందూ మహాసముద్రం మధ్యలో భారత్‌ ఉండడంతో యూరప్, గల్ఫ్‌, ఆఫ్రికా దేశాల నుంచి చైనాకు చమురు, ఇతర సరఫరాలను భారత్‌ అడ్డుకోగల అవకాశం ఉంది. తన వద్ద ఉన్న చమురు నిల్వలు అయిపోయిన పక్షంలో చైనా తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుంది. చమురు లేని చైనాలో చీకటి తప్ప ఏమీ మిగలదు. చైనా సైన్యం కాలుకదపలేదు. యుద్ధ విమానాలు ఇసుమంత కదలవు. ట్యాంకర్లు తుప్పుపట్టిపోతాయి. దీన్నే అవకాశంగా తీసుకుంది భారత్. ఎందుకంటే చైనాకు అవసరమైన పెట్రో ఉత్పత్తుల్లో 10 శాతం మాత్రమే దేశీయంగా లభ్యమవుతాయి. మిగతా 90 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. అమెరికా, జపాన్‌ వంటివి చైనాపై ఆంక్షలు విధిస్తే ఎగుమతులు తగ్గి కోట్లాది చైనా కార్మికుల పరిస్థితి అగమ్యగోచరమే! అందువల్ల యుద్ధాన్ని నివారించాల్సిందిగా అంతర్గతంగా కూడా చైనాపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. భారత్‌, చైనాలు రెండూ అణ్వస్త్రాలు కలిగిన దేశాలే. భారత్‌ వద్ద 100 అణు వార్‌హెడ్లు ఉండగా, చైనా వద్ద 280 వరకూ ఉన్నాయని అంచనా. అయితే రెండు దేశాలూ ‘నో ఫస్ట్‌ యూజ్‌’ విధానాన్ని అనుసరిస్తున్నాయి. అంటే ఏ దేశంపైనా ముందుగా అణ్వస్త్రాన్ని ప్రయోగించబోమనే విధానం. భూమిపై నుంచి, సముద్ర గర్భంలో నుంచి, గాలిలో నుంచి అణ్వస్త్రాలు ప్రయోగించగలిగిన సామర్థ్యం రెండు దేశాలకూ ఉంది.

ఒకవేళ అణు యుద్ధమే జరిగితే రెండు దేశాలకూ అది వినాశకరమే కాగలదు. ప్రస్తుతం ఆర్థికంగా దూసుకుపోతున్న తరుణంలో అణు యుద్ధమే కాదు, సంప్రదాయ యుద్ధానికి దిగడానికి కూడా చైనా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుందని, అందువల్ల యుద్ధం వచ్చే అవకాశాలు చాలా తక్కువేనని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. అయితే సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవడమనే నెపంతో ఆసియాలో అధికారాన్ని ప్రతిష్టించుకోదలచుకుంటే యుద్ధం తథ్యమంటాడు రాబర్ట్ డి. కాప్లాన్. భారత్‌ వద్ద మిగ్‌, జాగ్వార్‌, మిరాజ్‌, తేజస్‌, సుఖోయ్‌ యుద్ధ విమానాలున్నాయి. వీటిలో కొన్ని విమానాలు పాతబడిపోవడంతో భారత వైమానిక దళం విమానాల కొరతను ఎదుర్కొంటోంది. తాజాగా భారత్ ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంతో భారత్ వైమానిక దళం బలోపేతమైంది సంఖ్యాపరంగా చైనా మెరుగైన స్థితిలో ఉన్నా నాణ్యతపరంగా అంత బాగాలేదు. అత్యాధునిక సుఖోయ్‌ యుద్ధ విమానాలు భారత్‌ వద్ద 200కు పైగా ఉండగా చైనా వద్ద అవి 80 లోపే ఉన్నాయి. జె-7, జె-8, హెచ్‌-6 వంటి పాత తరం విమానాలే చైనా వద్ద ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రధానంగా చైనా క్షిపణుల నుంచి భారత్‌కు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉంది. భారత్‌లోని సైనిక లక్ష్యాలపై దాడులు చేసేందుకు చైనా వద్ద డిఎఫ్‌-11, డిఎఫ్‌-15, డిఎఫ్‌-21 వంటి బాలిస్టిక్‌ క్షిపణులు వేల సంఖ్యలో ఉన్నాయి. వీటి నుంచి రక్షించుకునేందుకు భారత్‌ క్షిపణి విధ్వంసక వ్యవస్థను అభివృద్ధి చేసింది.

