పిశాచం పారిపోయిన వేళ విమోచన దినం కాదా..?

Sep 22, Tue 2020 11:41 PM Right Angle

చరిత్రను అర్థం చేసుకోవడానికి దాన్ని అన్ని కోణాల నుంచీ పరిశీలించాలి. చరిత్రను చరిత్రగా మాత్రమే స్వీకరించాలి. ఎందుకంటే గతించిన కాలాన్ని మనం మార్చలేం కాబట్టి! దాన్ని యథాతథంగా స్వీకరించడం తప్ప మరో మార్గం లేదు. చరిత్రను ఎవరు ఎలా చూస్తారు? ఎలా వ్యాఖ్యానిస్తారన్నది కూడా ప్రధానం.

ఏటా సెప్టెంబర్ 17 రాగానే సహజమైన రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగుతాయి. చారిత్రక అంశాల చుట్టూ జరిగే వాదోపవాదాలకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యమిచ్చినట్టూ కనిపిస్తాయి కానీ, వాస్తవానికి అదేమీ ఉండదు. అందుకు కారణం, గడచిన కాలానికి సంబంధించిన ప్రస్తావన వచ్చినపుడు నేతలు తమ అనుకూలతను బట్టి కళ్లజోళ్లు మారుస్తూ ఉంటారు. చరిత్ర విద్యార్థులు, పరిశోధకులు మాత్రమే నిరంతరం చరిత్ర పై తప్పుడు వ్యాఖ్యానాన్ని పూర్వపక్షం చేస్తూ సరైన అంశాలను ప్రజల ముందు ఉంచాలి.

తెలంగాణ విమోచన దినం సందర్భంగా ‘‘నేషనలిస్ట్ హబ్’’ సెప్టెంబర్ 17ను విమోచనగా ఎందుకు నిర్వచించాలో, ఏ కారణాల వల్ల విలీనం, దురాక్రమణ కాదో చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు మూడు చారిత్రక పుస్తకాల సాయం తీసుకుంటోంది. మొదటి: కృష్ణస్వామి ముదిరాజ్ 1948లో రాసిన ‘‘30 ఇయర్స్ పొలిటికల్ స్ట్రగుల్ ఆఫ్ హైదరాబాద్’’, రెండోది సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సన్నిహితుడిగా మెలిగిన వి.పి.మీనన్ 1956లో రాసిన ‘‘ The story of the integration of the indian states’’, చివరి రోజుల్లో హైదరాబాద్ రాజ్యానికి ప్రధానిగా పనిచేసిన మీర్ లాయక్ ఆలీ 1962లో వెలువరించిన ‘‘హైదరాబాద్ విషాదం-Tragedy of Hyderabad’’ పుస్తకాలతో పాటు సాధికారత కోసం నాటి ఆంధ్రపత్రిక ప్రతులను వాడుకుంటోంది.

ఈ పుస్తకాలను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఈ మూడూ పూర్తిగా భిన్నమైనవి. క్రిష్ణస్వామి ముదిరాజ్ రాసింది 1928లో హిందూ, సిక్కులపై ముస్లీం దాడులను ప్రస్తావిస్తూ...కాంగ్రెస్ అనుకూల దృక్పథంలో ముందుకు సాగుతుంది. రెండోది పటేల్ సన్నిహితుడైన వి.పి.మీనన్ నాటి నిజాం వైఖరి గురించి వివరిస్తే, లాయక్ ఆలీ రాసిన ‘‘ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’’ ఏకపక్షంగా హైదరాబాద్ రాజ్యంపై ఇండియన్ యూనియన్ దాడిగా పేర్కొంటుంది.

ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమ సందర్భాలు చరిత్రను తమ వైయక్తిక అంశను ఆపాదించుకుని పరిశీలించే ప్రయత్నం చేస్తాయి. తెలంగాణ మలిదశ ఉద్యమం అసఫ్ జాహీ పాలనను అట్లా చూసి, లేని ఘనతను నిజాం రాజరికంలో చూసే ప్రయత్నం చేసింది. ఇది మలిదశ ఉద్యమానికి ఉన్న పరిమితి మాత్రమే కాదు, పరిధి కూడా. కాలం దాటి వచ్చాక...నడిచివచ్చిన దారిని మననం చేసుకోవడం భవిష్యత్ అవసరం. చరిత్ర పరిశీలనా క్రమంలో ప్రత్యక్ష్య సాక్షుల కథనానికి మరింత ప్రాధాన్యముంటుంది. సానుకూలంగానో, ప్రతికూలంగానో చరిత్రలో భాగమయ్యే వారి మాటల్ని సావధానంగా వినే ప్రయత్నం చేయాలి.

