నీట్ ప్రవేశ పరీక్ష పై తమిళ పార్టీల కుటిల రాజకీయాలు

Sep 15, Tue 2020 04:09 AM Politics

ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువ..! మనం ఏది చెబితే అదే రైట్ అని నమ్మేస్తారు? ఇది మన దేశంలోని రాజకీయ పార్టీల భావన..! అందుకే నేమో.. స్కీమ్ ల మీద స్కీములు పేర్లు మార్చి తీసుకుని వస్తుంటాయి. అంతేకాదు అధికారంలో ఉన్నప్పుడు ఒకళా..., అధికారం పోయి విపక్షంలో ఉన్నప్పుడూ మరోకల మాట్లాడటం ఈ రాజకీయ పార్టీల నేతలకే చెల్లుతోంది. తమిళనాడులో వచ్చే ఏడాది మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలి. వారిలో భావోగ్వేదాలను రెచ్చగొట్టాలి.? రెచ్చగొట్టాలంటే ఒక విలన్ కావాలి. అంతా కేంద్రంలోని మోదీ సర్కారే చేసింది. మన పాలిట విలన్ మోదీ సర్కారేనంటూ జనాన్ని మోటివేట్ చేయాలి. ఇక మన గెలుపు ఖాయం..! ఇలానే తమిళనాడులో డీఎంకే కూటమి తన ఎన్నికల వ్యూహాలను రచిస్తోందా? అందుకోసం లేని సమస్యను సృష్టించి మరి తెరపైకి తీసుకువచ్చిందా?

నీట్ ఎగ్జామ్.! వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత ప్రవేశ పరీక్ష ఇది ! కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. చివరకు సుప్రీం కోర్టు ఆదేశాలతో అన్ని జాగ్రత్తలు తీసుకుని, ఈ పరీక్షను ప్రశాంతంగా ముగించాలని తీర్పును ఇచ్చింది. అయితే సెప్టెంబర్ 12 వ తేదీన నీట్ ప్రవేశ పరీక్షకు ముందు రోజు... ముగ్గురు విద్యార్థులు పరీక్ష భయంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇది జరగకూడని సంఘటన. ఈ విద్యార్థుల బలవన్మరణాన్ని తమిళనాడులోని డీఎంకే దాని మిత్రపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. దీనిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి రద్దు ప్రయత్నం చేస్తున్నాయి అంతేకాదు తమ పార్టీ అధికారంలోకి వస్తే నీట్ ఎగ్జామును రద్దు చేస్తామని డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ చెబుతున్నారు. బ్యాన్ నీట్.., సేవ్ తమిళనాడు అనే నినాదాన్ని ఇప్పుడు ఆ పార్టీ నేతలు తెరపైకి తీసుకువచ్చి విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారు.

డీఎంకే పార్టీ నేతలు... జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాలకు కలిపి ఓకే ఎంట్రాన్స్ ఎగ్జామ్ ఉండకూడదని ఎందుకు కొరుకుంటున్నారు? దీని వెనుక కేవలం రాజకీయ కారణాలకే కాకుండా.., తమిళనాడులోని మెడికల్ సీట్ల మాఫియా ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మెడికల్ సీట్ల కోసం..., తమిళనాడులో కోచింగ్ సెంటర్ల నుంచి మొదలు పెడితే.., ఎంట్రాన్స్ ఎగ్జామ్ వరకు, ఆ తర్వాత కౌన్సిలింగ్ లో సీట్ల కేటాయింపుల వరకు.., అంతా కూడా ఏటా వందల కోట్ల బిజినెస్ రన్ అవుతుందని అంటున్నారు. కోచింగ్ సెంటర్లు, మెడికల్ కాలేజీలు అన్ని కూడా పొలిటికల్ పార్టీల లీడర్ల కనుసన్నల్లోనే ఉంటాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

సెప్టెంబర్ 13వ తేదీన దేశ వ్యాప్తంగా 85 శాతం మంది విద్యార్థులు నీట్ ప్రవేశ పరీక్ష రాసినట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరిలో ర్యాంక్ హోల్డర్స్ అందరూ కూడా ఇక కాబోయే డాక్టర్లే..! దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు ఏడాది నీట్ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేస్తున్నారు. అయితే కొవిడ్ కారణంగా ఈ పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. అయితే తమిళనాడుకు చెందిన కొన్ని రాజకీయ పార్టీలు ఈ ఏడాది నీట్ పరీక్షను నిర్వహించకుండానే మెడికల్ కాలేజీ ప్రవేశానికి అనుమతించాలనే వాదనను తెరపైకి తెచ్చాయి. తమిళనాడు నుంచి దాదాపు 80 శాతానికి పైగా విద్యార్థులు నీట్ పరీక్ష కోసం దరాఖస్తు చేసుకున్నారు. తమిళనాడు వ్యాప్తంగా... 1.18 లక్ష మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వీరి కోసం తమిళనాడు వ్యాప్తంగా 238 సెంటర్లను ఏర్పాటు చేశారు.