భారత్‌ వద్ద కూడా బాలిస్టిక్‌ క్షిపణులు ఉన్నాయి. వీటిలో అధిక శాతం అణు యుద్ధం కోసం అట్టిపెట్టాల్సి ఉంటుంది కాబట్టి సంప్రదాయ యుద్ధంలో వాడే అవకాశం లేదు. అయితే ఈ సంప్రదాయ నియమాన్ని మోదీ ప్రభుత్వం తొలగించింది. యుద్ధ పరిస్థితులను బట్టీ ఆయుధ వినియోగం ఉండాలి తప్ప అందుకోసం శిలాసదృశ్యమైన నిబంధనలు ఉండకూడదని ఆదేశించింది. అందువల్ల ప్రత్యేకించి ఉత్తర భారతంలోని అనేక లక్ష్యాలపై చైనా క్షిపణి దాడులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది రక్షణ శాఖ. 3,488 కిలోమీటర్ల మేర విస్తరించిన సరిహద్దుపై వివాదం ఇప్పటికే ఉండగా.. చైనా-భారత్‌-భూటాన్‌ సరిహద్దు సమీపంలోని ట్రై జంక్షన్‌ లోని తాగ్లా రిడ్జిని చైనా ఆక్రమించడం 1962 యుద్ధానికి దారితీసింది. ఆ తర్వాత 2017లో డోక్లాం, ఈ ఏడాది జూన్ నుంచి కొనసాగుతున్న లఢక్ సరిహద్దు వివాదం, 20 మంది భారత్ సైనికుల బలిదానం మరో యుద్ధానికి దారి తీస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. చైనా సేనల్ని తరిమి కొట్టింది 1962లో భారత సైన్యం. యుద్ధానికి సంబంధించి ఆదేశాలు ఆలస్యంగా వెలువడటం, చైనా-భారత్ సంబంధాల్లో మార్మిక వైఖరి భారత్ ఓటమికి కారణమైందంటారు నిపుణులు. 1962 అక్టోబరు 20న లడఖ్‌ వద్ద, అరుణాచల్ మెక్‌ మాహన్‌ రేఖ వెంబడి చైనా దాడి చేసింది. చుషూల్‌లోని రిజాంగ్‌ లా సహా కొన్ని ప్రాంతాలను, ఆక్రమించింది. భారత్‌ ఓటమి ఖరారవ్వగా నవంబర్‌ 21న చైనా కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ యుద్ధం ఫలితంగా ఆక్సాయ్‌ చిన్‌ ప్రాంతం భారత్‌నుంచి పూర్తిగా చైనా ఆధీనంలోకి వెళ్లింది. 1962 యుద్ధంలో సుమారు 12 వేల మంది భారత సైనికులు, 80వేల మంది చైనా సైనికులు పాల్గొన్నారు. 1,383 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా 1,047 మంది గాయపడ్డారు. చైనా సైనికులు 722 మంది మరణించారు. తగిన ఆయుధాలు, మందుగుండు లేకున్నా రక్షణశాఖ ఆదేశించగానే యుద్ధానికి దిగడం వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌ షా ఓ సందర్భంలో విశ్లేషించారు.

