నేపాల్‎తో కలిసి భారత్‎పై చైనా మరో కుట్ర

Sep 17, Thu 2020 09:59 PM In Focus

-- నేపాల్ పీఎం కె.పి.శర్మ ఓలీని అడ్డుపెట్టుకుని గ్రేటర్ నేపాల్ ప్రచారం
-- ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, సిక్కిం ప్రాంతాలు గ్రేటర్ నేపాల్‎లో భాగమట..!
-- నేపాల్ ప్రధాని చైనా చేతుల్లో కీలుబొమ్మగా మారాడా..?
-- ఇంగితం కోల్పోయిన నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలీ

మంచి పాలకుడిగా పేరు తెచ్చుకోవాలంటే అధికారం, డబ్బుంటే సరిపోదు. కాసింత కామన్ సెన్స్ కూడా ఉండాలి. అది లేదంటే జనం చేత పిచ్చి తుగ్లక్ గా పిలిపించుకోవడం గ్యారెంటీ. ఇప్పుడు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీని నేపాల్ ప్రజలే కాదు..., భారతీయులు సైతం పిచ్చి తుగ్లక్ తో జమకడుతున్నారు. ముఖ్యంగా ఒక కమ్యూనిస్టు నాయకుడు పాలకుడైతే..., మరి ఇంతలా దిగజారి పోతాడా? తన దేశ సార్వభౌమత్వాన్ని...మరో కమ్యూనిస్టు నిరంకుశ దేశమైనా.., చైనాకు తాకట్టు పెడతాడా? నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ.. నిజంగానే తన ఇంగీతాన్ని కోల్పోయారా? చైనాకు దాసోహమయ్యారా? చైనాను చూసుకుని..., తరతరాలుగా భారత్ నేపాల్ కు మధ్య ఉన్న ప్రాచీన సాంస్కృతిక సంబంధాలను తుంగలోకి తొక్కేస్తున్నాడా? భారత్ కు వ్యతిరేకంగా.., చైనా ఆడిస్తున్న సైకలాజికల్ వార్ లో.., నేపాల్ కూడా భాగంగా మారిపోయిందా.? అసలు ఈ గ్రేటర్ నేపాల్ క్యాంపెయిన్ కుట్రల వెనుక ఎవరున్నారు? ఈ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నేపాల్....హిమాలయ పర్వత సానువుల్లోని చిన్న దేశం. ఆ దేశ జనాభా అంతా హిందువులే. అంతేకాదు కమ్యూనిస్టులు ఏలుబడిలోకి రానంతకాలం కూడా నేపాల్ హిందూ దేశమే.! అయితే తర్వాత కాలంలో అది సెక్యులర్ దేశంగా మారింది. నేపాల్ లోని కమ్యూనిస్టు పార్టీల అండతో..., పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ, చైనా ఇంటెలిజిన్స్ ఏజెన్సీ...మిలిటరీ ఆఫ్ స్టేట్ సెక్యురిటీ-ఎంఎస్ఎస్ లు.., నేపాల్ లో తమ ఉనికి పెంచుకున్నాయి. ముఖ్యంగా నేపాల్ లో... భారత ప్రాబల్యాన్ని తగ్గించేందుకు... ఈ రెండు ఏజెన్సీలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని ఆన్ లైన్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. నేపాల్ లో పాకిస్తాన్, చైనా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు బలపడేందుకు...ఆ ప్రధాని కేపీ శర్మ ఓలీ అండగా నిలిచారనే ప్రచారం కూడా ఉంది. నేపాల్ ప్రధాని... ఇలా భారత్ కు వ్యతిరేకంగా మరాడానికి పెద్దగా కారణాలు ఏమి లేవని..., చైనా హానీ ట్రాప్ వల విసిరి కేపీ శర్మ ఓలీని లొంగదీసుకుందనే వార్తలు సైతం ఆ మధ్య నెట్టింట్లో షికారు చేశాయి.

2015 వరకు కూడా భారత్ కు మిత్రదేశంగా మెలిగిన నేపాల్ లో..., ఓపీ శర్మ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏ నేపాల్ ప్రధాని అయినా పీఎం కాగానే మొదట భారత్ ను సందర్శించడం సంప్రదాయం. అంతేకాదు నేపాల్ ఆర్మీ జనరల్ కూడా భారత సైన్యాలకు గౌరవ జనరల్ గా ఉంటారు. అలాగే భారత ఆర్మీ జనరల్ సైతం నేపాల్ ఆర్మీకి గౌరవ జనరల్ గా ప్రొటోకాల్ హోదా ఉంది. ఇంతటి దగ్గర సంబంధాలున్న నేపాల్ ను..., భారత్ నుంచి దూరం చేసేందుకు జిత్తులమారి గుంట నక్క చైనా.., విఫల దేశం పాకిస్తాన్ కలిసి కట్టుగా వ్యూహాలు రచించాయని కొంతమంది విశ్లేషకులు చెప్పేమాట.