చారిత్రక పరిణామల పట్ల మన అవగాహనా విస్తృతికి ఇది తోడ్పడుతుంది. ఈ కారణంగానే ‘హైదరాబాద్ రాజ్యం’ భారతదేశంలో విలీనమైందా? విద్రోహానికి గురైందా? విమోచన లభించిందా? అన్న ప్రశ్నలకు మరింత ప్రాధాన్యముంది. టైం మిషన్ ద్వారా గతంలోకి వెళ్లి, తమ ఉనికి లేని చరిత్రలోకి ఇప్పుడు ప్రవేశించేందుకు ప్రతి ఏటా సిద్ధమవుతాయి కాంగ్రెస్, కమ్యూనిస్టు పక్షాలు. 223 ఏళ్ల రాక్షస పాలనపై లేని ప్రేమను కురిపించేందుకు ప్రయత్నిస్తాయి. నిజాం రాక్షస పాలన తాలూకు చరిత్ర సంక్షిప్తంగా చూద్దాం..

అసఫ్‌జాహీల పాలనలో మెజార్టీ ప్రజల చరిత్ర, సాంస్కృతిక విధ్వంసం నిరంతరం సాగించింది. మెజార్టీ ప్రజలు సుఖపడలేదు. కుతుబ్‌షాహీలలో సాంస్కృతిక రంగం కొంత అభివృద్ధి చెందితే, నిజాం షాహీలలో ఆరవ నిజాం మహబూబ్‌ అలీ కాలంలో పాక్షిక మత సామరస్యం నెలకొనేందుకు మహామంత్రి మాదన్న, రాజాకిషన్‌ ప్రసాద్‌లే ప్రధాన కారణం. ఇక అసఫ్‌ జాహీ వంశస్థులలో మీర్‌ ఖమ్రుద్దీన్‌ మొదలుకుని మీర్‌ ఉస్మాన్‌ అలీ వరకు ఇక్కడ మత వివక్ష కొనసాగింది. 1911లో హైద్రాబాద్‌ సంస్థానం గద్దెనెక్కిన ఏడవ నిజాం విజయవంతంగా ‘ఉస్మానిస్థాన్‌’ స్థాపించాలని కలలుగన్నాడు.

ఒకటవ అహ్మద్‌ షా అనే బహమనీ సుల్తాన్‌ కాలంలో ‘ఆఫాదీ’లనే విదేశీయులను ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించినట్టే.. ఏడవ నిజాం రజాకార్లను, పఠాన్లను ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి దిగుమతి చేసుకొన్నాడు. ఇక్కడి మెజార్టీ ప్రజలలోని మత, సాంస్కృతిక అంశాలను నిర్దాక్షిణ్యంగా అణచివేశాడు. తన మతస్థుల జనాభా పెంచుకుని ఇక్కడ అధికారం సుస్థిరం చేసుకోవాలని 1928లలో ‘మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ బైనుల్‌ ముస్లిమన్‌’ అనే సంస్థను స్థాపించాడు. 1929లో ‘మజ్లీస్‌ ఇత్తెహాదుల్‌ ముసల్మీన్‌’గా మార్చారు. గ్రామ సీమల్లోని నిరుపేదలను బలవంతంగా మతమార్పిడి చేశారు. ఈ దుర్మార్గాలకు బహదూర్ యార్ జంగ్ నాయకత్వం వహించాడు. (matha marpidi)రజాకార్‌ అనే ‘శాంతి స్వచ్ఛంద సేవకుల’ ముసుగు తొడిగి మత సంస్థగా తయారు చేశాడు. ఆ సంస్థకు బహద్దూర్‌ యార్‌ జంగ్‌ మొదటి అధ్యక్షుడు కాగా, తదనంతర కాలంలో అది ఖాశిం రజ్వీ అనే మతోన్మాది చేతిలోకి వెళ్లింది. ఇతని ప్రయత్నమంతా నిజాం రాజ్యాన్ని స్థాపించడమే. అందుకే రజాకార్లు, దీన్‌దార్‌ అంజుమన్‌ వంటి సంస్థలు ఉస్మాన్‌ షాహీని కీర్తిస్తూ ప్రతి ముస్లిం రాజ్యపాలకుడే అని చెప్పే ‘అనల్‌ మాలిక్‌’ సిద్ధాంతాన్ని నూరిపోశారు. ఆఖరుకు నిజాం కీర్తిని పొగుడుతూ ప్రార్థనలు చేయించారు.( anal malik) 42 మంది స్త్రీలను ఉంపుడుగత్తెలుగా, ఏడుగురిని భార్యలుగా చేసుకొన్న సుఖ పురుషుడు నిజాం నవాబు. 80 శాతం మెజారిటీ ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వకుండా ఉర్దూను అధికార భాషగా చేశాడు. 1951 జనాభా లెక్కల ప్రకారం 50% తెలుగు, 25% మరాఠి, 11% కన్నడ, 12% ఉర్దూ మాతృభాషలుగా ఉన్న ప్రజలపై ఉర్దూ బలవంతంగా రుద్దాడు.