సమస్యలతో సతమతం కావాలన్నది పొరుగున ఉన్న శత్రువు లక్యం భారత్ ఎప్పుడూ ముప్పులు, ప్రమాదాల్లో మనుగడ సాగించాలి తప్ప, అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించకూడదు. భారత్ కు ఎటువంటి ప్రాధాన్యం, ప్రాముఖ్యం ఉండకూడదన్నది పాకిస్థాన్ వంటి కొన్ని శత్రుదేశాల ఆలోచన. దేశంలో ఆశావహ పరిస్థితి ఏర్పడినప్పుడల్లా భారతీయులను భయాందోళనల్లో ముంచెత్తే కార్యకలాపాలు సరిహద్దుకు అవతలివైపు నుంచి ఊపందుకుంటాయి. ముఖ్యంగా పాకిస్థాన్ చైనా మద్దతుతో ఇదే వ్యూహాన్ని చాలా కాలంగా అనుసరిస్తోంది. దీనికి సమాధానంగా భారత్ సైన్యం పాక్ లోని ఉగ్రస్థావరాలపై సర్జికల్‌ దాడులు జరిపింది. సర్జికల్‌ దాడులకు ముందు, ఆ తరువాత భారతీయులు స్పందించిన తీరు పాకిస్థాన్ లో భయం పుట్టించింది. చైనా లా కాకుండా పాకిస్థాన్ మొదటి నుంచీ భారత్‌కు ప్రత్యక్ష శత్రువే. వాఘా సరిహద్దుల దగ్గర దాదాపు ప్రతి రోజూ భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొనే ఉంటుంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వాలు పెరుగుతూనే ఉన్నాయి. నిజానికి భారతదేశం సునాయాసంగా పాకిస్థాన్‌ను పరాజయం పాలు చేయగలదని ప్రతి భారతీయుడికీ గట్టి నమ్మకం. అయితే చైనా విషయంలో అటువంటి నమ్మకం చాలా తక్కువ.

పాకిస్థాన్ పొరుగు వైరి అయినా, దాని శక్తి భారత్ కు సమ ఉజ్జి కాదు. పాకిస్థాన్‌ విషయంలో కంటే, చైనా విషయంలోనే భారత్ అప్రమత్తంగా ఉండాలని జనరల్ మానెక్ షా పదే పదే హెచ్చరించారు. అయితే ఆ తర్వాత పాలకులు దీన్ని విస్మరిస్తూ వచ్చారు. ఇటీవలి కాలంలో భారత్-చైనాల సంబంధాలు మారుతున్న తీరును దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, భారత్ కు ప్రధాన శత్రువు చైనాయేనని కచ్చితంగా నిర్దారణ అవుతుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ద్వారా, బంగ్లాదేశ్ ద్వారా భారత్ ను చుట్టు ముట్టడానికి చైనా ప్రయత్నాలు సాగిస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్ పై తరచూ ఆకస్మిక దాడులు కొనసాగిస్తుంటుంది. భారత్ ను అణు సరఫరాదార్ల గ్రూప్‌లో చేరకుండా మోకాలు అడ్డుతుంటుంది. ఉగ్రవాదం మినహా అనేక కొత్త ఎత్తుల ద్వారా భారత్‌ను వేధించడం చైనాకు పరిపాటి అయిపోయింది. చైనా ఎన్ని రకాలుగా వేధిస్తున్నా భారత్ నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చేది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ వైఖరికి మోదీ ప్రభుత్వం స్వస్తి పలికింది. కవ్విస్తే చర్యలు తప్పవన్న సంకేతాల్ని స్పష్టంగా చైనాకు పంపింది. ఇది 1962 నాటి భారతం కాదని గట్టిగా ప్రకటిస్తుండడంతో చైనా తట్టుకోలేక పోతోంది.

