కాంగ్రెస్ మ్యానిఫెస్టోను మరిచిపోయిన రాహుల్

Sep 18, Fri 2020 06:27 PM Politics

-- మరోసారి మాజీ కాంగ్రెస్ అధినేత సెల్ఫ్ గోల్

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తన అవగాహనారాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. వ్యవసాయరంగంలో తాజాగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సంస్కరణలను వ్యతిరేకించారు. అయితే, ఇవే సంస్కరణలపై 2019 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయాన్ని మరిచిపోయి.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

దేశంలో వ్యవసాయ రంగ సంస్కరణలకు సంబంధించిన మోదీ ప్రభుత్వం గురువారం పార్లమెంటులో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే, ఈ మూడు బిల్లులపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలకు దూరంగా.. విహారయాత్రలో వున్న రాహుల్ గాంధీ.. ట్విటర్ వేదికగా మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతులు, వ్యవసాయ కూలీలను దోచుకోవడానికే కేంద్రం ఈ బిల్లులను తీసుకొచ్చిందని మండిపడ్డారు. దేశంలో వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలో భాగంగా తెచ్చిన ఈ మూడు బిల్లులు.. జమిందారీ వ్యవస్థకు మరో రూపమని ఎద్దేవాచేశారు. అంతేకాదు, ఈ సంస్కరణల వల్ల మోదీ వర్గీయులు తప్ప మిగతావారికి ఒరిగేదీమీ ఉండదని అన్నారు. కొద్ది రోజుల క్రితం కూడా రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోపణలే చేశారు.

ప్రస్తుత పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో వ్యవసాయ రంగ సంస్కరణలకు సంబంధించి మోదీ ప్రభుత్వం మూడు బిల్లులు ప్రవేశపెట్టింది. The Farmers Produce Trade and Commerce Bill,.. Farmers Agreement of Price Assurance and Farm Services Bill,.. Essential Commodities Amendment Bill.. ఈ బిల్లులు ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందాయి. ఈ మూడు సంస్కరణలు వ్యవసాయరంగంలో అతిపెద్ద సంస్కరణలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటి ద్వారా దేశంలో రైతులు, రైతు కూలీలు లబ్దిం పొందుతారని చెబుతున్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ఈ సంస్కరణలు..!
ఇదిలావుంటే, కాంగ్రెస్ పార్టీ పెద్దలు తమ పార్టీ మేనిఫెస్టోలో ప్రజలపై వరాలు కురిపించడం.. ఆ తరువాత మరిచిపోవడం సాధారణ విషయమే. అయితే, ఏకంగా పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత అయిన రాహుల్ గాంధీ కూడా ఆ హామీలను మరిచిపోయారు పాపం. నిజానికి, 2019 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సరిగ్గా ఇవే హామీలిచ్చారు. తీరా అవే సంస్కరణలను మోదీ ప్రభుత్వం తీసుకొస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విమర్శలు గుప్పస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కపట నాటకం మరోసారి బయటపడింది.

2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. దీనిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీల చట్టాన్ని రద్దు చేసి,.. వ్యవసాయ ఉత్పత్తులపై వున్న వర్తకం, ఎగుమతులు, అంతర్-రాష్ట్ర వాణిజ్య పరిమితులను ఎత్తివేస్తామని ప్రకటించింది.

మోదీ సర్కారు తెచ్చిన మూడు బిల్లుల్లో.. The Farmers Produce Trade and Commerce Bill, Farmers Agreement of Price Assurance and Farm Services Bill బిల్లులతో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మరింత సులభతరం అవుతుంది. ఈ సంస్కరణలతో రాష్ట్రాల మార్కెట్ చట్టాల పరిమితులను అధిగమించి అంతర్రాష్ట్ర వాణిజ్యానికి కూడా అవకాశం దక్కుతుంది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం ఇవే హామీలు ఇచ్చింది. ఇక, 1955 ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ను భర్తీ చేసేలా.. మోదీ ప్రభుత్వం సవరణ బిల్లును తీసుకొచ్చింది. ఈ కొత్త బిల్లు ద్వారా కొన్ని వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది.

ఇదిలావుంటే, కాంగ్రెస్ పార్టీ కూడా, 1955 ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ను మార్చి.. అత్యవసర పరిస్థితుల్లో అమలు చేసేలా చట్టాన్ని తీసుకువస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. మోదీ ప్రభుత్వం సరిగ్గా అలాంటి సంస్కరణలే తీసుకొస్తే.. ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించడం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు కూడా వ్యతిరేకంగా నిరసనలు తెలపడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అటు రాహుల్ గాంధీ తీరుపై రైతులు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి.

#AgriBills #Parliament #LokSabha #Modi #RahulGandhi #SelfGoal