ఇక...నీట్ విషయానికి వస్తే...2015లో జాతీయ స్థాయిలో కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నాటి నుంచే ఈ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. దేశంలో నీట్ ప్రవేశ పరీక్ష నరేంద్రమోదీ ప్రభుత్వం వల్లే వచ్చిందని తమిళనాడులోని ద్రవిడ పార్టీలు గత ఆరేళ్ళుగా పదే పదే ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. నిజానికి 2010లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే.., దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపునకు ఒకే కామన్ ఎంట్రన్స్ ఉండాలనే వాదన తెరపైకి వచ్చింది. అప్పటి యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే కీలక భాగస్వామి అనే విషయం మర్చిపోరాదు. 2013లో దీనిని ఆదరాబాదరగా అమలు చేసింది కూడా యూపీఏ ప్రభుత్వమే.! 2016 ఏప్రిల్ 13న మెడికల్ సీట్ల కేటాయింపులో నీట్ ర్యాంక్ ను తప్పనిసరి చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన విస్పష్టమైన తీర్పు మెడికల్ సీట్ల మాఫియా గుండెల్లో గుబులును రేపింది. అంతకు ముందు మెడికల్ సీటు కోసం విద్యార్థులు అందరూ కూడా వివిధ రాష్ట్రాలు నిర్వహించే ప్రవేశపరీక్షలు రాయాల్సి వచ్చేది. విద్యార్థులపై ఒత్తిడి కూడ త్రీవంగా ఉండేది. దేశ వ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించడం ద్వారా విద్యార్థుల కష్టాలు తీరాయి. అదే పనిగా ప్రైవేటు కాలేజీలు సీట్లు అమ్ముకోకుండా..., ఆలిండియా ర్యాంక్ హోల్డర్స్ కు తమకు నచ్చిన చోట మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

అంతేకాదు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు నీట్ ప్రవేశ పరీక్షను డీఎంకే పార్టీ గట్టిగా సమర్థించింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాకతో డీఎంకే పార్టీ క్రమంగా తన పార్టీ స్టాండ్ ను మార్చుకుని నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకించడం మొదలు పెట్టింది. తమిళనాడులోని ప్రైవేటు మెడికల్ కాలేజీలు... తప్పనిసరిగా 15 శాతం సీట్లలను ఆలిండియా కోటాలోనే భర్తీ చేయాలి. మిగిలిన 85 శాతం లో 42.5 శాతం సీట్లను స్టేట్ గవర్నమెంట్లు నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయాలి. మిగిలిన 42.5 శాతం కోటాను ప్రైవేటు కాలేజీలు మెనేజ్ మెంట్ కోటాలో భర్తీ చేసుకోవాలి. ఉదాహరణకు ఒక కాలేజీలో 150 మెడికల్ సీట్లు ఉంటే..., 63 సీట్ల వరకు రూ. కోటి నుంచి 5 కోట్ల రూపాయలకు పైగానే క్యాంపిటేషన్ ఫీజును వసూలు చేసి భర్తీ చేస్తారు. ఎప్పుడైతే సుప్రీం కోర్టు తన తీర్పు ద్వారా ఆలిండియా కోటా కింద 15 శాతం సీట్లను తప్పనిసరిగా భర్తీ చేయాలని తీర్పును ఇవ్వడం ప్రైవేటు కాలేజీలకు మింగుడు పడలేదు. మిగిలిన 85 శాతం నీట్ ర్యాంకింగ్ మెరిట్ ఆధారంగా భరర్తీ చేయాలి. అందులోనూ 69 శాతం కులాల వారీగా రిజర్వేషన్లను కచ్చితంగా పాటించాలి.

ఉదాహరణకు గత సంవత్సరం.. తమిళనాడులో 3050 మెడికల్ సీట్లు భర్తీ చేయాలని అనుకుందాం. కులాల వారీగా రిజర్వేషన్ల ప్రకారం 136 సీట్లు ఓసీలకు, 1594 సీట్లు బీసీలకు, 720 సీట్లు ఎంబీసీలకు, ఇక ఎస్సీ,ఎస్టీలకు 600 సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తమిళనాడులో 50 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 24 వరకు ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. వీటిలో 14 ప్రైవేటు కాలేజీలు అన్ని కూడా వివిధ సమయాల్లో డీఎంకే ప్రభుత్వం...అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసినవే.! తాము అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలోనూ డీఎంకే పార్టీ ప్రభుత్వం…, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు ఏ కోశన ప్రయత్నించలేదు. కానీ అదే సందర్భంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల ఏర్పాటను మాత్రం పోత్సహించేది. తమిళనాడులోని ప్రైవేటు కాలేజీల్లో పొలిటికల్ లీడర్లకు భాస్వామ్యం ఉన్న కాలేజీలు చాలానే ఉన్నాయనే ప్రచారం ఉంది. ప్రస్తుతం తమిళనాడులో మొత్తం 7550 మెడికల్ సీట్లు ఉండగా..., వీటిలో ప్రైవేటు కాలేజీల చేతుల్లో 3900 సీట్లు ఉన్నాయి. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడు స్టేట్ లో మరో 11 మెడికల్ కాలేజీల ఏర్పాటునకు అనుమతినిచ్చింది.

