పాత ఫొటోతో కొత్త నాటకం..!

Sep 15, Tue 2020 08:46 PM In Focus

-- భారత్‎పై విషం చిమ్మిన పాక్ మీడియా
-- లద్ధాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ అనుకూల కథనాలు
-- సోషల్ మీడియాలో పాక్ జర్నలిస్టుల పైత్యం

భారత్‎పై విషం చిమ్మడంలో పాక్ మీడియా.. అక్కడి పాలకులను సైతం మించిపోతోంది. అబద్ధపు వార్తలను వండివారుస్తూ భారత ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. రెండేళ్ల క్రితం నాటి ఫొటో ఆధారంగా తప్పుడు కథనాలు అల్లి.. మన త్రివిధ దళాల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. లద్ధాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు అనుకూలంగా చిందులు తొక్కుతోంది పాక్ మీడియా.

పాకిస్తాన్ న్యూస్ యాంకర్ ముబాషెర్ లక్మన్.. రెండేళ్ల క్రితం నాటి ఫొటోనూ ట్విట్టర్‎లో పోస్ట్ చేస్తూ.. అబద్ధపు కథనం అల్లాడు. ‘భారతీయులారా.. లద్ధాక్‎లో కుప్పకూలిన ఎం-17 హెలికాప్టర్ మీదేనేమో దయచేసి చెక్ చేసుకోండి..? దీనిపై అప్‎డేట్ చేస్తూ వుంటాం’ అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం లద్ధాక్‎లో భారత్ - చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ కంట్రీకి అనుకూలంగా.. భారత ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా అబద్ధపు కథనాన్ని ప్రచారం చేశాడు.

ఇక, లక్మన్ ట్విట్టర్ పోస్టుకు వంతపాడుతూ.. మరో పాక్ ప్రబుద్ధుడు ఇక్బాల్ షహీన్ తన పైత్యాన్ని వెళ్లగక్కాడు. ఇండియన్ ఎయిర్‎ఫోర్స్‎కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్.. చైనా సరిహద్దుల్లో గుంజీలు తీస్తోందని వెటకారం ఆడాడు. జైద్ హమీద్ అనే మరో వ్యక్తి.. ఇండియన్ ఎంఐ-17 హెలికాప్టర్ లద్ధాక్‎లో కూలిపోయింది.. కశ్మీర్ నుంచి సమాచారం అందాల్సివుందంటూ పోస్ట్ చేశాడు.

పాకిస్తాన్ అబద్ధపు ప్రచారాన్ని పసిగట్టిన భారత యూజర్లు.. పాక్ కుటిల బుద్ధిని ఎండగట్టారు. అది 2018 నాటి ఫొటో అని.. కళ్లు దొబ్బాయా అంటూ విరుచుకుపడ్డారు.

ఇదీ అసలు నిజం..
నిజానికి, 2018 ఏప్రిల్ 3న మన వాయుసేన హెలికాప్టర్ ఎంఐ-17.. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లా కేదార్ నాథ్ వద్ద కుప్పకూలిపోయింది. హెలికాప్టర్ ను ల్యాండ్ చేస్తుండగా.. సాంకేతిక లోపం వల్ల మంటలు అంటుకోవడంతో ప్రమాదం సంభవించింది. నాటి ప్రమాదంలో ఇద్దరు పైలెట్లతో పాటు మొత్తం ఆరుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా అన్ని మీడియా ఛానెళ్లలో ప్రసారం అయింది. అయితే, రెండేళ్ల క్రితం నాటి ప్రమాదానికి సంబంధించిన.. హెలికాప్టర్ శకలాల ఫొటో పోస్టో చేసి.. తన పైత్యాన్ని చాటుకున్నారు టెర్రరిస్ట్ కంట్రీ పౌరులు.

#PakMedia #Mi17Helicaptor #Ladakh #Uttarakhand #KedarnathTemple #AircraftCrash