స్వదేశంపైనే నిప్పులు చెరిగిన నవాజ్

Sep 21, Mon 2020 06:53 PM Politics

-- ప్రధాని ఇమ్రాన్, పాక్ ఆర్మీపై విమర్శలు
-- పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకమన్న మాజీ పీఎం
-- న్యాయస్థానాలపైనా విరుచుకుపడిన నవాజ్ షరీఫ్

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రభుత్వంపైనా, పాక్ ఆర్మీపైనా నిప్పులు చెరిగారు. ఆదాయినికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లి అక్కడే వుండిపోయారు. తాజాగా ఆదివారం ఆయన.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాకిస్తాన్ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని ఇమ్రాన్, పాకిస్తాన్ ఆర్మీపైనా విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను తొలగించడం, అసమర్థమైన పాలకులను నియమించడం వంటి చర్యలతో పాకిస్తాన్ ఆర్మీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని మండిపడ్డారు.

పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం ఖూనీ..
పాకిస్తాన్ ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థను కోల్పోయిందని అన్నారు నవాజ్ షరీఫ్. ఎవరు గెలవాలి..? ఎవరి ఓడాలి..? అన్నది కూడా ఆర్మీనే డిసైడ్ చేస్తోందన్నారు. దీంతో ప్రజాతీర్పు అపహాస్యమవుతోందని.. ప్రస్తుతం పాకిస్తాన్ మోసపూరిత ప్రయోగాలకు ఓ ప్రయోగశాలగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ, అది రానురాను అంతర్గతంగా బలహీనపడి.. తరువాత తిరస్కరణకు గురవుతుందని అన్నారు.

న్యాయస్థానాలపైనా...
అటు పాకిస్తాన్ లో న్యాయవ్యవస్థపైనా సంచలన ఆరోపణలు చేశారు నవాజ్ షరీఫ్. న్యాయస్థానాలు ప్రతీసారి యుద్ధ చట్టాలను సమర్థిస్తున్నాయని.. సైనిక నియంతలు.. అధికారం స్వాధీనం చేసుకోవవడాన్ని చట్టబద్ధం చేశాయని విమర్శించారు. కోర్టులు.. వారికి చట్టాన్ని గందరగోళంగా మార్చే అవకాశాన్ని అందించాయని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ లో ఓ సైనిక నియంత భారీ నేరానికి పాల్పడినప్పటికీ.. అతన్ని విడిచిపెట్టడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదని.. కానీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే నాయకులు మాత్రం జైళ్లలో మగ్గుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ లో ఇలాంటి దారుణాలు సహిస్తూనే వుండాలని అన్నారు. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు కనీసం ఐదేళ్లు కూడా మనుగడ సాగించలేవని.. కానీ, సైనిక నియంతలు ఏళ్ల తరబడి పాలన సాగించగలరని అన్నారు నవాజ్ షరీఫ్.


2018 ఎన్నికల్లో రిగ్గింగ్..
అంతేకాదు, 2018లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు నవాజ్ షరీఫ్. ఎన్నికల సమయంలో రిజల్ట్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థను గంటపాటు ఎందుకు క్లోజ్ చేశారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. అలాగే ఓట్ల లెక్కింపు సమయంలో పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటికి పంపించారని.. దీనిపై ఎన్నికల కమిషన్ కార్యదర్శితో పాటు.. బాధ్యులైన ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మా పోరాటం ఇమ్రాన్ ఖాన్ పై కాదు : నవాజ్ షరీఫ్
తమ పోరాటం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకం కాదని.. అతన్ని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన వ్యవస్థపైనే అన్నారు నవాజ్ షరీఫ్. ఎన్నికలకు ముందు కూడా ఈ విషయాన్ని చెప్పానని.. ఇప్పుడు మరోసారి చెబుతున్నానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడి అసమర్థుడైన ఓ వ్యక్తికి అధికారాన్ని కట్టబెట్టడం ద్వారా దేశాన్ని నాశనం చేశారని మండిపడ్డారు.

ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులనే కాకుండా.. ఇప్పుడు న్యాయవ్యవస్థను కూడా లక్ష్యంగా చేసుకుందని నవాజ్ షరీఫ్ దుయ్యబట్టారు. ఈ పరిస్థితి మారకపోతే, దేశానికి కోలుకోలేని నష్టం తప్పదని హెచ్చరించారు. రాజ్యాంగంలో చెప్పినట్టుగా ప్రభుత్వ వ్యవహారాల్లో సైనిక జోక్యం ఉండకూడదని అన్నారు.

ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నవాజ్
ప్రధాని హోదాలో వున్న వ్యక్తిని ఉన్నఫళంగా అరెస్ట్ చేయడం చాలా తప్పన్నారు నవాజ్ షరీఫ్. ఈ సంఘటన గుర్తొచ్చిన ప్రతిసారీ బాధ కలుగుతుందని చెప్పారు. ప్రపంచం దృష్టిలో పాకిస్తాన్ చులకనైపోయిందని.. ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని అన్నారు. రాజకీయాల్లో సైనిక జోక్యాన్ని అరికట్టాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు నవాజ్ షరీఫ్.

ఇదిలావుంటే, ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న పాక్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అరెస్టుకు పాక్ ప్రభుత్వం ఇటీవలే అరెస్టు వారంట్ జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం.. ఆయనకు 2018 డిసెంబరులో ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే, అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయనను చికిత్స కోసం లండన్ వెళ్లేందుకు గతేడాది నవంబరులో లాహోర్ హైకోర్టు అనుమతించింది. కోర్టు అనుమతితో లండన్ వెళ్లిన నవాజ్ షరీఫ్ అక్కడే ఉండిపోయారు. ఇచ్చిన గడువు పూర్తయినా తిరిగి రాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

#Pakistan #NawazSharif #ImaranKhan #PakArmy #London #VideoConference