జగత్తు సృష్టికర్త విశ్వకర్మ.. నేడే అసలైన మేడే

Sep 17, Thu 2020 04:39 AM Bharateeyam

సెప్టెంబర్ 17వ తేదీకి ఎంతో విశిష్టత వుంది. నిజాం కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి లభించిన రోజు. అంతేకాదు, మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పుట్టిన రోజు కూడా ఈరోజే. సకల చరాచర సృష్టిని నిర్మించిన విశ్వకర్మ భగవానుని జయంతి కూడా ఈరోజే. అసలు ఎవరీ విశ్వకర్మ..? ఆయన ప్రాముఖ్యత ఏమిటి..?

ఋగ్వేదంలోనూ, కృష్ణ యజుర్వేదంలోనూ, శుక్ల యజుర్వేదంలోనూ.. విశ్వకర్మను సృష్టికర్తగా చెప్పబడింది. అధర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడింది. పురుష సూక్తంలో విరాట్ పురుషునిగా కీర్తించబడినాడు. సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా, సహస్ర పాదుడుగా, సహస్ర ముఖునిగా అన్ని వేదాలలో విశ్వకర్మ వర్ణించబడినాడు. సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త. వేదములు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొన్నాయి. సర్వ దిక్కులను పరికించు దృష్టి కలిగిన అమితశక్తి కలవాడు కనుకనే ఋగ్వేదం ఆయనను భగవంతునిగా పరిగణించింది. పంచభూతాలు, త్రిమూర్తులు, ఇంద్ర, సూర్య నక్షత్రాదులు ఉద్భవించికముందే విశ్వకర్మ స్వయంభునిగా అవతరించినట్లు మూలస్తభం అనే గ్రంథం ప్రకటిస్తోంది. మహాభారతం విశ్వకర్మను వేయి కళలకు అధినేతగా అభివర్ణించింది.

హిందూ పురాణాల ప్రకారం.. విశ్వకర్మ నాలుగు యుగాలలో ఎన్నో పట్టణాలను నిర్మించాడు. సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకాన్ని నిర్మించాడు. త్రేతాయుగంలో శివుని కోసం సువర్ణ లంకను నిర్మించాడు. ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని, కలియుగంలో హస్తినాపురం, ఇంద్రప్రస్థ నగరాలను నిర్మించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే విశ్వానికి ఆర్కిటెక్ట్ విశ్వకర్మ.

విశ్వకర్మ పంచముఖుడు. దశబాహుడు. సుత్తి, బాణం, త్రిశూలం, ధనుస్సు, చక్రం, శంఖం, ఢమరుకం, వీణ, పద్మం అభయ ముద్రలు ధరించి ఉంటాడు. ఇతడి వాహనం హంస. విరాట్ విశ్వకర్మ యొక్క పంచ ముఖాలను మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలుగా అభివర్ణిస్తారు. ఈ పంచబ్రహ్మల నుండి వారి సంతతి అయిన ఐదుగురు సానగ, సనాతన, ఆహభౌసన, ప్రత్నస, సుపర్ణస విశ్వబ్రాహ్మణులు ఉద్భవించారు.

విశ్వకర్మ ‘మను’ ముఖం నుంచి ఉద్భవించినవాడు ‘సానగ బ్రహ్మర్షి’. ఇతనికి మూలాధారం శివుడు. ఇతను చెప్పే శాస్త్రం తర్క శాస్త్రం. ఈయన వృత్తి అయోశిల్పి. అంటే ఇనుము పని. అంటే నేటి కమ్మరి వృత్తి అన్నమాట. వీరి గోత్రం ‘సాగన బ్రహ్మర్షి’ గోత్రం.

ఇక విశ్వకర్మ ‘మయ’ ముఖం నుంచి ఉద్భవించినవాడు ‘సనాతన బ్రహ్మర్షి’. ఇతనికి మూలాధారం విష్ణువు. ఇతను చెప్పే శాస్త్రం వ్యాకరణం. ఈయన వృత్తి దారు శిల్పి. అనగా కర్రపని. అంటే నేటి వడ్రంగి వృత్తికి ఇతనే మూల పురుషుడు. వీరి గోత్రం ‘సనాతన బ్రహ్మర్షి’ గోత్రం.

విశ్వకర్మ ‘త్వష్ట’ ముఖం నుండి వచ్చినవాడు ‘అహభౌసన బ్రహ్మర్షి’. ఈయనకు మూలాధారం బ్రహ్మ. ఇతను చెప్పే శాస్త్రం ధర్మశాస్త్రం. ఈయన వృతి తామ్ర శిల్పి. అంటే నేటి కంచరి వృత్తి. వీరి గోత్రం ‘త్వష్ట బ్రహ్మర్షి’ గోత్రం.

