భారత్ కు తిరిగొచ్చిన లక్ష్మణ సమేత సీతారాములు..!

Sep 16, Wed 2020 08:49 PM Bharateeyam

-- విజయనగర కాలం నాటి విగ్రహాలు తిరిగి భారత్ కు అప్పగింత
-- 42 ఏళ్ల క్రితం అపహరణకు గురైన విగ్రహాలు
-- లండన్ లోని ఇండియన్ ఎంబసీలో అప్పగింత కార్యక్రమం

దేశాల్ని కొల్లగొట్టడం.. సంపదను దోచుకోవడం.. సంస్కృతి సంప్రదాయాలను విధ్వంసం చేయడం.. ఇదీ బ్రిటిషర్లకు తెలిసిన విద్య. రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలనలో భారత్ ఎంతో కోల్పోయింది. ఎంతో విలువైన వారసత్వ సంపదను సరిహద్దులు దాటించారు బ్రిటిషర్లు. కొహినూర్ వజ్రం వంటి మనులు, మాణిక్యాలెన్నో తెల్లదొరల వశమయ్యాయి. మనకు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కూడా.. మన విలువైన సంపద ఎల్లలు దాటిన సందర్భాలున్నాయి. అలాంటివాటిలో మనులు, మాణిక్యాలే కాదు, వందలు, వేల ఏళ్ల నాటి విగ్రహాలు, కళాఖండాలు కూడా వున్నాయి. అయితే, భారత్ నుంచి దోపిడీకి గురైన విలువైన సంపద తిరిగి స్వదేశానికి చేరుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది.

విజయనగర సామ్రాజ్య కాలం నాటి విలువైన లక్ష్మణ సమేత సీతారాముల విగ్రహాలను బ్రిటిష్ ప్రభుత్వం భారత్ కు అప్పగించింది. తమిళనాడులోని విష్ణుదేవాలయం నుండి 1978లో ఈ విగ్రహాలు అపహరణకు గురయ్యాయి. ఆ అవి బ్రిటన్ లో ప్రత్యక్షమయ్యాయి. తాజాగా వాటిని లండన్ లోని భారత రాయబార కార్యాలయం ఇండియన్ హౌజ్ కి అప్పగించారు బ్రిటన్ పోలీసులు.

ఈ సందర్భంగా భారత హైకమిషనర్ భవనం, ఇండియన్ హౌజ్ లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో మూడు విలువైన విగ్రహాలను భారత అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమానికి లండన్ మెట్రోపొలిటన్ పోలీసులు, ఇండియా హౌజ్ సిబ్బంది హాజరయ్యారు. అటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖామంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ పూజారులు విగ్రహాలకు సంప్రదాయ పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా.. దోపిడీకి గురైన భారత వారసత్వ సంపదను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో.. భారత ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అన్నారు. ఇందులో భాగంగా విలువైన మూడు విగ్రహాలను తిరిగి పొందగలిగామని అన్నారు. 1947 నుంచి 2014 వరకు.. విదేశాల నుంచి కేవలం 13 కళాఖండాలు మాత్రమే తిరిగి భారత్ కు చేరాయని.. ఇక, 2014 నుంచి ఇప్పటివరకు 40 కి పైగా కళాఖండాలు తిరిగి మన దేశానికి అప్పగించబడ్డాయని తెలిపారు.

ఏమిటి ఈ విగ్రహాల ప్రాముఖ్యత..?
భారత్ అప్పగించబడిన లక్ష్మణ సమేత సీతారాముల విగ్రహాలు.. తమిళనాడులోని ఆనందమంగళం గ్రామానికి చెందినవి. ఇవి విజనగర కాలంలో అద్భుతంగా మలచబడిన కాంస్య విగ్రహాలు. గతేడాది ఓ వాలంటీర్ పంపిన ఫొటోల ఆధారంగా ఈ విగ్రహాలను గుర్తించినట్టు.. ఇండియన్ ప్రైడ్ ప్రాజెక్టుకు చెందిన ఎస్. విజయ్ కుమార్ తన నివేదికలో స్పష్టం చేశారు. తంజావూరు జిల్లా, మయూరం తాలూకా, ఆనందమంగళంలోని శ్రీ రాజగోపాలస్వామి ఆలయం నుంచి.. 1978లో ఈ విగ్రహమూర్తులు అపహరణకు గురయ్యాయి. ఆ విగ్రహాలతో వాలంటీర్ పంపిన ఫొటోలను సరిపోల్చారు.

తమిళనాడు ప్రభుత్వ విగ్రహాల విభాగం అధికారులు, లండన్ లోని భారత రాయబార కార్యాలయం, భారత పురావస్తు శాఖ సహకారంతో విగ్రహాల యొక్క మూలాలను గుర్తించారు. లండన్ లోని భారత హైకమిషనర్ ఫస్ట్ సెక్రెటరీ అయిన రాహుల్.. తొలిసారి ఈ మూర్తులను ఓ విగ్రహాల డీలర్ గుర్తించారు. అవి అపహరించబడిన విగ్రహాలని ఆ డీలర్ కు తెలియదు. అయితే, విగ్రహాల విశిష్టత గురించి చెప్పడంతో.. వాటిని అప్పగించడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

ఇక, విజయనగరం కాలం నాటి ఈ విగ్రహాల సమూహానికి చెందిన.. హనుమాన్ విగ్రహం ఒకటి ప్రస్తుతం సౌత్ ఈస్ట్ ఏషియా మ్యూజియంలో ప్రదర్శనకు వుంచినట్టు.. ఇండియన్ ప్రైడ్ ప్రాజెక్ట్ తెలిపింది. దానిని కూడా తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

ఇదిలావుంటే, నలందా లోని పురావస్తు శాఖ మ్యూజియం నుంచి దొంగిలించిబడిన.. 12వ శతాబ్దం నాటి బుద్ధ విగ్రహాన్ని 2018లో లండన్ పోలీసులు భారత్ కు అందజేశారు.

#IdolsOfIndia #IndianEmbassy #London