సరిహద్దుల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్..!

Sep 15, Tue 2020 08:41 PM In Focus

-- హైస్పీడ్ కమ్యూనికేషన్ ను ఏర్పాటు చేసుకున్న చైనా
-- సరిహద్దుల్లో ఆప్టికల్ కేబుల్స్ ను గుర్తించిన భారత నిఘా వర్గాలు

సరిహద్దుల్లో ఇప్పటికే పెద్దయెత్తున బలగాలను మోహరిస్తూ కవ్వింపులకు దిగుతున్న చైనా.. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుంది. ప్యాంగాంగ్ సరస్సుకు దక్షిణం వైపున వున్న తూర్పు లద్దాక్ వరకు సీక్రెట్ గా ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకుంది. దీనిని భారత ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఇటీవల భారత బలగాలు పలు చైనీస్ క్యాంపులను స్వాధీనం చేసుకోవడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. దక్షిణ ప్యాంగాంగ్ సరస్సు దగ్గర ఏర్పాటు చేసిన ఈ కేబుళ్లను శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా భారత ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. హైస్పీడ్ కమ్యూనికేషన్ కోసం చైనా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ను ఏర్పాటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని.. భారత భద్రతాదళాల అధికారి ఒకరు తెలిపారు.

సరిహద్దుల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ఏర్పాటు చేయడం చైనాకు ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి చర్యలకు పాల్పండింది. నెల రోజుల క్రితం ప్యాంగాంగ్ సరస్సుకు ఉత్తరం వైపు కూడా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ఏర్పాటు చేయడాన్ని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. రానున్న శీతాకాలంలో ఇక్కడ భద్రతబలగాలకు పహారా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో హైస్పీడ్ కమ్యూనికేషన్స్ ద్వారా సరిహద్దుల్లో సమాచారాన్ని తెలుసుకునేందుకు చైనా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ను ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

దక్షిణ ప్యాంగాంగ్ సరస్సు పర్వత ప్రాంతాన్ని ఇటీవల భారత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇది చాలా కీలక ప్రాంతం. ఇక్కడి నుంచి చైనా బలగాల రాకపోకలను కనిపెట్టవచ్చు. అలాంటి కీలక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న కొన్ని వారాలకే.. చైనా ఆప్టికల్ కేబుల్స్ ఉదంతం వెలుగుచూసింది. ఇక, భారత్ స్వాధీనం చేసుకున్న ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని.. ఇది వాస్తవాధీన రేఖను ఉల్లంఘించడమేనని ఇప్పటికే చైనా స్టేట్మెంట్లు ఇస్తోంది. అంటే, భారత్ అక్కడి నుంచి వెళ్లిపోతే.. ఆప్టికల్ ఫైబర్స్ కేబుల్స్ ను విస్తృతం చేసుకోవాలని చైనా యోచిస్తోంది.

ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా సరిహద్దుల్లో పరిస్థితులను బేస్ క్యాంపు నుంచే సమీక్షించుకోవచ్చు. అంతేకాదు, సరిహద్దుల్లోని పరిస్థితులకు సంబంధించిన ఫొటోలు, డేటాను ఎప్పటికప్పుడు పంచుకునే వెసులుబాటు ఉంటుుంది. సంప్రదాయ మిల్ట్రీ కమ్యూనికేషన్ అయిన రేడియో కమ్యూనికేషన్ ఉపయోగించడం ఈ రోజుల్లో అంత శ్రేయస్కరం కాదు. రేడియో కమ్యూనికేషన్ ద్వారా మాట్లాడే మాటల్ని శత్రు సైన్యాలు గుర్తించే అవకాశం వుంది. అదే అత్యాధునిక ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థ ద్వారా ఇంటర్నెట్ ను ఉపయోగించి చేరే వేసే సమాచారం భద్రంగా వుంటుంది. ఇది అత్యంత సురక్షితమైన మార్గం. అందుకే సరిహద్దుల్లో చైనా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ను ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

#OpticalFiberCable #Lac #Ladakh #Chian #Pla #IndianIntelligence #HighSpeedCommunication