ఇక విశ్వకర్మ ‘విశ్వజ్ఞ’ ముఖం నుండి వచ్చినవాడు ‘ప్రత్నస బ్రహ్మర్షి’. ఈయనకు మూలాధారం ఇంద్రుడు. ఇతను చెప్పే శాస్త్రం మీమాంస. ఈయన వృతి శిలా శిల్పి. అంటే ఆలయాలకు శిల్పాలు చెక్కే స్తపతులకు ఈయనే మూల పురుషుడు. వీరి గోత్రం ‘ప్రత్నస బ్రహ్మర్షి’ గోత్రం.

చివరిగా విశ్వకర్మ ‘విశ్వజ్ఞ’ముఖం నుంచి వచ్చినవాడు ‘సువర్ణస బ్రహ్మర్షి’. ఈయనకు మూలాధారం సూర్యుడు. ఇతను చెప్పే శాస్త్రం వైద్యం, జ్యోతిష్యం. ఈయన వృత్తి స్వర్ణ శిల్పి. అంటే బంగారం పని. నేటి స్వర్ణకారులు ఈ విశ్వజ్ఞ బ్రహ్మర్షి సంతానమే. వీరి గోత్రం ‘విశ్వజ్ఞ బ్రహ్మర్షి’ గోత్రం.

అంటే నేడు విశ్వబ్రాహ్మణ కులస్తులుగా పిలువబడుతున్న.. కమ్మరి, వడ్రంగి, కంచరి, స్తపతి, స్వర్ణకార వృత్తులవారు ఈ పంచబ్రహ్మల సంతానమే. విశ్వకర్మ ముఖం నుంచి ఉద్భవించినవారే ఈ విశ్వబ్రాహ్మణులు. ఈ ఐదు వృత్తుల నుంచే సకల వృత్తులు ఉద్భవించాయని చెబుతారు. నిత్యావసర వస్తువులు మొదలు.. అద్భుత మందిరాలు, అజంతా-ఎల్లోరా గుహల వంటి చారిత్రక నిర్మాణాలెన్నో ఈ విశ్వబ్రాహ్మణుల ప్రతిభకు తార్కాణాలుగా నిలుస్తున్నాయి.

శ్రీమద్విరాట్‌ విశ్వకర్మ తొలిసారిగా దర్శనమిచ్చింది భాద్రపద శుద్ధ విదియ నాడు. కానీ ప్రతి సెప్టెంబరు 17న దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాన్ని జరుపడానికి ప్రత్యేక కారణం ఉంది. సౌరమానం ప్రకారం ప్రతిమాసంలో ఏర్పడే సంక్రమణాలు ఇంగ్లీష్ నెలలోని 17వ తేదీనే వస్తాయి. కాబట్టి తిథితో సంబంధం లేకుండా భాద్రపద మాసంలో వచ్చే కన్యాసంక్రమణాన్ని విశ్వకర్మ జయంతిగా నిర్వహిస్తారు. దక్షిణాదిన ఈ వేడుకలు కేవలం విశ్వబ్రాహ్మణులకే పరిమితం కాగా.. ఉత్తరాదిన కుల-మత బేధాలకు అతీతంగా కార్మికులంతా పరిశ్రమలలో, సంస్థలలో వైభవంగా జరుపుతారు. వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు. ఈ రోజు వివిధ వ్యాపార సంస్థలు విశ్వకర్మ అవార్డులను ప్రకటిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా మేడేను కార్మిక దినోత్సవంగా జరుపుతారు. మనదేశంలో కూడా మే ఫస్ట్ నే కార్మిక దినోత్సవం జరపుకుంటారు. కానీ, మేడే మనకు శ్రామిక దినోత్సవం కాదని, విరాట్ విశ్వకర్మ జయంతే భారతీయులకు శ్రామిక దినోత్సవం అని ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గతంలో వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను చాలామంది సమర్థిస్తారు. విశ్వానికే ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మ జయంతిని ఇంజనీరింగ్ దినోత్సవంగా జరుపుకోవాలన్న డిమాండ్ కూడా చాలాకాలంగా వినిపిస్తోంది. ఇదీ విశ్వకర్మ గురించిన వివరణ. నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు.

#Vishwakarma #VishwaBrahmin #Architect #MayDay #September17