భారత స్వాతంత్ర్య ప్రకటన తర్వాత ఏం జరిగింది?
1947 ఆగస్టు 15 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు నడిచిన హైదరాబాద్ రాజ్య చరిత్ర ఉద్విగ్నభరితమైంది. 1947 ఆగస్టు 15 ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఓ ప్రకటన చేస్తూ...ఇండియా, పాకిస్థాన్ లాగే హైదరాబాద్ రాజ్యం కూడా స్వతంత్ర దేశంగా కొనసాగుతుందని, ఇండియాలో గానీ, అటు పాకిస్థాన్ లో గానీ, విలీనం కాదని ప్రకటించాడు. నిజానికి ఇది పైపై మాటల ప్రకటన మాత్రమే అన్నది తర్వాత రోజుల్లో బట్టబయలైంది. పాకిస్థాన్ తో సంబంధాలు, ఆయుధాల రవాణా తదితర అనేక అంశాలు ఆ తర్వాత తెలుగు పత్రికల్లో రికార్డు అయ్యాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ రాజ్యం అస్తమించే రోజుల్లో చివరి తొమ్మిది నెలలు ప్రధానిగా పనిచేసిన మీర్ లాయక్ చాలా మంత్రాంగం నడిపాడు. పాకిస్థాన్ తో ఉండటం కోసం శతవిధీ ప్రయత్నాలు చేశారు. పైకి స్వతంత్ర రాజ్యాంగా ఉండాలని ఆకాంక్షించినా చర్యలు మాత్రం వేరుగానే ఉన్నాయి. స్వతంత్ర భారత ప్రభుత్వం 566 స్వదేశీ సంస్థానాల్ని విలీనం చేసుకొన్న తర్వాత హైదరాబాద్ స్టేట్ ని స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నిస్తే, సైంధవునిలా అడ్డుకోవడానికి కృషి చేసిన అభినయ చతురుడు లాయక్ ఆలీ. నిజాం ప్రభుత్వాన్ని స్వతంత్ర భారతదేశంలో ప్రత్యేక స్వతంత్ర దేశంగా నిలపాలని శతధా ప్రయత్నించి విఫలుడైన వ్యక్తి. మునుపటి నిజాం ప్రభుత్వ ప్రధానులైన సర్‌ అక్బర్‌ హైదరీ, మిర్జా ఇస్మాయిల్‌ ఛత్తారీలను అసమర్థులుగా చిత్రించి, తన్ను తాను పరిపాలనా దక్షునిగా చెప్పుకొన్న లౌక్యుడు. మీర్‌ లాయక్‌ అలీ తన అనుభవాలకు అబద్ధాలు జోడించి ‘ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’ పేరుతో ఇంగ్లిష్‌ పుస్తక రూపంలో తన అక్కసు వెళ్లగక్కాడు. హైదరాబాద్ విమోచన తర్వాత రహస్యంగా పాకిస్థాన్ పారిపోయిన లాయక్ ఆలీ అక్కడే ఈ పుస్తకాన్ని ప్రచురించాడు.