మొదటిసారిగా... బీహార్ లో నీటి పారుదల ప్రాజెక్టులకు ఓలీ ప్రభుత్వం అడ్డు చెప్పింది. తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాలాపానీ, లిపులేఖ్ , లింధియాథుర ప్రాంతాలు తమవేనని వితాండవాదం మొదలు పెట్టింది. అంతేకాదు వీటిని తమ దేశంలోని భూభాగాలు చూపెడుతూ కొత్త మ్యాపులను కూడా రూపొందించింది. అయితే ఓపీ ప్రభుత్వ చర్యలను నేపాల్ లోని విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. భారత్ తో నేపాల్ కు ఉన్న చిరకాల స్నేహాన్ని ఓలీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డాయి. విపక్ష పార్టీలే కాకుండా సొంత పార్టీ నేతలైన ప్రచండ కూడా తిరగబడటంతో ఒక దశలో కేపీ శర్మ ఓలీ రాజీనామా డ్రామా కూడా ఆడారు. ఆ తర్వాత ఛాతినొప్పి పేరుతో ఆసుపత్రిలోనూ చేరారు. చివరకు అనేక తర్జనభర్జనల తర్వాత , నేపాల్ లోని చైనా రాయబారి హావ్ యాంకీ ఎంటరై స్వయంగా నేపాల్ కమ్యూనిస్టు నేతలతోపాటు, ఇతర పార్టీల నేతలతో రాయబారాలు జరిపింది. అనంతరం నూతనంగా రూపొందించిన నేపాల్ మ్యాపులను నేపాల్ పార్లమెంటులో అతికష్టం మీద ఆమోదింప చేసుకుంది ఓలీ ప్రభుత్వం.

అయితే మళ్లీ ఇప్పుడు...తూర్పు లద్దాఖ్ లో ఇండో చైనా ల మధ్య లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళా..., నేపాల్ మరోసారి భారత్ ను రెచ్చగొట్టే చర్యలు దిగింది. నేపాల్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది కమ్యూనిస్టు నాయకులతో గ్రేటర్ నేపాల్ ప్రచారాన్ని మొదలు పెట్టింది ఓలీ ప్రభుత్వం. భారత్ లోని ఉత్తరాఖండ్, యూపీలోని కొన్ని ప్రాంతాలు, అలాగే బీహార్ రాష్ట్రంలోని భూభాగాలు, ఇంకా సిక్కిం కూడా గ్రేటర్ నేపాల్ దేశంలో భాగమట.! ముఖ్యంగా ఉత్తరాఖండ్ లోని నైనిటాల్, అలాగే డెహ్రాడూన్ నగరాలు సైతం నేపాల్ వేనట! 1816లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీతో ఆనాటి నేపాల్ పాలకులకు మధ్య జరిగిన సుగాలి ఒప్పందంలో నేపాల్ ప్రాంతాలు ఈస్టిండియా కంపెనీ చేతుల్లోకి వెళ్లాయని సరికొత్త వాదనలు మొదలు పెట్టింది. డ్రాగన్ చైనా కూడా తన సరిహద్దు దేశాల్లోని ప్రాంతాలపై కూడా ఇలాగే వివాదాలు సృష్టిస్తుంది. పాలానా సంవత్సరంలో మా రాజులు ఈ ప్రాంతాలను పరిపాలించారని..., అవన్ని కూడా తమ దేశంలో అంతర్భాగాలంటూ వితాండ వాదం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేపాల్ కూడా అదే బాటలో నడుస్తోందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు.

గత ఎన్నికల్లోనే... నేపాల్ కమ్యూనిస్టు పార్టీ గ్రేటర్ నేపాల్ అంశాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు. 2019 ఏప్రిల్ 8న యూఎన్ వేదికగా నేపాల్ పీఎం ఓలీ ఈ అంశాన్ని ఒకసారి ప్రస్తావించిన విషయాన్ని మర్చిపోరాదు. అయితే నేపాల్ ప్రధాని ఇలా వరుసగా యాంటి ఇండియా స్టాండ్ తీసుకోవడం వెనుక....పెద్ద మొత్తంలో చైనా ముడుపుల బాగోతం ఉందనే ప్రచారం ఇప్పుడు నేపాల్ లో జోరుగా సాగుతోంది. జెనీవాలోని ఓ బ్యాంక్ లో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ 41.34 కోట్లు డిపాజిట్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడూ పీఎం ఓలీ ప్రజల దృష్టిని మరల్చేందుకు.. గ్రేటర్ నేపాల్ ప్రచారాన్ని తెరపైకి తెచ్చాడని మరికొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.

#Nepal #GreaterNepal #China #KpSharma