రాజ్యసభ వేదికగా రాజ్ నాధ్ సింగ్ చైనాకు హెచ్చరిక

Sep 17, Thu 2020 09:53 PM In Focus

భారత సరిహద్దుల్లో చైనా వైఖరిని మరోసారి దుయ్యబట్టారు కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్. రాజ్యసభ వేదికగా డ్రాగన్ కంట్రీని హెచ్చరించారు. లద్దాఖ్ సరిహద్దులో భారత్, చైనా మధ్య కొన్ని రోజులుగా యుద్ధ వాతావరణ నెలకొంది. పోటా పోటీగా సైన్యం మోహరింపులతో ఏం క్షణం ఏం జరుగుతుందోన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో పరిస్థితులపై రాజ్యసభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతలను శాంతింపజేసేందుకు భారత్ కట్టుబడి ఉందని.. అదే క్రమంలో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎల్ఏసీ వెంబడి కవ్విస్తూ ఇరుదేశాల ఒప్పందాలను చైనా ఆర్మీ ఉల్లంఘిస్తోందని విమర్శించారు రాజ్‌నాథ్ సింగ్. సరిహద్దుల్లో చైనా నిర్మాణాలను చేపడుతోందని.. వారికి ధీటుగా భారత్ సైతం సరిహద్దు వెంబడి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. చైనా సైన్యం కదలికలపై నిఘా పెట్టినట్లు ఆయన తెలిపారు.

లద్దాఖ్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. 1962లో లద్దాఖ్‌లో చైనా 38 వేల చదరపు కి.మీ. ఆక్రమించిందన్నారు. అలాగే వివాదాస్పద ప్రాంతంలో వున్న నుంచి 5 వేల చదరపు కి.మీ. భారత భూభాగాన్ని పాకిస్థాన్‌ దాదాదత్తం చేయగా చైనా తీసుకుందన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని వేల చదరపు కి.మీ. భూభాగం తమదని చైనా వాదిస్తోందని చెప్పారు. 1988 తర్వాత భారత్‌-చైనా అనేక ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. 1988 నుంచి 2006 వరకు రెండు దేశాల మధ్య సరిహద్దు ఒప్పందాలు చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆ ఒప్పందాలను చైనా ఉల్లంఘించడం సరికాదని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. చైనా మాటమీద నిలబడం లేదని అనవసర వివాదాలతో దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని వెల్లడించారు. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం ఉండాలని భారత్‌ కోరుకుంటోందని చైనా మాత్రం సరిహద్దుల్లో భారత్‌ను కవ్విస్తోందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. చైనా బలగాల కవ్వింపులను భారత్‌ సైనికులు సమర్థవంతంగా అడ్డుకున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లద్దాఖ్‌ వెళ్లి భారత బలగాలకు భరోసా కల్పించారని చెప్పారు. చైనా బలగాల కదలికలపై నిఘా తీవ్రతరం చేశామన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాజ్‌నాథ్‌ సింగ్ స్పష్టం చేశారు.

#RajnathSingh #Warning #China #RajyaSabha