హిందువులంతా మున్షీ, భారత్‌ భావించినట్లు భారత్‌ వైపు నిలబడక మాతృభూమి వైపు నిలబడ్డారంటూ అబద్ధాన్నీ, అత్యంత క్రూరుడూ, హంతకుడూ అయిన ఖాసిం రజ్వీని ఉదాత్త నాయకునిలా చిత్రించాడు. ‘‘మతసామరస్య నిర్వహణ పట్ల ఆయన చాలా ఆసక్తిగా ఉండేవాడు. రజాకార్లలో హిందువుల సంఖ్యను పెంచడం ఆయన జీవితాశయాలలో ఒకటిగా ఉండేది. రజాకార్ల ఛత్రఛాయలో ఉన్నవారు అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోవాలని, అందరి అభిప్రాయాలను గౌరవించే సహన శీలతను పెంచుకోవాలని ఆయన బోధిస్తూ ఉండేవాడ’’అంటూ తప్పుడు చరిత్రను రాశాడు లాయక్ ఆలీ. మీర్ లాయక్ ఆలీ కేవలం హైదరాబాద్ రాజ్యానికి ప్రధాన మంత్రి, కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, పాకిస్థాన్ ఏజెంట్ కూడా. ఈ కారణంగానే హైదరాబాద్ రాజ్య విమోచన జరిగిందే తడవుగా పాక్ సీక్రెట్ ఇంటెలీజెన్స్ సర్వీసెస్ అధికారులు ‘‘గులామ్ అహమ్మద్’’ పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి పాకిస్థాన్ కు రప్పించారు. అయితే ప్రమాదం కారణంగా విమాన ప్రయాణం రద్దయిపోయి, ఎస్.ఎస్.సబర్మతీ ఓడలో కరాచీ పరారయ్యాడు. ఆ తర్వాత పాక్ ప్రభుత్వంలో పనిచేశాడు. ఈ కుట్రలన్నీ పటేల్ పసిగడతాడన్న భయంతోనే పాకిస్థాన్ పారిపోయాడు లాయక్ ఆలీ. స్వతంత్ర రాజ్యంగా ఉండాలనే సాకుతో ఇండియన్ యూనియన్ అస్థిరపరచాలనేది అసలు కుట్ర. (layak ali escape)1948లో హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనానికి కొద్ది నెలల ముందు నిజాం ఆర్థిక మంత్రి బ్రిటన్‌లోని పాకిస్థాన్‌ హైకమిషనర్‌ రహ్మతుల్లాకు 10 లక్షల పౌండ్లను పంపి జాగ్రత్తగా దాచాలని చెప్పారు. ఆయుధాల కోసం నిజాం ఈ సొమ్ము పంపిన విషయాన్ని పటేల్ గుర్తించారు. 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్, వి.పి.మీనన్ కలిసిన లాయక్ ఆలీ యధాతథ స్థితి ఒప్పందం కోసం పట్టుబట్టాడు. పటేల్ నిర్దాక్షిణ్యంగా అసాధ్యమని చెపుతూనే....పాకిస్థాన్ కు రహస్యంగా డబ్బు ఎందుకు పంపాల్సి వచ్చిందో చెప్పమని గద్దించడంతో నీళ్లు నమిలాడు లాయక్ ఆలీ. ఈ డబ్బు ఆయుధాల కోసమే అంటూ ఆంధ్రపత్రికలో ఆగస్టు 4న ఓ వార్త హెడ్ లైన్ లో అచ్చయింది. (weaons)ఈ పది లక్షల పౌండ్లకు సంబంధించి కేసు బ్రిటన్ హైకోర్టులో ఏడు దశాబ్దాలకు పైగా నడచింది. 2019 అక్టోబర్ నాటికి 10లక్షల పౌండ్లు కాస్తా 307 కోట్లైంది. బ్రిటన్ కోర్టు తీర్పుతో ఈ సొమ్ము నిజాం వారసుల వశమైంది. పాక్ తన సొమ్మంటూ సుదీర్ఘకాలంపాటు న్యాయపోరాటం చేసింది.