అయితే కేవలం తమ స్వార్థరాజకీయాల కోసం నీట్ పరీక్షపై లేని వివాదాన్ని డీఎంకే దాని మిత్రపక్షాలు సృష్టించాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సంవత్సరం మెడికల్ ఎగ్జామ్ ఎంట్రన్స్ నిర్వహించపోతే...వచ్చే ఏడాది కొత్తగా వచ్చిచేరే విద్యార్థులతో కలిసి వన్ ఇయర్ సీనియర్లు అయినా ఈ విద్యార్థులు కూడా వీళ్లతోపాటు కలిసి పరీక్షలు రాయాల్సి వచ్చేది. విద్యార్థుల మధ్య మరింత కాంపిటేషన్ పెరిగేది. డబ్బులున్నవారు మెడికల్ సీట్లను దక్కించుకునేవారు. వీటిని నివారించి మెరిట్ ఆధారంగా మెడికల్ సీట్లు భర్తీ కావాల్సిందేనంటూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును కేంద్రంలోని మోదీ సర్కార్ అమలు చేసింది అంతే.!

నీట్ ను వ్యతిరేకిస్తూ రాజకీయం చేసిన డీఎంకే మిత్రపక్షాలు… ప్రవేశ పరీక్షలు వాయిదా పడతాయని ప్రచారం చేశాయి. డీఎంకే చేసిన ఈ ప్రచారం మెడికల్ విద్యార్థులను మరింత గందరగోళానికి గురిచేసింది. ఫలితంగా తమిళనాడులో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ విద్యార్థుల కుటుంబాలను ఓదార్చేది ఎవరు? ఈ విద్యార్థుల బలవన్మరణానికి అసలు నేరస్థులు ఎవరు?

ఇక తమిళనాడులో విద్యార్థుల మరణాన్ని తట్టుకోలేక...కొంతమంది సినీ స్టార్లు ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలోనూ పరీక్షలు రాయాల్సి రావడమే తను తీవ్రంగా బాధిస్తుందని..., హీరో సూర్య ఆవేదన వ్యక్తం చేశాడు. డాక్టర్‌ కావాలని కలలు కన్న పేద విద్యార్థుల కలల్ని నీట్‌ చంపేసిందని..., విద్యార్థుల ఆత్మహత్య విషయంలో మేం మౌనంగా ఉండం.. అంటూ సూర్య ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆయనకు మద్దతుగా నెటిజన్లు కామెంట్లు చేశారు. SURIYAagainstNEET అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అదే విధంగా మరో నటుడు మాధవన్‌ కూడా స్పందిస్తూ.. ‘‘నీట్‌’ పరీక్ష ముందు రోజే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది నిజంగా ఎంతో బాధాకరం.. అది కేవలం ఓ పరీక్ష మాత్రమే, తీర్పు కాదు’ అని పేర్కొన్నారు. ఇదే సంఘటనపై విలక్షణ నటుడు మక్కల్ నీధి మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ కూడా కేంద్ర ప్రభుత్వదే తప్పు అంటూ మోదీ ప్రభుత్వాన్ని దోషిగా నిలిపే ప్రయత్నం చేశారు. మరోవైపు నీట్ వైద్య విద్యా ప్రవేశ పరీక్షపై హీరో సూర్య చేసిన కామెంట్ల కోర్టు ధిక్కారమేనని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి తేల్చారు. దీనిపై ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ కూడా రాశారు.

మొత్తానికి మెడికల్ సీట్ల మాఫియాకు తోడుగా...డీఎంకే వంటి రాజకీయ పార్టీలు పన్నిన రాజకీయ కుట్రలో... విద్యార్థుల మరణాన్ని తట్టుకోలేక పోయిన కొంతమంది సినీ తారలు సైతం తమకు తెలియకుండానే భాగస్వాములుగా మారిపోయారని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు హీరో సూర్య కోర్టు ధిక్కారణ అంశం తెరపైకి రావడంతో.., బాన్ నీట్, సేవ్ తమిళనాడు అనే ఎన్నికల నినాదం మరికొన్ని రోజులు లైవ్ లో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి కుటిల రాజకీయ పార్టీల కుట్రలపట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.

#Neet #TamilNadu #Politics #AssemblyElections #Dmk