అసద్‎ను చంపాలనుకున్న ట్రంప్..! ఎందుకో తెలుసా..?

Sep 17, Thu 2020 09:55 PM In Focus

తాను ఒకరిని చంపాలనుకున్నట్టు.. ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరి, ట్రంప్‌ ఎవరిని చంపాలనుకున్నాడో తెలుసా..? అతడే సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌. తాను అసద్ ను చంపించాలనుకున్నట్టు డోనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలాంటి ఆలోచన చేసినట్టు అంగీకరించారు ట్రంప్.

అసద్‌ను చంపిద్దామనుకున్నానని, ఈ విషయంలో ఓ నిర్ణయానికి కూడా వచ్చానని.. కానీ, అప్పట్లో రక్షణశాఖ కార్యదర్శిగా పనిచేసిన జేమ్స్‌ మాటిస్ ఇందుకు అంగీకరించలేదన్నారు ట్రంప్. మాటిస్ కారణంగానే తాను వెనక్కు తగ్గినట్టు తెలిపారు.

తన దృష్టిలో మాటిస్‌ ఒక దారుణమైన సైనిక జనరల్‌ అని.. అతని నాయకత్వం కూడా తీసికట్టుగానే ఉంటుందని ట్రంప్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, అసద్‌ను హత్య చేయించాలన్న నిర్ణయం అమలు కాకపోవడంపై తనకేమీ బాధగా లేదని కూడా అన్నారు.

అమెరికాకు చెందిన ప్రముఖ జర్నలిస్టు బాబ్ వుడ్‌వర్డ్ 2018లో రాసిన ఓ పుస్తకంలో అసద్‌ను మట్టుపెట్టాలని ట్రంప్‌ పథకం వేశారని తొలిసారిగా బయటపెట్టారు. 2017లో జరిగిన రసాయనిక దాడికి అసద్ ప్రభుత్వమే కారణమన్న ఆరోపణలు చుట్టుముట్టాయి. దీంతో.. అసద్‌ను చంపేందుకు ప్రణాళిక వేయాలంటూ ట్రంప్ అప్పటి రక్షణశాఖ కార్యదర్శి జేమ్స్‌ మాటిస్‌ను కోరారని వుడ్‌వర్డ్ తన పుస్తకంలో రాశారు.

కానీ, ట్రంప్‌ ఆదేశాలను జేమ్స్‌ మాటిస్ వ్యతిరేకించారు. దీంతో.. ఆ ప్లాన్‌కు అప్పట్లోనే ఫుల్‌స్టాప్‌ పడింది. ఆ విషయం కూడా వుడ్‌వర్డ్స్‌ తన పుస్తకంలో ప్రస్తావించారు. అయితే, ఈ విషయాన్ని ఇప్పటివరకూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఖండించారు. కానీ, ఇటీవల తొలిసారిగా ఆ ప్లాన్‌ వాస్తవమే అని ట్రంప్ అంగీకరించారు.

#Trump #BasharAlAssad #Syria #Assasination #Mattis #BobWoodward