విలీన చర్చలకు నిజాం రాజు స్వయంగా ఢిల్లీ రావాల్సిందే అనీ, మధ్య వర్తులను పంపి లాభం లేదంటూ పటేల్ ఘాటుగా స్పందించారు. ఈ వార్త సైతం ఆగస్టు 2వ తేదీన ఆంధ్రపత్రికలో వెలువడింది. ఈ పరిణామాలు జరుగుతున్నా...లాయక్ ఆజాద్ హైదరాబాద్ రాజ్యం కోసం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆగస్టు 11న మరోసారి పటేల్ బహిరంగ ప్రకటన చేస్తూ “ఆజాద్ హైదరాబాద్” అసాధ్యమని తేల్చి చెప్పారు. (14) భారత ప్రభుత్వ ప్రకటనలను నిజాం రాజు ఖాతరు చేయలేదు. పాకిస్థాన్ ఏజెంట్, ప్రధాని మీర్ లాయక్ ఆలీ ఏదో ఒక వ్యూహాన్ని రచిస్తాడని నిజాం నవాబుకు ఆశ. ఆగస్టు 26న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఫిర్యాదు చేశాడు నిజాం రాజు. నిజాం మచ్చలేని చంద్రుడేమీ కాదు. కాని ఆయన పాలన మొత్తాన్నీ రాక్షస పాలనగా చిత్రీకరించే ప్రయత్నం మాత్రం దుర్మార్గమే. చివరిరోజుల్లో జరిగిన అరాచకాలకు నిజాం ఎంతబాధ్యుడో, అంతకంటే అనేకరెట్లు దేశ్‌ముఖ్‌లు, దొరలు, పటేళ్ళు కూడా బాధ్యులే. నిజాం నవాబులెప్పుడూ స్వతంత్రపాలకులుగా ఉండలేదు, అలా అని బయటినుండి వచ్చిన వలస పాలకులు కాదు. అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం అలవాటుగా మారింది. నిజాంనవాబును పైకెత్తడానికి దేశ్ ముఖ్ లు, దొరలను అడ్డం పెట్టుకోవడమే అవకాశవాదం. ‘‘దేశంలోని అన్ని సంస్థానాలు యూనియన్‌లో విలీనమైనట్లుగానేహైద్రాబాద్ సంస్థానం కూడా విలీనం కావలసి ఉండింది. కాని 1947 నుండి 1948 సెప్టెంబర్ వరకు హైదరాబాదులో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా అది సాధ్యం కాలేదు’’ అని సూడో వామపక్షవాదులు వాదిస్తుంటారు. పదినెలలు ఎందుకు సంక్షోభం కొనసాగిందో మాత్రం చెప్పరు.

పాత్రికేయుడిగా, పరిశోధకుడిగా, హైదరాబాద్ మేయర్ గా పనిచేసిన కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ Thirty years political struggle of hyderabad పేరుతో 1948లో ఉర్దూలో పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం ఆ తర్వాత ఇంగ్లీషులోకి అనువాదమైంది. ఇందులో 1928లో నిజాం రాజ్యంలో మెజారిటీ హిందువులపై జరిగిన దాడుల గురించి ప్రస్తావించారు. 1928, డిసెంబర్ 28న నాందేడ్ లోని వజీరాబాద్ తాలూకాలో హిందువులపై ముస్లీం జరిపిన దాడి గురించి వివరంగా రాశారు. ఈ దాడిలో ఎక్కువ సంఖ్యలో హిందువులు గాయపడ్డారని వివరించారు. ఈ వరుస దాడుల పరంపర సిక్కులపై కూడా సాగింది. నాందేడ్ లోని గురుద్వారాపై జరిగిన దాడిలో భారీ సంఖ్యలో సిక్కులు గాయపడ్డారు. ముస్లీంలకు పోలీసులు, ప్రభుత్వం మద్దతు ఉండటం వల్లనే చెలరేగిపోయారని ప్రస్తావించారు. (2) గుల్బార్గాలో మొహర్రం రోజు హిందువులపై జరిగిన దాడిలో ఓ పోలీసు అధికారి చనిపోయిన ఉదంతాన్ని ప్రస్తావించారు. క్రమంగా ఈ దాడులు బీదర్ కు పాకాయి. బీదర్ లోని దుకాణాలను ముస్లీంలు లూటీ చేశారు. వ్యవసాయమార్కెట్ పై పెద్ద ఎత్తున దాడి చేశారు. ప్రభుత్వం మద్దతు కారణంగానే ముస్లీంలు రెచ్చిపోయారని క్రిష్ణస్వామి ముదిరాజ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. హిందువులపై నిరంతర దాడుల కారణంగానే 1925లోనే హిందూ ధర్మపరిషత్ ఏర్పడింది. రాజా ప్రతాప్ గిరీజీ, పండిత్ వామన్ నాయక్ ల పూనికతో ఈ సంస్థ పురుడు పోసుకుంది.