ఇక చైనా భారత ఉపఖండంలో మూడు లక్ష్యాల కోసం ప్రయత్నిస్తోంది. లడఖ్‌లో మరిన్ని ప్రాంతాలు దాని అధీనంలోకి రావాలి. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ గుండా వెళ్లి, హిందూమహా సముద్రంలో నౌకాయానం సాగించుకోవడానికి, త్వరగా టిబెట్‌కు చేరడానికి ఓ అవకాశం కోసం అది ఎదురు చూస్తోంది. అందుకనే సియాచిన్‌ నుంచి భారత్‌ తప్పుకోవాలని కోరుకుంటోంది. పాకిస్తాన్ ద్వారా సియాచిన్‌ను రక్షణ దళాల నుంచి విముక్తం చేయాలని అలాగే అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకురావాలనీ ప్రయత్నాలు సాగిస్తోంది. సరిహద్దు సమస్యను తమకు అనుగుణంగా పరిష్కరించుకోవడానికి చైనా చాలా కాలంగా ఒత్తిడి తెస్తోంది. భారత్‌ సరిహద్దులోని నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, మాల్దీవుల్లో భారీయెత్తున నిర్మాణాలు, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఇదే కారణం. చైనా ఎంత వేధించినా భారత్ తన అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తూనే ఉంది. చైనాను భారత్ ఎదుర్కోవాలంటే చైనా స్థాయిలో అభివృద్ధి చెందడమే సరైన మార్గమని 2015లోనే ‘‘ AMBUSH CHINA’’ వ్యూహాన్ని రచించింది భారత్. చైనా ఎటువంటి కవ్వంపు చర్యలకు పాల్పడినా భారత్ తన దృష్టిని అభివృద్ధి నుంచి మళ్లించే పరిస్థితి నేడు లేదు. మాటలు తక్కువ చేతలు ఎక్కువ అన్నట్టుగానే వ్యవహరిస్తోంది భారత్. భారత్‌కు మళ్లీ చైనాతో యుద్ధం వస్తుందా? రావచ్చు. భారత్‌ బలహీన దేశమని చైనా దృఢ నిశ్చయానికి వచ్చినప్పుడే ఆ దేశం భారత్‌పై దాడి చేస్తుంది. అధికారం, శక్తి ఉన్న దేశాన్ని మాత్రమే చైనా గౌరవిస్తుంది. భారత్‌ నిలకడగా తన ఆర్థిక, సైనిక సత్తాను పెంచుకుంటూ పోతేనే చైనా తన హద్దుల్లో తానుంటుంది.

ఈ విషయంలో భారతీయులు చైనాతో పాటు జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, అమెరికా వంటి దేశాలను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. భారత ఉక్కు రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతోందనే వాస్తవాన్ని చైనా గుర్తించింది. తన ఉక్కు ఎగుమతులు తగ్గే ప్రమాదం ఉందని అది తరచూ ఆందోళన చెందుతోంది. భారత్ తన వ్యూహాన్ని మరికాస్త పకడ్బందీగా ముందుకు తీసుకువెడితే, అనేక రంగాల్లో అపార విజయం సాధించగల సత్తా భారత్ కు ఉంది. వివిధ దేశాలు తమమీద ఆధారపడి ఉండేందుకే చైనా అంతర్జాతీయ మార్కెట్లను తన గుప్పిట్లో బంధించే ప్రయత్నం చేస్తోంది. ఒక వేళ భారత్-చైనాల మధ్య యుద్ధమే వస్తే సరిహద్దు వివాదం ముగిసి పోతుంది. చైనా అహంకారానికి తాళం పడుతుంది. ఆసియాలో భారత్ శక్తి రుజువు అవుతుంది. ఆసియా మార్కెట్ లో చైనాకు కట్టడి ఏర్పడుతుంది. సో....భారత్-చైనాల యుద్ధం ఇరు దేశాలకూ నష్టం చేకూర్చినా....ఎక్కువ నష్టం చైనాకే కలుగుతుందనేది అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా.

#SaiKrishna #RightAngle #India #China #NuclearWar