మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకమేనా..?

Sep 15, Tue 2020 08:42 PM In Focus

-- పోలీసుల డ్రోన్ కెమెరాకి చిక్కిన మావోయిస్టుల గుంపు

మావోయిస్టుల కదలికలపై నిఘా వుంచేందుకు పోలీసులు ఇప్పుడు సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా అత్యాధునిక డ్రోన్ పరికరాన్ని ఉపయోగించి నక్సల్స్ ను పసిగట్టారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. దండకారణ్యంలో స్వేచ్ఛగా తిరుగూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మావోయిస్టులు సంచరిస్తున్న ఈ వీడియోలో వందలాదిమంది వాగులు, వంకలు దాటుతూ కనిపించారు. అయితే వారి మనుగడే ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారే అవకాశాలున్నాయి. పెరుగుతున్న సాంకేతికతతో ఖచ్చితమైన సమాచారాన్ని సంపాదించి తద్వారా మావోయిస్టులను అడ్డుకట్ట వేయడానికి సిద్ధంగా వున్నారు రక్షకబటులు.

మావోయిస్టుల గుంపు దొరికిన ప్రాంతాన్ని జీపీఎస్‌తో అనుసంధానించి అక్షాంశరేఖాంశాల ఆధారంగా పోలీసులు తమ కార్యాచరణ రచిస్తున్నట్లు సమాచారం.. ఇలాంటి సమాచారం ద్వారా మావోయిస్టులు ఎంత మంది ఉన్నారు.. వారి చేతుల్లో ఉన్న ఆయుధాలు ఎలాంటివి.. బలం.. బలగం.. ఆయుధ సంపత్తి సైతం ఇప్పుడు పోలీసులకు సులువుగా.. పక్కాగా తెలిసే పరిస్థితి నెలకొంది.

తాజాగా పోలీసులు పెట్టిన నిఘాలో ఉలిక్కిపడే స్థాయిలో మావోయిస్టులు కనిపించారు. ఎంతో ఎత్తు నుంచి డ్రోన్‌ కెమెరాలో చిత్రీకరించిన వీడియోలో మావోయిస్టులు చీమల దండులా బారుగా సాగుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. వారంతా చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని సుక్మా, బీజపూర్‌, కిరండోల్‌ ప్రాంతాల నుంచి తెలంగాణ వైపుగా ప్రయాణిస్తున్నట్టు వారి ప్రయాణ దిశను బట్టి అంచనా వేస్తున్నారు. వందలాది మంది మావోయిస్టులు వాగు దాటుతున్న దృశ్యం మాత్రం సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్‌ పరిధిలోని పాలోడి అటవీప్రాంతంగా గుర్తించారు. చత్తీస్‌ఘడ్‌లో నిత్యం ఎదురుకాల్పులతో నిర్బందం పెరిగిపోవడంతో వీరంతా తెలంగాణ రాష్ట్రం దిశగా సాగుతున్నట్టు భావిస్తున్నారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సుదీర్ఘంగా ఉన్న చత్తీస్‌ఘడ్‌ సరిహద్దు నుంచి మావోయిస్టులు ఎప్పుడైనా గోదావరి దాటే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. తాకిడి ఎక్కువగా ఉండే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు సహా గోదావరి తీర ప్రాంతంలో నిఘా పెంచారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి పలుమార్లు వెల్లడైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం, గుండాల, చర్ల పోలీసుస్టేషన్ల పరిధిలోనూ, కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లోనూ పరస్పర ఎదురు కాల్పులు జరగడం, భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే ముగ్గురు మావోయిస్టులు మృతిచెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీస్‌ చీఫ్‌ మహేందర్‌రెడ్డి పలుమార్లు ఏజెన్సీలోని జిల్లాల్లో స్వయంగా పర్యటిస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

#Maoists #Drone #Police