ఆపరేషన్ పోలో ఎలా జరిగింది?
హైదరాబాద్ సంస్థానం విమోచన కోసం భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13 తెల్లవారుజామున ఆపరేషన్ పోలో పేరిట సైనిక చర్యకు దిగింది. అప్పటి హోంమంత్రి సర్ధార్ వల్లబ్‌భాయి పటేల్ ఆదేశాలతో భారత సైన్యం నాలుగు వైపుల నుంచి హైదరాబాద్ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. నగరానికి 300 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్యం నల్‌దుర్గ్ కోటను స్వాధీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపునకు వచ్చింది. మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ ముంబై నుంచి ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎ.ఎ.రుద్ర మద్రాస్ వైపు నుంచి బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్‌ను ముట్టడించింది. అయినా చివరి క్షణం వరకు నిజాం ప్రభుత్వం పోరాటాన్ని కొనసాగించింది. సెప్టెంబర్ 14న దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలను సైన్యం తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ దాడిని ఎదిరించలేక నిజాం సైనికులు పరుగులు తీశారు. కనిపించిన రోడ్లను వంతెనలను ధ్వంసం చేశారు. లాతూర్, జహీరాబాద్ ప్రాంతాల్లో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. ఆకాశంలో తిరుగుతున్న భారత యుద్ధ విమానాలకు తమ ఉనికి తెలిస్తే బాంబులు వేస్తారనే భయంతో రజాకార్లు ఇళ్లల్లో లైట్లు ఆర్పేయాలని హెచ్చరించారు. సెప్టెంబర్ 16న రాంసింగ్ నేతృత్వంలోని సైనికులు జహీరాబాద్‌ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు యూనియన్ సైనికుల వశమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్‌చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో మందుపాతర్లు పేల్చి సైన్యాన్ని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. కానీ సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ చేతులెత్తేశారు. గత్యంతరం లేక ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు.

సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్‌లోకి ప్రవేశించడంతో నగర వాసుల్లో ఉత్సాహం ఉరకలేసింది. అడుగడుగునా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్‌కు భారత సైన్యం కవాతు చేసింది. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటల సమయంలో నిజాం హైదరాబాద్ రేడియోలో ప్రసంగించాడు. నా ప్రభుత్వం రాజీనామా ఇచ్చింది. ఈ పని ఇదివరకే చేయాల్సింది. ఆలస్యమైనందుకు విచారిస్తున్నా. యుద్ధం నుంచి నా సైన్యాన్ని విరమించుకుంటున్నా. ఐక్యరాజ్యసమితిలో పెట్టిన కేసు కూడా ఉపసంహరించుకుంటున్నా అని ప్రకటించాడు. ఆ మరుసటి రోజు ఆయన గవర్నర్ జనరల్ రాజగోపాలాచారిని క లిశాడు. కాలాన్ని దారి మళ్లించి కొత్త యుగాలను ఆవిష్కరించిన వాళ్లుంటారు. అద్భుత వ్యూహరచనా చాతుర్యంతో చారిత్రక మలుపుకు కారణమవుతారు. ఏ కోవలోకి, ఏ ముద్రలోకీ ఒదగకుండా సమాంతరంగా నిలిచి, ఆధునిక భారతదేశ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్. పటేల్ లేకుంటే నాటి హైదరాబాద్ రాజ్యంలోని ప్రజలు, మరీ ముఖ్యంగా హిందువుల పరిస్థితి ఊహించుకుంటేనే భయం వేస్తుంది. విలీనం, విద్రోహం అంటున్నవారంతా చరిత్రకు వక్రభాష్యం చెపుతున్నవారే అందుకే ఈ విమోచన దినంరోజు పటేల్ ను స్మరించుకోవడం, ఆపరేషన్ పోలోలో ప్రాణాలకు తెగించి పోరాడిన భారత సైన్యానికి వినమ్రపూర్వక అభినందన తెలపడం తెలంగాణవాసుల బాధ్యత.

#TelangaLiberationDay #OperationPolo #IndianArmy #SardarPatel #NizamOfHyderabad